Articles

1.   Aha Agakarakai




వచ్చేసా.....ఎవరని అనుకుంటున్నారా.......నాకు తెల్సు......మీరనుకుంటారని.....ఆషాడం నుంచి.....నాకోసం వెతుకులాటే.....మిడిగుడ్లేసుకొని.....నే కనిపిస్తే.....పెద్ద నిధి దొరికినట్టే ఫీలింగు....అంత మోజన్న మాట ......నన్ను చూస్తే....యింకా మీకు వెలగలేదనుకుంటాను.......బాబోయ్......ఆగకరకాయనండి బాబూ.......ఉత్తరాంధ్ర పల్లెల్లో ఐతే......అంగాకరకాయ్ అని అంటారు...పొట్టిగా బుడతలా వుంటాను గాని......రుచి అద్భుతం ....అమోఘం.....తింటే వదలరు......లేకపోతె ఏంటీ......ఎక్కడో అడివిలో దుంప.....ఎవరు పాతేరని.....ఎవరు పెంచారని.....అక్కడ ...ఓ....తీగలు పాకిరేసి......కాయలు తెగ కాసేస్తుంటే.....ఏ మహానుభావుడు......డేగకళ్లు పెట్టుకొని కనిపెట్టేశాడో గాని.....తస్సాదియ్యా....అదిమొదలు నన్ను వదిలితే ఒట్టు.....పాపం నా అడివి బిడ్డల చెవిలో పువ్వులు బాగా పెట్టి.......బుట్టలు,బుట్టలు తెచ్చేసి......వ్యాపారం మూడు పువ్వులు.....ఆరు కాయలుగా చేస్తున్నారంటే.......నమ్ముతారా......అంత గిరాకీ అండి నాకు......కూరగాయాలన్నింటిలో.......ఆకాశాన్నంటే ధర నాదే......వందల్లో వుంటాను......నా రేంజె వేరు ......నన్ను తినాలంటే కాస్త అవస్థ పడక తప్పదు......ఏమంటే ఖర్చు అలాంటిది......శాకాహారులకు మాటల్లో చెప్పలేనంత ప్రీతికరమైన దాన్ని......మాంసాహారులైతే మాంసాన్ని తలపించేలా వుంది......అనీ కితాబందుకున్నదాన్ని .....పెద్ద పెద్ద విందులు ఏర్పాటు చేసినప్పుడు......నన్ను కూడా వేస్తే గొప్పన్న మాట.......ఉత్తరాదిలో కొన్ని జిల్లాల్లో ......నన్ను చూసినా పట్టించుకోరు.....నాకు నవ్వొస్తుంది.....యిలా చూస్తే మావాళ్లు కళ్ళకద్దుకొని......పట్టుకుపోరూ అనీ, ఐనా నా విలువ తెలిస్తే కదా.....నాలో ఎన్ని పోషక విలువలు.....మీ ఆరోగ్యానికి సంబంధించి .....యెంత మంచి లక్షణాలు......తినాలి మరి......నేను తూర్పు గోదావరి ఏజన్సీ ప్రాంతంలోనూ........ఉత్తరాంద్రా ఏజన్సీ ప్రాంతంలోనూ.......ఆదిలాబాద్ ఏజన్సీలలోను.......విరివిగా పండుతాను ......మీరేదో అన్ని కూరగాయల్లా......పండిద్దామని ప్రయత్నం చేసినా వృధా.....ఎందుకంటే మీరు పండిపోయిన గింజలు వేసేసి......అన్ని కూరగాయ మొక్కల్లా మొలుస్తుందేమో అని చూస్తే ......అబ్బే....ప్రశ్న లేదు......మొలవను గాక మొలవను......అడివిలో దుంప తెచ్చి పాతాల్సిందే.........అందుకే అంటున్నా...నా లెక్కే వేరని......తెలిసిందా....అంచేత మనం.....సంవత్సరానికోమారు.......కనిపిస్తుంటాము కాబట్టి......ఆకాశానంటే ధరలు.....చుక్కలు చూపిస్తోంది....సంసారం సాగరం......బతుకు జట్కా బండి.......యివన్నీ ఎంచక్కా పక్కన పడేసి.....చెంగు చెంగున గెంతులేసుకుంటూ.....నా దగ్గరకు రండి.....నన్ను తీసుకెళ్లండి.....మీ జిహ్వ చాపల్యాన్ని క్షోభ పెట్టకండి......ఆత్మారాముణ్ణి సంతోష పెట్టండి......ఏడిపించకండి....వస్తారు కదూ......మీ మార్కెట్లో.....అతి త్వరలో.....వస్తా......మీకై ఎదురుచూస్తూ......మీ ఆగాకరకాయ్.......
జయప్రభాశర్మ.

