boodida gummadikaya
నాపేరేమో బూడిద గుమ్మడికాయ, పుల్లగుమ్మడి కాయ అని కూడా పిలుస్తారు. నేనంటే వల్లమాలిన ప్రేమ.కానీ గమ్మతేంటంటే నన్ను పెంచరు.ఎక్కడైనా తేరగా దొరికితే మాత్రం వదలరు. నా పుట్టుక సాధారణంగా పెంట కుప్పలమీద, వ్యర్ధపదార్ధాలు పడివున్నచోట ఎక్కువన్నమాట. నే పువ్వుపెట్టి అందుకొచ్చిన దగ్గరనుంచి నా వైపే చూపులన్నీ. లేతగావున్న పిందెలయితే సాంబారులో వేస్తె బాగుంటుందని కొందరు, కూరచేస్తే ఎంత రుచిగా ఉంటుందో అని కొందరు కోసేసి పట్టుకుపోతుంటారు. ఇంకొందరు ముదిరితే వడియాలు పెట్టుకోవచ్చని నావంకే ఎప్పుడు పెరుగుతానో అనీ ఒకటే ఆత్రంగా చూస్తూ వుంటారు. బజార్లో అమ్మకానికి పెడుతుంటారు. కానీ ఎందుకు డబ్బులు దండగని యిలా దోచేస్తూవుంటారు. మీకు తెలుసా ఆగ్రాలోనైతే నాతొ చేసిన స్వీటు అత్యద్భుతంగా ఉంటుంది. తింటుంటే తినాలనిపించేట్టు. ఆగ్రా రైల్వేస్టేషన్లో కూడా నన్ను అమ్మకానికి పెడతారు.మధురలో శ్రీకృష్ణపరమాత్ముడికి నన్నే నైవేద్యంగా కూడా సమర్పిస్తుంటారు. ఇహ ఎక్కడ దిష్టి తియ్యాలన్న నేను సిద్ధంగా ఉండాల్సిందే. గృహప్రవేశాలైతే ఇంటికి, ఇంటివారికి దిష్టి తగలకుండా వుండాలని, నన్ను యింటి ప్రవేశ ద్వారం వద్ద నన్ను వేలాడదీసివుంచుతారు. కాయ కోసిన తరువాత కూడా చాలా రోజులు దెబ్బ తగలకుండా ఉంటే ఎంచక్కా చెదరకుండా వుంటాను తెలుసా. దెబ్బ కాస్తైనా తగిలిందో బయటికి బాగా కనిపించిన కోసేసరికి లోపల కుళ్ళి పోతానన్నమాట. అందుకే అంటారు కుళ్ళుబోతు వాళ్ళని చూసి.పుల్లగుమ్మడికాయలా కనిపించరుగాని లోపలంతా కుళ్ళూ అని. ఆ ఇంకోటి. పౌడర్ ఎక్కువైనా వెక్కిరిస్తుంటారు. బూడిదగుమ్మడికాయలా మొహం నువ్వూనూ అని. మరి చెప్పకండి.నేను దైవంశసంభూతురాలిని అని తెలిసినా, నోరాగితే కదా. ఏవనుకుంటున్నారు, నేనంటే, ఆ పరమేశ్వర అంశమని భావిస్తూ అపారమైన భక్తి కనబరుస్తుంటారు. ఆడవాళ్లు నన్ను కోసి ముక్కలు చేయటానికి ముందుకు రారు. మగవాళ్ళు గాటు పెట్టిన తరువాత, అప్పుడు ముక్కలు చేసి వడియాలు చేసుకుంటారన్నమాట. ఆ వడియాలు పెట్టినప్పుడు కూడా వరుసగా మూడు వడియాలపై, పసుపు, కుంకుమ,పువ్వులు పెడతారు. అంత పూజితం నేను. నెలగంట పెట్టిన తరువాత నా జోలికి రానే రారు. ఎంతో తప్పుగా భావిస్తారు. మరి అలాంటి నన్ను, మీ పెరట్లో వేసి పెంచుతుంటే, ఎంత సంతోషపడతానో. ఎందుకంటే,స్థూలకాయులకు నా రసం వారానికొకసారి పట్టిస్తే ఒళ్ళు తీస్తారని, చక్కటి ఆరోగ్యం అందిస్తానని తెగ వ్యామోహపడిపోతున్నారు. మరి ఒక మంచిపనికోసం నేను మీ చెంతనుంటే, ఎంత బాగుంటుందో కదా.ఆలోచించండి. ఆదరించండి.వుంటాను. ఇట్లు, మీ బూడిద గుమ్మిడికాయ్.....జయప్రభాశర్మ.
Comments
Post a Comment