vanaprastha ashram
నవమాసాలు మోసి, పెంచి పెద్దచేసి, పిల్లలే సర్వస్వంగా భావించి, ఎన్నో త్యాగాలు చేసినా,గుర్తించని స్థాయికి ఎదిగి, కన్నతల్లితండ్రులే భారమని తలచి, ఎప్పుడు వదిలించుకుందామా అనీ, వెయ్యి పన్నాగాలు పన్ని, ఆఖరికి అనుకున్నంత పని చేసి చేతులు దులుపుకున్న ఘనులు మావారసులు. అనారోగ్యంతో బాధపడుతూ,కడుపుకింత తిండిలేకా,కట్టుకోడానికి మారు బట్టలేక,ఎవరికి చెప్పుకోవాలో మా బాధ తెలియక, ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాక, అందరు వున్నా,ఎవరు లేని అనాధల్లా ఉన్న మమ్ము ఆదుకొని అక్కున చేర్చుకున్న వృద్ధాశ్రమం మా వానప్రస్థాశ్రమం. ఇది మాలాంటి అభాగ్యుల పాలిట అదృష్ట నిలయం. మా కడుపున పుట్టకపోయిన, ఏ రక్త సంబంధం లేకపోయినా, ఏ జన్మలో మేము చేసుకున్న పుణ్యమో, ఏ ఋణానుబంధమో" నివాస్" అన్న పేరుతొ ఉన్న కొడుకుని మాకు భగవంతుడు ప్రసాదించాడని రోజు కనిపించని ఆ దేవుడికి , కనిపించే నివాసనే దేవుడిని ప్రత్యక్షంగా చూస్తూ మనసులో కృతఙ్ఞతలు తెలుపుకుంటుంటాము. అందుకే అంటారు," దైవం మానుష రూపేణా" అనీ. మనిషి రూపంలో భగవంతుడు వస్తాడని. ఆ బ్రహ్మ మనిషి బొమ్మ తయారు చేసి,ఊపిరిపోసి,అలసిపోయి,చివరిగా నుదుటి రాతరాసేవేళకి బహుశా పరాగ్గా రాసి, ఆ తరువాత నాలిక కరచుకొని,సవరించగా వచ్చిన ఫలితమేమో. లేకపోతె ఆశ్చర్యంగా లేదూ?. ఎవరు మేము? ఎవరు నివాసు?. ఆ మధ్య" వేంబూ"అనే మా తోటి సోదరి విపరీతమైన అనారోగ్యంతో బాధపడుతూ, ఒంటిపై పుండ్లు, రణములతో,రసులు కారుతూ, భరించలేని దుర్వాసనతో, ఒంటిపై ఎటువంటి ఆచ్చేదన లేక, అచేతనంగా పడి ఉన్న ఆమెను,దినపత్రికలో చూసిన వెంటనే, ఆమెను కనుగొని, కురుపులు శుభ్రం చేసి, తైల సంస్కారంలేక, ఎటువంటి సంరక్షణ లేక, యిబ్బంది పెడుతున్న శిరోజాలను తానె కత్తిరించి, స్నానం చేయించి, జిల్లా న్యాయాధికారి నుంచి అనుమతి తీసుకొని సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలిగా తయారు చేసినా ఘనత మా "నివాస్ బాబుది". యింకొక విషయం మా "వేంబూకి" తెలుగు అసలు రాదు. కారణమేమంటే ఆమె భాష తమిళం. యిప్పుడు మీరు చూస్తే యెంత ఆశ్చర్యపడతారో తెలుసా?. మేము మాట్లాడే తెలుగు అర్ధం చేసుకోవడము, చిరునవ్వుతో అందర్నీ పలకరించడము, చక్కని రూపం చూస్తుంటే మాకే అనిపిస్తుంది మన "వేంబూ యేనా" అనీ. మాకు చక్కని ఆహారం ఏపూటకాపూట, టీ, పాలు,పండ్లు, వారానికొకసారి,మాంసాహారులకు మాంసాహారం.