       2.  Kavigari Kavithvam


"అడిదం సూరకవిగారు" అందరిమీద పద్యాలు రాస్తుంటే....ఎంతో ఆనందంతో...... వారంతా ప్రశంసలు కురిపిస్తుండడం.....ఎంతో గొప్పగా చెప్పుకుంటుండడం....ఇదంతా చూసి.....వారి భార్యామణి.....అడిదంవారి దగ్గరకు వెళ్లి అడిగేరట.....ఎవని?....ఏవండీ!....అందరిమీద చక్కటి పద్యాలు రాస్తున్నారు కదా!......మన బాచన్న మీద ఒక పద్యం రాయరాదూ అని.....బాచన్న అంటే వారి పుత్రరత్నమన్నమాట.....అయ్యో అదెంతమాట....నువ్వడగడం....నేను కాదని చెప్పడమూనా.......యిప్పుడే రాస్తానని.....పద్యం రాసి.....యిదిగో....అని చేతిలో పెట్టి బయటికి వెళ్లిపోయారు....ఆ పద్యం యిలా రాసారు.
బాచా బూచుల లోపల బాచన్నే
పెద్ద బూచి పళ్లున్ తానున్
బూచెన్న రాత్రి వెరతుర్

మన బాచెన్నను చూచి పట్టపగలే వెరతుర్
ఇంతలో కవిగారి బావమరిది వచ్చి .....ఏవిటక్కా చూస్తున్నావ్ అంటే.....ఏవీలేదురా తమ్ముడు.....మీ బావగారికి......మన బాచన్న మీద పద్యం రాయమన్నానురా.....ఒకసారి చదివి వినిపించవూ.....అలాగే అక్కా.....అనీ...చదివి ఏం చెప్పాలో అర్ధం కాక....ఎటో చూస్తుంటే......చెప్పరా అనీ గదమాయిస్తే.....మరేం లేదక్కా....బూచీ,బూచీ అనీ చిన్న పిల్లల్ని భయపెడతారు చూడు.....వాళ్ళు భయపడతారనీ.వాడి కంటే భయం పడతారు వీడ్ని చూస్తే......పళ్ళూ వాడూను ....అనీ రాసారు బావ......ఆ మాట విని నివ్వెరపోయి...హవ్వ....యీయనకి తన పర బేధం లేదు కదా....బాచెన్నని యెంత పొగుడుతూ రాసారో అనుకున్నా....బావుందమ్మా...వరస......రానీ అడుగుతాను.....అనేప్పటికే.....రానే వచ్చారు కవిగారు...ఇదేవిటండి! బాచన్న మీద అలా రాసారు?......యిదేవైనా బాగుందా...అనీ అడిగేసరికి.....నిజం అంతే కదా మరి....అదే రాసాను.....అనీ అనేసరికి.....ఆ నిజాయితీకి ఎంతో మెచ్చుకోలుగా చూశారట భార్యామణి......అడిదం సూరకవిగారి ....నిష్కల్మషానికి యిది ఉదాహరణ మాత్రమే......అద్భుతమైన వారి రచనలెన్నో....ఇలాంటి కవిని స్మరించుకోవడం.....ఎంతో భాగ్యన్గా భావిస్తూ.....నమస్కారం......జయప్రభాశర్మ.

 3. Vankaya Stothram


ఓసోసి వంకాయ..నా స్మాలు వంకాయ
నా ఫ్రెష్షు వంకాయ..నా టేస్టు వంకాయ
నినుచూడగన్ పరుగెత్తి..మహ ఆనందమేసి
నోటినన్నీరు వూరేసి..టక్కున కొని తెచ్చేసి
గబుక్కునోమ్పేసి..నిన్ను కోసేసి
గాట్లు పెట్టేసి..గుండ కుక్కేసి
నూనె పోసేసి..మంట పెట్టేసి తిరగేసి..మరగేసి..ఒకపరి కలిపేసి
మూత పెట్టేసి..చిత్రహింసల్ పాల్జేసి
దంచేసి..రుబ్బేసి..కాల్చేసి

తొక్కల్ వొలిచేసి..పిసికేసి
ముద్దల్ కొట్టేసి..ముక్కల్ చేసేసి
మూడికల్ తుంచేసి..వేపడాల్ చేసేసి
కొత్తిమీర కారమ్ము..జీలకర్ర కారమ్ము
అల్లంకారమ్ము..మెంతికారమ్ము
ఉల్లి కారమ్ము..వెల్లుల్లికారమ్ము
మసాలాకారమ్ము..మరి వేరుకారమ్ము
సివంగి పుల్సులున్..ముక్కల్ పుల్సులున్
బండ పచ్చడిన్..పులుసుపచ్చడిన్
పెరుగు పచ్చడిన్..వంకాయ బజ్జీలన్
నిను మెచ్చుతున్..పోగుడుతున్ 
లొట్టలేస్తున్..ఆరగింతురున్..భోజనప్రియులెల్లరున్

నీ ముందున్..బెండెంత..దొండె౦త 
బీరెంత..చామెంత..నువ్వంతా
పుచ్చులన్..గిచ్చులన్

గింజలున్..గిడసలున్ 
ముల్లులున్..ముదురులున్

కనరులన్..లేకన్..నిత్య కంచమ్మునన్
ఘుమ ఘుమలాడుతున్...వండి వడ్డింతురందఱున్
వంకాయ రుచులన్..మరిగితె వదలరెవ్వరున్
వహ్వారే జిహ్వ లేచొచ్చున్..రెండు ముద్దల్ ఎక్కువ తిన్దుర్.
హరికథా పితామహులు "శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు" ఒకసారి మైసూర్ మహారాజావారి ఆస్థానంలో హరికథ చెబితే, రాజుగారు హరికథను విని ఎంతో ఆనందపడీ, ఏమి కావాలో కోరుకోమంటే, నాకేమి వద్దు, ఒక బుట్టెడు బెంగుళూరు వంకాయలు మాత్రం ఇప్పించండి అనీ కోరితే, రాజుగారు నవ్వి, ఇంత అల్ప సంతోషిని ఎక్కడ చూడలేదని మెచ్చి,వెంటనే బుట్టెడు వంకాయలతోపాటు బహుమానం కూడా యిచ్చి సత్కరించ్చి పంపారట. మరి వంకాయ గొప్పతనం అంతటిది......సరదాగా మీ అందరికోసం ఈ పద్యం.....జయప్రభాశర్మ.



