"Nakkalollu"
అయ్యా నమస్కారం!.బాగున్నారా!. మరేంలేదు! నాగురించి చెప్పుకుందామని వచ్చానయ్యా!. కాస్త ఓపిగ్గా వినాలిమరి.మేము నక్కల కులస్తులం.నక్కలోళ్లు అంటారు మమ్మల్ని. మావృత్తి వేటాడ్డం. మేముకూడా సంచారజాతి కులస్తులమే. ఒకేదగ్గర నివాసముండకుండా ఊర్లు మారుతుంటాము.తెల్లారి లేచిన మొదలు మళ్ళీ చీకటి పడేవరకు చెట్లనక,పుట్లనక తిరిగి అలసి వస్తుంటాము. ఒంటిమీద చిన్న గోచీగుడ్డతప్ప,ఇంకేమి ధరించము. చేతిలో గునపము,బొరిగి మా ఆయుధాలు.మేము ఆడ,మగా అనీ లేకుండా ఇంటిల్లిపాది వేటకి వెళ్లి వస్తుంటాము. మా వేటలో ఎక్కువగా పాముల్ని వేటాడి పట్టుకుంటుంట్టాము. అందులో ప్రత్యేకంగా నాగుపాములు,జెర్రిపోతుల జాతికి సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తాము. అవి దొరికిన రోజు మా ఆనందానికి హద్దే ఉండదు. అంత సంబరపడిపోతాము.అవి ఎక్కడున్నా ఒడిసి పట్టుకోవడంలో సిద్ధహస్తులం మేమె. మేము కచ్చితంగా ఎక్కడఉన్నాయి కూడా చెప్పగలం.మానుంచి తప్పించ్చుకోవడం వాటి తరం కాదంటే నమ్ముతారా!. అందుకే పాము ఎవరింటికి వచ్చిన పల్లెల్లో మమ్మల్ని పిలిచి తీసుకెళ్లేవారు. మరి మాకు ఇలాంటి పాములు దొరికితే యెగిరి గంతులేస్తాము. వీటి చర్మాన్ని ఒలిచి ఊరబెట్టి ఉప్పులో,ఆపైన ఎండలో ఎండబెట్టి, అప్పుడు అమ్మకానికి పెడతాము. ఈ వ్యాపారం చేసి లబ్ది పొందినవారెందరో. మా కిచ్చేది కొన్ని రూపాయలు మాత్రమే. దానికే ఎంతో తృప్తిచెంది యింటికి కావాల్సిన సరుకులు తీసుకెళ్లి దినం గడుపుకుంటుంటాము. ఈ వ్యాపారం చట్టరీత్య నేరం కూడా.చాలా చాటుగా,అతి గుట్టుగా వ్యాపారం కొనసాగిస్తుంట్టారు. ఈ చర్మాలతో,బేగులూ,చెప్పులు,బెల్టులు, పర్సులు తయారుచేస్తుంటారట. ఇవి చాలా ఖరీదు పలుకుతాయట.ఒక్కోసారి మణికోసం కూడా ప్రయత్నం చెయ్యమంటారు. మాకు భయమంటూ అస్సలు తెలియదు.చిన్నపిల్లలు కూడా ఎటువంటి నాగునైనా పట్టెయ్యగలరు.వారికి వెన్నతో పెట్టిన విద్య. పంట పొలాల్లో ధాన్యం కోతలవగానే చేలలో వదిలి, ఆ తరువాత వోవులు అని ఎత్తి కల్లాలకి తీసుకెళ్లి కుప్పలేస్తారు. అది కనిపెట్టి ఎలకలు పొలాల్లో రంధ్రాలు ఏర్పరచుకొని ధాన్యం నిల్వచేసుకొని వుంచుకుంటాయి.ఒక బస్తావరకు కనీసం ధాన్యం ఉంటుంట్టాయి. మాకు అవి ఎక్కడుంటాయో ఇట్టే తెలుసుకొని, ఆ కన్నాలు తవ్వి తెచ్చుకుంటుంట్టాము. పందుల్ని పెంచుకొని, ఇంట ఏ శుభకార్యమైన వాటిని చంపి మాంసాహారంగా తినటం అంటే మాకెంతో యిష్టం.అలాగే పుట్టతేనె,పట్టుతేనే అంటూ తేనే పట్టుని కొట్టి అతి చాకచక్యంగా తెచ్చే సమర్ధత మాదే. ఇంకెవ్వరు అంత సాహసం చెయ్యలేరుగాక చెయ్యలేరు. తేనేపట్టుపట్టి, పిండి, అసలైన తేనే మీకిచ్చే ఘనత మా ఒక్కరిదే. అటువంటి మమ్మల్ని ప్రభుత్వం సహృదయంతో ఆదుకోవాలని,దానికి మీవంటి వారి తోడ్పాటు ఎంతైనా అవసరమని,మా జీవితంలో వెలుగు రావాలని,మాపిల్లలకు విద్యకవసరమైన ఏర్పాట్లు చేస్తారని ఆశిస్తూ,ఈ సంచారజాతిని ఆదుకుంట్టారని వేయికళ్లతో ఎదురుచూస్తూ.....ఇట్లు, మార్పంటూ లేని, నటనతెలియని నక్కలోళ్లు........జయప్రభాశర్మ.
Comments
Post a Comment