MANCHI MUTYAM
మిల మిల మెరుస్తాను. నన్ను ధరిస్తే ఒంటికి చాలా మంచిది. అందంలో నాకు పోటీ ఎవరులేరు. పూర్వీకుల దగ్గరనుంచి ...ఇప్పటి తరం వరకు నేనంటే మహా మోజు. నన్ను పట్టుకొని ఎన్నోవాటితో పోలుస్తుంటారు.ఇంతకీ ఎవరమ్మా నువ్వు!...తెగ వాగుతున్నావ్!. వాగడమేమిటీ!నిజం చెబుతున్న. నా పేరు"ముత్యం". నేను కంటపడితే! వేలం వెర్రి!. వదుల్తారా!. మనదేశంలోనే కాదండీ! ఇతర దేశాల్లో కూడా తెగ వ్యామోహం. రక రకాల డిజైన్లతో, నన్ను కంఠాభరణాలు,లోలాకులు,చేతి వుంగరాలు, బ్రేసులెట్లు, చేతివాచీలు, గాజులు ఇలా ధరిస్తుంటే ఎంత ఆనందపడతానో!. నాపైన వాత్సల్యం రోజు రోజుకి పెరిగిపోతుంటే ఆశర్యమేస్తోంది. కెంపులు, పచ్చలతో చేసిన నగల్లో కూడా నే దర్శనమిస్తుంటాను. నవరత్నాలలో నేను ఒక స్థానం సంపాదించిన ఘనత నాది. జ్యోతిష్యులు! చాల మంది! నా గురించి చెబుతూ వుంటారు. ఎంతో మంచిదని, మీరనుకున్నవన్ని నెరవేరుతాయని, అందువల్ల ధరించండని. కెంపులు, పచ్చలు, వజ్రాలు, వైఢూర్యాలు ఎవరు పడితే వారు చూసుకోకుండా ధరించకూడదు. కానీ!నా విషయంలో అలా కాదు! ఎలాగైనా సద్దుకుపోతాను! ఎవర్ని యిబ్బంది పెట్టను!అందుకె చాలామంది పెద్ద పట్టించుకోరు! ఆ!పర్వాలేదు!మా ముత్యం మంచిదే అని. శ్రీరామ నవమి నాడైతే!నాదే హడావిడంతా!మరి!సీతారాముల కళ్యాణమహోత్సవానికి!తలంబ్రాల ఘట్టానికి నేనుండాల్సిందే కదా!. యీమధ్య కాలంలో చాలామంది ధనికులు కూడా వారి పెళ్లివేడుకలో నన్ను తలంబ్రాలకు తీసుకెళ్తున్నారు. ఇంకంతకంటె ఆనందం ఇంకేముంటుంది చెప్పండి!. మహారాజుల ఆస్థానంలో, రాజావారు వేంచేస్తూవుంటే, వారి మెడలో నేనే, రాణీ గారి సౌందర్యానికి కారణభూతురాలిని నేనే అనుటలో అతిశయోక్తి లేదు!. సందేహమా! వలదు! వలదు!. అంతటి ఘన చరిత్ర మనది. ఆ! యింకో విష్యం!ఆ పలువరస చూస్తే ముత్యాల్లా వున్నాయనుకో! అనీ!నవ్వితే ముత్యాలు రాలిపోతే, ఏరేసుకుంటామన?అనీ! అంటుంటే యెంత గర్వ పడుతుంటానో. ఎక్కడో సముద్ర గర్భంలో పుట్టిన నేను యిలా మీ అందరిని ఆనందపరుస్తున్నానంటే! యెంత సంతోషం. సినిమాల్లో కూడా నా పేరుతొ ఎన్ని హిట్ పాటలో!"ముత్యాల చెమ్మచెక్క", "హే ముత్య మల్లె", "ముత్యాల జల్లు కురిసే"! ఒకటా రెండా!. కాకపోతే ఒకటే బాధేస్తుంది! ఏంటంటే! పేదరికంలో వున్న స్త్రీలు, సంతల్లోనూ, గాజుల దుకాణాల్లోనూ, ముత్యాల్లా వున్నాయి కదూ! అంటూ! నన్ను కొని మెడలో వేసుకుని మురిసిపోతుంటే మాత్రం!గుండెలో కలుక్కుమంటుంది. అయ్యో పాపం! ఏం చెయ్యలేకపోతున్నానే అని!. ఆ!అవునట్టు మరచిపోయాను!హైదరాబాదు వెళ్లి నప్పుడు ఛార్మినార్కెళ్లి నన్ను చూడండి! కళ్ళు చెదరిపోయేలా వుంటాను!తెలుసా!ఒక్కసారైనా వెళ్లి రండి!నా అందం చూసి తరించండి!ఓకే! వుంటాను!బై!...ఇట్లు,మీ మెరిసే ముత్యం....జయప్రభాశర్మ.
Comments
Post a Comment