4. Garikavalasa Agraharam


ఒకరోజు రాజుగారు వేటకి వెళ్లి తిరిగి వస్తుండగా...... చాలా ఆకలిగా ఉంటే ఒక చిన్న యిల్లు...కనబడితే.....బ్రాహ్మణులదని తెలిసి....అక్కడికి వెళ్లి...."అమ్మా" ఆకలిగా వుంది భోజనం పెట్టమ్మా......అనీ అడిగేసరికి ....ఏం చెప్పాలో అర్ధం కాకా,లేదని చెప్పలేక, సందిగ్దావస్థలోఉంటుండగా....రాజుగారు గ్రహించుకొని......ఏదున్నా పెట్టండమ్మా అనీ అనేప్పటికి....కాస్త స్థిమితపడీ.....పాపం నిరుపేద ఇల్లాలు....గబా గబా వంట చేసి వడ్డిస్తే......రాజుగారు తృప్తిగా భోంచేసి....ఎంతో సంబరపడి....చాల బాగుందమ్మా....నేను తిన్న ఆ పచ్చడి దేనితో చేసితిరి......అని అడిగేసరికి సిగ్గుతో చెప్పలేక చెప్పింది ......ఆ మహా యిల్లాలు.....నాయన! మా పెరటిలో వున్న గరిక వేళ్ళు తీసి....పచ్చడి చేశాను, తమరు ఆగ్రహించ వలదు....మన్నించండి....మహానుభావులు....మీముందు మేమెంత.....అనేసరికి...ఆశ్చర్యానికి లోనై.....అంతలోనే తేరుకొని.....రాజుగారు ఫక్కున నవ్వి.....భయపడవలదు.....మీరు చేసిన ఆపచ్చడి.....అత్భుతం అమోఘం.......చప్పట్లు కొడుతూ.....ఆనందం వ్యక్తం చేస్తున్నంతలో....అడిదం సూరకవిగారు వచ్చి .....మంచి కవిత్వం రాజుగారికి వినిపించేసరికి.....రాజుగారు పరమానందం చెంది.....ఇంత కమ్మని భోజనం పెట్టి, చక్కని కవిత్వం వినిపించినందుకు......మీకేం కావాలో కోరుకొనుడు.....అనీ అనేసరికి.....మీవంటివారు మావంటి వారియింట అడుగు పెట్టడమే.....మహాభాగ్యం......ఇంతకంటే ఇంకేం కావాలి.....అంటే.....అది విని రాజుగారు.....నేనెంత ధన్యుడనైతినో కదా....సద్బ్రాహ్మల యింట సాహిత్య భోజనం చేసితిని....అనీ చెప్పి....మాట వినిపించుకోకుండా......బహుమానంగా ఈ ప్రాంతం యిస్తున్నాను.....స్వీకరించుడు...అనీ....ఈనాముగా విజయనగర మహారాజు యివ్వడం జరిగింది......అందువల్ల.....గరికవేళ్ళ పచ్చడి తిని.....ఆ రుచికి మెచ్చి ఇచ్చినది కాబట్టి......గరికవలస అగ్రహారం అనీ పేరొచ్చింది......అక్కడి వారే .....కవివర్యులు....అడిదం సూరకవివారు.....మహానుభావులు....రేపు వారి గురించి మరి కొన్ని....నమస్కారం.......జయప్రభాశర్మ.