చక్కటి పడక సదుపాయాలు, అందుబాటులో వైద్యం, మా వానప్రస్థాశ్రమం ప్రాంగణంలో శ్రీసీతారామలక్ష్మణులు, ఆంజనేయస్వామి విగ్రహాలు కొలువుతీరి వున్నాయి. ప్రతి రోజు ఉదయం సాయంత్రం మేమందరము భజనలు చేస్తూ ఉంటాము. మా భజనలకై నివాస్ బాబు సౌండ్ సిస్టం కూడా ఏర్పాటు చేయుట జరిగింది.శ్రీరామనవమికి మా అందరితో అంగరంగ వైభవంగా శ్రీసీతారామ కళ్యాణం జరుపుతుంటారు. ఇక్కడ గోవుల్ని సంరక్షిస్తూ, వాటి పాలతోటే మాకు కావాల్సిన పాలు,పెరుగు అందిస్తూవుంటారు. ఇంకో ప్రత్యేకత ఏవిటంటే,నెలవారీ వసతి,ఇతర సౌకర్యాలకై ఫీజులంటూ వుండవు. పిల్లలు, ఇతర బంధువులు ఎప్పుడైనా వచ్చి, మాట్లాడి వెళ్ళవచ్చు.మేము మానసికంగా బాధపడకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఏర్పాటు. తన భార్య పిల్లలతో కన్నా మాతోనే ఎక్కువ గడుపుతూ, మా కష్ట సుఖాలు చూస్తూ ఉన్న" నివాస్" బాబు మాకు దేవుడిచ్చిన వరం. వారొక్కరే కాకుండా వారి కుటుంబసభ్యుల తోడ్పాటుకూడా అభినందనీయం.ఎందరో అన్నార్తులకు అన్నంపెట్టి, దాహార్తులకు దాహం తీర్చే మనసున్న మంచి మనిషి. ఆధ్యాత్మికతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, మాకు ప్రశాంత వాతావరణం అందించ్చిన గొప్పతనం మా నివాసుబాబుది.ఎవరైనా మాగురించి తెలుసుకొని రావాలనుకుంటే, నివాసుగారి అనుమతి తీసుకొని,వాళ్లకి తోచిన పళ్ళు,స్వీట్లు,నిత్యావసర సరుకులు,బట్టలు మాకందజేసి, సరదాగా మమ్మల్ని ఉత్సాహపరచి,అన్ని మరచిపోయి, హాయిగా నవ్వుకోవాలని, చాల మంచి మనసున్న మారాజుల్ని చూస్తుంటే, మనసు ఎంతో తేలికై, మమ్మల్ని మేమె మరచిపోయి, చిన్నపిల్లలమై పోతాము. ఎందరో ప్రముఖులు,పెద్దలు,స్థానికుల అభిమానం చూరగొన్న వృద్ధాశ్రమం
మా ఆశ్రమం అని చెప్పటానికి మాకెంతో గర్వన్గా ఉంటుంది. మరి ఆ శ్రీ...నివాసుని ఆశీర్వచనాలు మా నివాసునిపై మెండుగా వుండాలని, నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో వుండాలని, మా ఆయుష్షు కూడపోసుకొని మరెందరికో సేవచేయాలని కోరుకుంటూ....చిన్న మనవి....తల్లితండ్రులు భారంగా భావించొద్దు, నిరాదరణకు గురిచేయొద్దు. అసహ్యించుకోవద్దు, వృద్ధాప్యం శాపం కాకూడదు.....ఉంటామండీ....నమస్కారం. ఇట్లు, కనని కన్నకొడుకు నివాసుబాబు వృద్ధాశ్రమం,వానప్రస్థాశ్రమం......జయప్రభాశర్మ.
Comments
Post a Comment