Visakha Sagara Theeram
హాయ్ అండీ! నేను! విశాఖ సాగర తీరాన్ని!.ఆసియాలోనే అతి వేగంగా అబివృద్ది చెందుతున్న ఈ నగరానికి మరింత వన్నెతెచ్చిన గొప్పతనాన్ని.. నన్ను చూస్తే చూపు తిప్పుకోగలరా?. ఊహు!చూస్తుంటే చూడాలనే అనిపిస్తుంది.వదిలి రాబుద్ధి కాదు.ఎంత సేపైనా అలా ఉండిపోవాలనిపిస్తుంది. ఎందరో పర్యాటకుల మనసు దోచిన దాన్ని. రామకృష్ణ తీరం, రుషికొండతీరం, యారాడ తీరం,భీమిలి తీరం,గంగవరం తీరం ఇలా మరెన్నో తీరాలు మా విశాఖ సొంతమండి. డాల్ఫీన్స్ నోస్ కొండల్ని తాకుతూ,ఎంత ఉత్సాహంగా ఉరకలేస్తుంటానో రోజు. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులొస్తుంటే, ఆనందంతో పొంగి పొరలి,యింకా ఎగసి, ఎగసి పడుతుంటాను. నన్ను చూసిన సంతోషంలో చిన్న,పెద్ద అనకుండా కేరింతలు కొడుతూ,నేనొచ్చి పాదాలు తడుముతుంటే,మైమరచిపోయి ఇంకొచెం ముందుకు వచ్చేయడం అదీ చేస్తుంటారు. పాపం గల్లంతవుతుంటే నేను మాత్రం ఏం చెయ్యగలను! బాధపడటం తప్ప!. అప్పటికీ హెచ్చరిస్తుంటారు. వింటేనా!. పాపం నన్ను చూడ్డానికి వచ్చి నా పాల పడిపోయారంటే చెప్పలేని మనోవేదన అనుభవిస్తుంటాను. గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటూ రక్షించే ప్రయత్నం చేస్తున్నా,ఒక్కోసారి విఫలమవుతుంటుంది. ఎక్కడో పుట్టి, నాలో ఐక్యం కావటం మరువలేని విషాదం. అయ్యో! సరదాగా పిల్లలతో వచ్చి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని, గెంతులేసుకొని వెళ్లాల్సినవాళ్ళకి నే యిచ్చే బహుమతి ఇదేనా ! అనీ రోజుకి ఎన్నిసార్లనుకుంటానో, ఆ భగవంతుని కెరుక. ఇలా ఒకరోజు, రెండు రోజులు కాదు, ప్రతీసారి ఇటువంటి సంఘటనలు జరుగుతుండడం చూసి ఏం చెయ్యలేని నా నిస్సహాయతకు, నన్ను నేనే తిట్టుకుంటున్నాను. పిక్నిక్కి వచ్చినవాళ్లు, విద్యార్థిని విద్యార్థులు, టూరిస్టులు, వీళ్ళు, వాళ్ళు అంటూ లేకుండా ఎందర్నో పొట్టలో పెట్టుకుంటున్నాను కదా!. ఎంచక్కా జాగ్రత్త తీసుకొని రోజంతా వున్నా అనేవారు ఎవరున్నారు!. తనివితీరని నా అందాన్ని ఎంతసేపైనా వీక్షించవచ్చు.హాయిగా చల్లని గాలి పీలుస్తూ,పిడతకింద పప్పు, ఐస్క్రీములు, కాల్చిన మొక్కజొన్నపొత్తులు ఎంచక్కా తింటూ, చక్కటి ఫోటోలు తీసుకుంటూ, ఆ జ్ఞాపకాలు జీవితాంతం పదిలంగా అట్టిపెట్టుకు వెళ్తే ఎంత సంతోషం. అంతే గానీ నా దగ్గరకి వచ్చేసి, నన్ను రెచ్చగొట్టడం, ఫోటోలు దిగడం, ఆ తరవాత గగ్గోలు పెట్టిన, ఏంట్టి ఫలితం. నాచు పట్టిన రాళ్లు ఎక్కిపోవడం, భయం అనేది లేకుండా,జారితే ఎవవవుతుంది. అంచేత నా మాట వినండి. రండి. చూడండి. మళ్ళీ మళ్ళీ వస్తూవుండండి. మీ ఆనందమే నా ఆనందం.కానీ! నాకు మాత్రం చెడ్డ పేరు తీసుకురాకండి.నేనంటే ఏవనుకుంటున్నారు! నాగర్భంలో ఎన్ని ముత్యపు చిప్పలు, ఎన్నిజలపుష్పాలు. ఎన్నిరకాల సరుకులుఎగుమతులు,దిగుమతులు. ఎంత మంది గంగపుత్రులు నన్ను నమ్మి బతుకుతున్నారు. మరెంతోమంది కార్మికులకు ఉదర పోషణార్ధం ఉపయోగపడుతున్నాను. ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి నాపైనే. మరో విశేషం ఏవిటంటే, నన్ను ఆనుకొని అతి పొడవైన రోడ్డుమార్గం కూడా ఉండడం నా ప్రత్యేకత. భలేగా ఉంటుంది ప్రయాణిస్తుంటే. సహజమైన ఓడరేవుని నేనే. ఏ సినిమా యిక్కడ తీసిన, హిట్టే గాని ఫట్ అన్న ప్రేస్నేలేదు. లొకేషన్ అంటే మనమే. ఇండస్ట్రీ వాళ్లకి సెంటుమెంటుని కూడా. ఏ విదేశాల్లో తీశారో అన్న భావన ప్రేక్షకులకి కలగక మానదు. అంత గొప్పదాన్ని.బంగాళాఖాతమా! మజాకా!.దేశరక్షణకై పాటుపడుతున్న తూర్పు నావికాదళం నా సొంతం. ప్రపంచమంతా జై కొట్టిన ఘాజి సినిమాకి మూలకారణం నేనే. అందుకే నాకు చెప్పలేని గర్వం. రాబోయే రోజుల్లో ఇంకా ఆకర్షించే విధంగా తీర్చి దిద్దుతామని ప్రభుత్వం వారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ అందాల సుందరిని కనులారా కాంచండి. అభిమానించండి.ఆస్వాదించండి. ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోండి. వుంటాను.జర భద్రం.......ఇట్లు, సర్వేజనా సుఖినోభవంతు సాగరతీరం.......జయప్రభాశర్మ.
Comments
Post a Comment