5. Save Trees


మీరు ఎంతో ప్రీతిగా పెంచి పెద్దచేసి.....ఎంతో ఆశగా చూసుకుంటారే......పెంచినట్టే పెంచి తెగ నరుకుతారే....ఆ నిర్భాగ్యురాల్ని నేనేనండీ.....మీ వృక్షాన్ని.....ఏం చెప్పమంటారు.....నా బాధ.....ఏవండీ.....తెలియకడుగుతాను......మీ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారండీ....మరి నన్ను అలాగే చూసుకుంటే వచ్చిన నష్టం ఏంటండీ......మీరు అతి అపురూపంగా చూసుకున్న పిల్లలు.......పెద్దైతే చూస్తారన్న ఆశ అడియాస కావచ్చేమో కానీ....నేనలా కాదండి.....నాటిన మొదలు.....అనేక విధాలా ఉపయోగ పడుతూ......విశ్వాసం కనబరుస్తుంటాను.....అలాంటి నన్ను నిర్దాక్షిన్యంగా నరికి ఆనందిస్తారా.....మీకు చల్లని నీడనిస్తాను........చక్కని ఆరోగ్యాన్నిస్తాను.....కాలుష్య భూతాన్నుంచి కాపాడతాను....స్వచ్ఛమైన గాలినిస్తాను.....మనం కూర్చున్న కొమ్మనే నరుక్కుంటామా.....చెప్పండి....రోజు రోజుకి భూతాపం పెరిగి.....యెంత ఇబ్బందికి గురి అవ్వాల్సి వస్తోంది.....ఎన్ని ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి.....రాబోయే రోజుల్లో యింకా.....ఎన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో......నన్ను యెంత పెంచితే అంత మంచిది.....అందువల్ల వానలు కురిసి.....ఉష్ణోగ్రతలు తగ్గి...... ఆనందంగా,ఆరోగ్యన్గా జీవించగలుగుతారు.......అంతే గాని....నా ఎదుగుదల చూసిన దగ్గరనుంచి .......నా మీదే దృష్టి పెట్టి......ఎప్పుడు కొట్టేద్దామా.....యెంత వేగం ఫర్నిచర్ చేయించేద్దామా, కబోర్డ్లు చేయించేసుకుందామా.....అనీ......ఆలోచించకండి.....నవమాసాలు కడుపులో మోసి....కనీ, పెంచీ పెద్ద చేసిన.....మీ పిల్లల గురించి ఎలా ఆలోచిస్తారో.....అలాగే నన్ను కూడా చూడండి......లేకపోతె కొన్నాళ్ళకు నా జాతే కనుమరుగయ్యే కాలం వస్తుందని.....హెచ్చరిస్తున్నాను.....అడవుల్ని కాపాడుకొనే భాద్యత మీదే.......పర్యావరణ పరిరక్షణకై పాటుపడండి.....ఎన్ని ప్రయోజనాలండి.....నా వల్ల.....గుబాళించే పువ్వులు, కమ్మని కాయలు, మధురమైన ఫలాలు, ఔషధ మొక్కలు.....ఎన్నని చెప్పను.....వేల గుణాలు, వెలలేని గుణాల వృక్షజాతిని.......నన్ను నేలమట్టం చేయకండి.....నన్ను పెంచండి.....మిమ్మల్ని మీరు కాపాడుకోండి....వృక్షో రక్షిత రక్షితః.....ప్రపంచంలోనే మొదటిస్థానంలో.....మన భారతదేశం నిలిచేలా ఉండాలి......అదే నా అభిమతం....నా ఆశయం......అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.....వుంటాను....ఇట్లు, మానవాళి మనుగడకై పాటుబడుతున్న మహావృక్షం......
జయప్రభాశర్మ.

6. Hats off Facebook


హాయ్....హౌ అర్ యు....ఇదెక్కడో విన్నట్టు వుంది కదూ....అవును మరీ.....రోజూ మామూలే కదా.....గెస్ చేసేసారు.....ఎస్.....నేనేనండీ మీ ఫేస్ బుక్కుని....మీ చేతి కీలుబొమ్మని.....మీ యిష్టం వొచ్చినట్లు ఆడుకుంటుంటారే...ఆ ఫేసుబుక్కు నేనండీ బాబు.....పుస్తకానికేనా రెస్టు ఉంటుందేమో గాని.....మనకి...అబ్బే.....ఒక్క సెకెను కూడా ఉంటే ఒట్టు......తిరిగి తిట్లు కూడాను......ఎప్పుడు చూసిన ఫేసుబుక్కేనా...అనీ...నేనేం చేశాను....ఎక్కడెక్కడివాళ్ళనో కలుపుతుంటాను......వివిధ రంగాలలో నిష్ణాతులైన వాళ్ళతో పరిచయాలు పెంచుతాను.....మీరు ఏ మంచిపని చేసినా అందరికి తెలియచేస్తాను....మీలో ఉన్న మంచి లక్షణాలు ఎందరికో చెప్పటానికి ప్రయత్నిస్తాను........చాలా మంది నన్ను చూసి విసుకుంటుంటారు......ఎందుకలా...కలసి చిన్నతనంలో తిరిగిన వాళ్ళు.....కలసి చదువుకున్నవాళ్ళు......దూర ప్రాంతాల్లో వుండే బంధువులు.....ఎందర్ని కలుపుతూంటానో......నేనేం చేసానని....నా తప్పైతే ఏం లేదు.....మంచి తలంపుతో వచ్చినదాన్ని.....ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుందండీ....మంచిగా వాడుకుంటే మంచిదాన్ని....చెడ్డగా వాడితే చెడ్డదాన్ని.....మీ జాగ్రత్తలో మీరుండాలి మరి.....నన్నాడిపోసుకుంటే ఎలా...మీ యింట్లో మీరు కూర్చొని ......నన్ను చూసుకుంటే చాలండీ.....ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మందితో ......స్నేహ సంబంధాలు ఏర్పరుస్తాను.....యెంత గొప్పదాన్నండి.....వహ్వా,వహ్వా అనీ..... నాకు నేనే బుజం తట్టుకోవలసివస్తోంది.....ఎక్కడో ఒకరిద్దరు....చీడపురుగులుంటే.....అందర్నీ అలా అనుకోవడం.....నన్ను చీదరించుకోవడం.....చాలా తప్పు.....మీకు కావాల్సిన....ఆటలు,పాటలు,నృత్యాలు.....పుట్టినరోజులు, నిశ్చితార్ధాలు, పెళ్లిళ్లు....ఎంత ఆనందాన్ని పంచుతానండి.....వీడియో లైవులు పెట్టి ఎంచక్కా మాట్లాడుతుంటే.....ఎంత ముచ్చటేస్తుందో....అదీ గాక ఫేసుబుక్కు స్నేహితుల కలయిక.....అదెంత బాగా చేసుకుంటున్నారో.....యివన్నీ ఆలోచించకుండా......ఆ......వాళ్లెవరో ముక్కు మొహం ఎరగని వాళ్ళు.....స్నేహానికి అభ్యర్ధన పెడితే ఆమోదించటవేవిఁటి....వాళ్ళ పలకరింపుకి మనం జవాబు యివ్వటమేమిటి.....వాళ్ళల్లో నిజమెంతో అబద్దమెంతో అని సందేహాలు....నిజమే చూసుకోవాలి.....కానీ వీళ్లల్లో ప్రముఖులుంటారు, పెద్దవయసు వారుంటారు.....చిన్నబోతారు కదా.....నోరు మంచైతే వూరు మంచిదన్నారు.....కాస్త తెలివిగా వ్యవహరిస్తే ......ఏ సమస్యలు రావు....నన్ను కనిపెట్టి, మీ అందరికి పరిచయం చేసిన...మహానుభావుడు మార్క్ జుకెర్బెర్గ్.....చిన్నవాడైన చేతులెత్తి దండం పెట్టాలి....మనసు వెన్న.....పిల్లాడు పుట్టాడని కొన్ని కోట్ల రూపాయలు......అనాధాశ్రమాలకి, ఎన్నో మంచి పనులకి యిచ్చిన త్యాగి....ప్రపంచం అంతా ముక్కుమీద వేలేసుకుంది....ఇది తెలిసి....అంచేత మీ అందరి ఆశీస్సులు వారికీ అందించండి.....మీ జాగ్రత్తలో మీరుంట్టూ......నన్ను బాగా చూసుకోండి....హేట్సాఫ్ ఫేస్ బుక్ అనండి.......మంచి నాలెడ్జి పెంచుకోండి.....మంచి స్నేహాన్ని విస్మరించకండి.....అలాగే స్నేహితులూ....పలకరించలేదని చిన్నబోకండి.....అర్ధం చేసుకోడానికి ప్రయత్నం చేయండి....వేల స్నేహితుల పలకరింపుకి .....సమాధానం ఇవ్వాలంటే కష్టమని తెలుసుకోండి....ఓకే..బై....ఇట్లు, ఫేసు లేని ఫేసుబుక్కు, ఎల్లప్పుడూ ఎవైలబుల్......
జయప్రభాశర్మ.

