Adhurs Apartment 

ఏవిటీ! ఇండిపెండెంట్ హౌసా! కొంటావా!. వామ్మో! వద్దురా బాబూ! ఎవడుపడతాడు ఆ పాట్లన్ని.  ఎంచక్కా!అపార్టుమెంటనుకో! హేపీగా డబ్బులు పడేసి కొనేస్తే! మరి వెనక్కి తిరిగి చూడక్కర్లే. మొత్తం మీద కొట్టుకుపోతాయ్. కమిటీ ఉంటుంది కదా!...ఎంచక్కా వాళ్ళ బుర్ర తినొచ్చు! పొతే పోయాయి డబ్బులు! యెంత ఖర్చు పెట్టుకుంటున్నాం కాదు! ఇదొక లెక్కా!. సెల్లార్లో, మన ఫ్లోర్లో,బల్బు వెలగలేదనుకో, మోటార్ పనిచేయలేదనుకో,మెట్లు అపరిశుభ్రంగా వున్నాయనుకో,అపరిచితులెవరైనా మీదికొచ్చారనుకో, టేంకులో నీళ్లయిపోయాయనుకో, లిఫ్ట్ పనిచేయలేదనుకో, ప్రతీనెలా మనమిచ్చే రూపాయిలో తేడావచ్చిందనుకో! ఇంక చూస్కో! ఐపోయారే!.  అంతే కాదు! ఇంకా విను! వాచ్మెన్ ఉంటాడు. వాడ్ని పట్టుకొని రాచి రంపాన పెట్టొచ్చు. ఎందుకంటె,జీతానికి కుదుర్చుకున్నాము గనక!. కార్లు,బైకులు ధూళి దుమ్ము లేకుండా అదే పనిగా తుడుస్తుంటాడు. ఊరంతా చుట్టబెట్టి, ఏ అర్ధ రాత్రికో ఇల్లు చేరినా! దిగ్గున లేచి గేటు తేయాల్సిందే! లేదనుకో గూబ గుయ్యి మనిపించొచ్చు. మనం రాత్రనక, పగలనక పిలిచినప్పుడల్లా చచ్చినట్టు పలుకుతుంటాడు. కరెంటు పోగానే జెనరేటర్ ఆనవలేదనుకో చచ్చింది గొర్రె! విరుచుకు పడిపోవచ్చు. అంత హోదా అన్నమాట! ఏవనుకుంటున్నావో!. ఎంత ఎత్తుకి వెళ్లి కూర్చుంటే అంత సుఖమన్నమాట. మరేం  లేదు! దోమలు రావు, దొంగలు రాలేరు. హాయిగా గాలి పీల్చుకుంటూ, వచ్చే పోయేవాళ్ళని చూసుకుంటూ కాలక్షేపం ఎంత బాగా అవుతుందనుకుంటున్నావ్. పైగా పండగొచ్చినా, పబ్బాలొచ్చినా ఎంత హడావిడో. కొన్నిసార్లు వంట కూడా చేసుకోనక్కర్లేదు. అలాంటి అపార్టుమెంటు వొదిలేసి ఇండిపెండెంట్ యిల్లా?. నువ్వేం చేస్తున్నావో, ఎలా ఉన్నవో ఎవ్వరికైనా తెలుస్తుందా!పాడా!. క్షేమంగా ఉండగలవా? అర్ధరాత్రి అపరిచితులొచ్చి గలాటా చేసిన! అబ్బే! ఎవరు పలికేది!. బతికుంటే బలుసాకు!.  ఓ!..మొక్కైనా వేసుకోగలమా!అనీ!సాగతీయక! చెప్పింది విను. మూర్ఖత్వానికిపోక! ఈ గోడ మనది కాదు! ఆ గోడ మనది కాదు అనక. ఈ వాతావరణానికి అలవాటు పడితే వదలవుగాక వదలవు. అంత బాగుంటుంది. ఇకెందుకు ఆలస్యం. నాపైనే పెట్టు నీ ధ్యానం.ఓకే!కలుద్దాం!..ఇట్లు, బుకింగుకి ఎదురుచూస్తున్న అపార్టుమెంటు....జయప్రభాశర్మ.

Comments

Popular posts from this blog

Articles