7.   Careless Cassette 


ఏపాట కావాలంటే ఆ పాట.....ఏమాట కావాలంటే ఆ మాట......ఎప్పుడు కావాలంటే అప్పుడు......ఎక్కడ కావాలంటే అక్కడ....ఏం వైభవం నాది....ఏ స్థాయిలో ఉండేదాన్ని.....అలాంటిది....ఇప్పుడా.....ఎవరు నువ్వు......అని అడుగుతుంటే యెంత బాధగా వుందో.....ఏంచేస్తాం.....చూస్తూ దిమ్మలా ఉండటం తప్పా....ఆ.... అసలు విషయం మరచిపోయాను.....యిది యెవర్రా బాబూ అనుకుంటున్నారు కదూ....అప్పట్లో మీకు మంచ్చి ఆనందాన్ని పంచేదాన్ని కదా.....కేండిల్ వెలుగులా వెలిగిన కేసెట్ని......పాత పాటలు,కొత్త పాటలు.... ఏ.ఎన్నార్, యెన్.టి,ఆర్, కృష్ణ, శోభనబాబు.....ఒకరా ఇద్దరా.....ఎవరివి కావాలంటే వారివి సిద్ధంగా ఉండేవి.....నన్ను కొని యింటికి తీసుకెళ్లి వేసుకొని.......యెంత మురిసిపోయేవారో......మాకిస్తే ఒక్కసారి ఆ పాటలు ఎక్కించుకొని ఇస్తామని తీసుకెళ్లేవారు.....స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారునూ....అంత గొప్పన్న మాట నేను....మొదట్లో టేపురికార్డర్లు పెద్దగా ఉండేవి.....ఆ తర్వాత జేబులో పట్టేట్టుగా వచ్చాయి.....కొంత కాలానికి సి.డి.లు అని వచ్చాయి......రిబ్బన్లు చుట్టేయటం, పట్టేయటం......అటువంటి తలనొప్పి లేకుండా.....చక్కా ప్లేట్లులా వున్నాయి సి.డి లని.....అనుకుంటే....

అవి లేకుండా ఇప్పుడైతే పెన్ డ్రైవ్ అని.....అది వొచ్చింది.......యిహ మీ యిష్టం ......ఎన్నైనా ఎక్కించేసుకొని....ఓ...చిందు లేస్తూ ......తందానాలే.....కనిపెట్టిన వాళ్ళు గొప్పవాళ్లే....కాదన్ను.....కానీ నా బాధల్లా.....ముందొచ్చిన కొమ్ములకంటే వెనకొచ్చిన కొమ్ములువాడి......అన్న సామెతలా.....యివన్నీ చూస్తుంటే.....గుండెలో కలుక్కు మంటుంది....యివన్నీ ఒక ఎత్తైతే.....ఆ సెల్ ఫోను లేదూ......దీని ఒయ్యారం ఉడతల పాలవ్వా....చస్తునాం....చూడలేకా......విటక్కు విరగబడిపోతోంది.....ఒళ్ళు మండిపోతోంది.....ఏవి రాలిపోతోందో......యిరవై నాలుగంటలూ చేతిలోనే కదా......మొత్తం ఏ టూ జెడ్ దాని దగ్గిరే ఉంటుందని...హమ్మో....వాటిల్లో మళ్ళీ ఎన్ని రకాలో....అయ్ ఫోను అట, ఆండ్రాయిడట, ఐపాడు అట..........మీరందరు ఏమూల నన్ను చూడండి అంటోంది.....ఏం చెయ్యలేని అసమర్ధురాలిని ఐపోయానని యెంత ఆవేదనగా వుందో......అప్పుడైతేనా......చిన్నపిల్లల చిట్టి చిట్టి మాటలు......బామ్మల పాటలు.....తాతగారి పద్యాలూ.....ఒకటేంటి....ఎన్నో.....అవన్నీ రికార్డ్ చేసి అట్టిపెట్టుకొని......మురిసిపోయేవారు.......గుర్తుగా వుంటాయని సంబరపడిపోయేవారు......టేపురికార్డర్లు ఎవరింట్లో వున్నా వారు.......ధనవంతులకింద లెక్కన్న మాట..........నన్ను సంచులకెత్తి మీదనెక్కడో పడేస్తే....అయ్యో....యెవర్రా యిలా చేస్తున్నారు.....ఏవైనా బాగుందా.....అనీ అడగాలనిపిస్తుంది.....ఏదీ....ఎక్కడ.....ఆ అవకాశం ఇస్తేనా....సరే.....వాళ్ళ ఆనందాన్ని ఎందుక్కాదనాలీ......మనిషి కంటే ఏదీ గొప్ప కాదు......అటువంటి మనిషి ఊపిరి ఆగితే.....ఉంచుతున్నారా.....నేనెంత.....సమర్ధించుకోక తప్పదు...... మంచి మంచి పాటలు వినండి.....ఆరోగ్యంగా వుండండి.....యిలా అన్నానని కోపం తెచ్చుకోకండి.....టాటా.....బై బై.....సి యు... యిట్లు,కేర్లెస్ కేసెట్......
జయప్రభాశర్మ.
8. Madhava Swami


ఏవండీ తెలియకడుగుతాను.....ఎప్పుడైనా వైజాగ్ వచ్చినపుడు....నాదగ్గరకు ఒక్కసారైనా వచ్చారా....నన్ను చూసారా....మీకు తెలియకపోతే తెలుసుకోవచ్చుగా......ఏవీలేదండి......నా గురించ్చి క్లుప్తంగా చెబుతాను వినండి....విశాఖపట్నం విమానాశ్రయం నుంచ్చి....పది నిమిషాల ప్రయాణమండి....నేషనల్ హైవే బిర్లా జంక్షన్ నుంచ్చి కొంచెం లోపలి వస్తే......అక్కడుంటాను....నేనెవరో తెలుసా....మాధవస్వామిని....రాధామాధవులంటారే.....ఆ స్వామిని....కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలసినవాడను.....చాళుక్య రాజుల కట్టడం.....నా దేవాలయం.....నా పేరు మీదే అత్యధిక జనాభా ఉన్న కాలనీ ......మాధవధార.....యి జనావాసాలకు అతి చేరువగా నా దేవాలయం ఉంటుంది....పచ్చని కొండలకు ఆనుకొని .....కొలువు తీరి వుంటాను.....ఎక్కడ పుట్టిందో .....ఎలా పుట్టిందో.....అంతులేని జలధారతో.....ఎందరికో ఆరోగ్యాన్నిస్తూ,ఆనందాన్నిస్తూ, ఫలసాయాన్నిస్తూ........గల గలా ప్రవహిస్తూనేవుంటుంది.....ఈ ధారకొచ్చి స్నానం చేస్తే....ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం....కార్తీకం, మాఘమాసాల్లో అత్యధికంగా భక్తులు దర్శించుకుంటారు......శివాలయం కూడా యిక్కడ ఉండటం విశేషం.....ఒక్కసారి చూశారంటే వొదల బుద్ధి కాదు....మధురాతిమధురమైన పనసపళ్ళను అందిచ్చే తోటలు......పరిమళాల సంపంగి తోటలు......తింటే మాధవధార పండే తినాలి.....కొంటె మాధవధార సంపంగె కొనాలి......అంత ప్రసిద్దన్నమాట.......ఇవే కాదు....జీడి, మావిడి తోటలెన్నో.....రక రకాల వృక్షాలు ఎంతో కనువిందు చేస్తుంటాయి.....కొన్ని ఎకరాల తోటలకు ఈ జలధారే సరిపడా నీరునందిస్తుంటుంది......ఎప్పుడు నీరు లేదన్న మాటుండదు......యి అందాల్ని వీక్షించడానికి ప్రత్యేకంగా వస్తూవుంటారు.....వనభోజనాలంటే.....చటుక్కున గుర్తొచ్చేది మాధవధారే.....నా కోవెలలో చిన్న సొరంగం కూడా వుంది.......అతి ముఖ్యమైన వాళ్ళకి తప్పా చూపించటం జరగదు.....యి సొరంగ మార్గం గుండా పూర్వం కాశీకి కాగడాలతో వెళ్లేవారని చెబుతుంటారు....మాఘశుద్ధ పౌర్ణమి నాడు మాధవ స్వామి కళ్యాణం అంగ రంగ వైభవంగా జరుపుతుంటారు.....యిది శ్రీ సింహాచల దేవస్థానం వారి ఆధ్వర్యంలోవుంది.....ఈ కొండ మెట్ల మార్గం గుండా కూడా సింహాచలం చేరుకొని....శ్రీ వరహాలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకోవచ్చు....ఎంతో మంది ఉత్సాహంగా వచ్చి పర్వతారోహణలు చేస్తూవుంటారు.....గిరిప్రదక్షిణ నాడైతే అత్యధిక భక్త జన సందోహంతో కోలాహల వాతావరణం నెలకొంటుంది.....యింకొక విశేషం .....కొన్ని వందలనాటి మర్రిచెట్టు దగ్గర.....బాక్సింగ్,కరాటే మొదలగు క్రీడలను .....ఉత్సాహంగా ప్రోత్సహిస్తూ ...... స్థానికులు శిక్షణ యిస్తూవుంటారు.....చూడ ముచ్చటగా ఉంటుంది...ఈ దృశ్యం......ప్రక్రుతి సోయగాల సుందరుడు ఎవరంటే.....మాధవుడే......మాధవధారే....ఈ ప్రాంతం వారికి నేను యిష్ట దైవాన్ని.....నగరం నడిబొడ్డున .....ఎంచక్కా కొండల మాటున వుంటూ......నా ఆశీర్వాదాలు అందిస్తూ ......కోరిన కోర్కెలు తీరుస్తూ.....వరాల స్వామిగా వేంచేసిన....నా రాక.....మాధవధార ప్రజలు ధన్యులు కదా. మీరు కూడా వచ్చి నన్ను దర్శించుకొని తరించండి....ఆయురారోగ్యఐశ్వర్య ప్రాప్తిరస్తు....యిట్లు,శుభాశీస్సులందించే మాధవస్వామి........ఓం శాంతిః, శాంతిః, శాంతిః.....................
జయప్రభాశర్మ.
9. Nice Colour


అమ్మో ఆ రంగు బొట్టు పెట్టుకోకూడదు......ఆ రంగు జాకెట్టేసుకోకూడదు......ఆ రంగు చీర కట్టుకోకూడదు.....అనీ వంకలు పెడుతుంటారే.....నన్ను చూసి......ఆ వంకర టింకర సో ...నేనేనండీ....నల్లరంగుని.....నేను శనినా.....మంచిదాన్నికాదా.....ఏంవాగుతున్నారు.....నోర్ముయ్యండెహె....మరెందుకమ్మా.....కాటుక కళ్ళకి మేత్తేసుకునీ.....కాటుక కళ్ళని.. ఓ...మురిసిపోతుంటారు...ఆ రంగు నేను గాక మరెవరమ్మా...మీరు పూజించే ఆ శ్రీ కృష్ణపరమాత్ముడు ......ఏ రంగు....పట్టుచీరల దగ్గరనుంచి, కాటంచీరలవరకు.....ఎగబడి కొనేస్తారు......ఆ రంగు లుక్కే వేరు అనుకుంటూ....నా అందమే వేరు....అదీగాక కొంచెం రంగు తక్కువ వున్నవాళ్లు వేసుకుంటే.....రంగు వున్నట్టుగా కూడా కనిపిస్తారు.....అంత మంచిగా వున్న నన్ను పట్టుకొని కడిగేస్తారా.....మీకెంత దైర్యం....మీ యింట్లో పెళ్లిళ్లు
జరిగితే....పెళ్ళికూతురికి,పెళ్లికొడుక్కి.....బుగ్గన దిష్టి చుక్క నేనే.....చంటి పిల్లలకు దిష్టి తగలకుండా నేనే......యిది కాకుండా అంగారు అనీ......ప్రత్యేకంగా తయారుచేసి నుదుట బొట్టు పెడతారు.....అది నేను కాదా......కార్తీకమాసంలో అయ్యప్ప దీక్షకి ......నన్నే కొని తీసుకెళ్లారు......యింకే రంగైనా వేసుకుంటారా.....అబ్బే......వేసుకోరుగాక వేసుకోరు.....అంత గొప్పదాన్ని......శనీశ్వరుని పూజకు నేనే సిద్ధంగా ఉండాలి.....శని పట్టి చీడపట్టిపోతారు మరి.....ఆ ఉద్ధరింపు నాకే.....నోరు జారకుండా....ఎంచక్కా అదుపులో పెట్టుకోండి.....మగమహారాజులైతే....మరి చెప్పక్కర్లే....నేను కచ్చితంగా ఉండాల్సిందే.....మోడల్సయితేనేమి, సినీఇండస్ట్రీవాల్లైతేనేమి.....కోట్లు ఖర్చుపెడుతూ......నా వెంటే పడుతుంటారు....అంతెందుకండి బాబూ.....మీ పిల్లల అక్షరాబ్యాసానికి.....ఏదీ....పలక...నేను కాదా
....ఓనమాలు దిద్దించట్లేదా.....వున్నత విద్యాబ్యాసానికి వెళ్లినా అక్కడ కూడా నేనే రెడీ.......కంప్యూటర్ అని తెగ రెచ్చిపోతారు.....దాని కీబోర్డ్ ఎవరమ్మా....నేనులేక మీరు లేరు......ఒప్పుకొని తీరాల్సిందే....చెప్పులు,బూట్లు.....నాకే మొదటి ప్రాధాన్యత...అంచేత....నాకింక కోపం తెప్పించకండి.... మీకు,మీపిల్లలకి, మీ యింటికి దిష్టినై వుంటా...అందాన్నిస్తా.....ఆనందం పంచుతా.....ఓకే....బై. ఇట్లు, నచ్చినా నచ్చనట్టు చెబుతున్న మీ నలుపు.......
జయప్రభాశర్మ.
10. Garam Garam Mirchi


కొంతకాలం ఆకుపచ్చగా,కొంతకాలం ఎర్రగా......ఆపైన పరమ ఘాటుగా......దుమ్ము రేపుతుంటాను...ఎక్కువ దక్షిణాదిన కనిపిస్తుంటాను....అదీ ఆంధ్రాలో మరీను....ఆ.....గ్రహించేసారు.......మరింకేం.......మిరపకాయిని.....ఆ మధ్య మన రవితేజ హీరోగా "మిరపకాయ్" అనీ.......నా పేరు మీదే సినిమా తీసారుకదా......యెంత హిట్టూ......అబ్బా...అనిపించింది నాకే.....అది చూసీ.......అంత గొప్పదాన్నన్నమాట....అసలు విషయానికొద్దాం......రోజూ కళ్ళిప్పిన దగ్గరనుంచి ......కళ్ళు మూసుకు పడుకొనేవరకు..... నా గోలే.....చిర్రెత్తుకొస్తుంది....అసలే మంటని.....ఇంకా యి మంటకి ఆ మంట తోడైతే.......పులుసు దిగిపోతుందని తగ్గుతున్నాను....లేకపోతె చుక్కలు చూపిద్దును.... పచ్చిమిరపకాయ లేకపోతె ఎండుమిరపకాయి.....చిటుకు చిటుకు ముక్కలు తుంచేసి......చాకు పెట్టి కోసేసి.......బండ పెట్టి బాదేసి....రుబ్బు రోట్లో వేసి రుబ్బేసి.....ఇప్పుడైతే యింకా కర్కశంగా మిక్సీలో పడేసి......ఒక్క నలుపు నలిపేసి పడేయడమే.....వామ్మో......మీరు మనుషులు కాదమ్మా.....రాక్షసవంశసంభూతులు.....ఇంత నరకం చూపిస్తారా....మసాలాకారాలు,ఆవకాయకారాలు, మెంతికారాలు, జీలకఱ్ఱకారాలు.......పచ్చళ్లకైతే బందరు మిరపకాయలే ఉండాలట.....దంపుడు కారం ఐతే....యిహ మాటలుండవట......అంత బ్రహ్మాండంగా ఉంటానట....యిది చాలక మా చెల్లి చీమమిరపకాయి .....దాన్నైతే అప్పడాలకి వడియాలకి....వెతుక్కు తెచ్చేసుకుంటారు......రంగు కనిపించక ఖారం ఎక్కువగా వుంటుందట.......అది ఉండాల్సిందే....ఆమ్మో...చాల ఖరీదు అనీ ఒకటే మూల్గులు......వీళ్ళ తిండి బద్దలైపోను......మా రైతన్నలు ఎంతో వ్యయప్రయాసలకోర్చి పండిస్తుంటే.....చీమ కుట్టినట్లేదు.....అలో లక్షణా అనీ ఏడుస్తున్నారు పాపం.....వాళ్ళ బాధ ఎవరు పట్టించుకునేది.....ఆ మధ్య ఐతే నన్ను కుక్కేసి మూటలకిమూటలు కట్టేసి.....మిర్చి యార్డు గుంటూరులో.....నన్నులెక్కలేనన్నిసంచులతో మూల పడేసి......కాపలా కాయలేకా.....గిట్టుబాటు ధర లేకా.....వాళ్ళ బాధ వర్ణనాతీతం......నాకైతే యెంత ఏడుపువచ్చిందో.....నిజంగా రైతు సోదరుడు గుడ్డ కప్పుకేడుస్తుంటే......మీరు కూడా చూసేవుంటారు....టి.విల్లో వాటిల్లో......ఆ...అవన్నీ మనకెందుకులే అన్న ధోరణి.....బజార్లో డబ్బులు పడేస్తే సరీ...వాళ్ళు అమ్ముతున్నారు...మనం కొంటున్నాం అంతే.....మనం మాత్రం ఏరాజు ఏరాజ్యం యేలునొ అన్నట్టువుంటున్నాం ... ఏదో అనుకుంటున్నారేమో.....నేనెంత రుచిగా ఉంటానో....అంత ప్రమాదికారినికూడా.....ఎసిడిటిలు అవి వొచ్చే అవకాశాలెక్కువని వైద్యులు అనగా విన్నా....తెగ పచ్చిమిరపకాయలు కొరికెయ్యడం.....మిరపపళ్ళ పచ్చడి అద్భుతః....అని లాగించేయడం తగ్గించండి.....మా రైతన్న బాధని ప్రభుత్వంవారు అర్ధం చేసుకోండి.....వారి మిరపతోటలో నవ్వుల పువ్వులు పూయించండి.....అదే మీకు శ్రీరామరక్ష......యిట్లు,ఘాటు మిరపకాయ్.
జయప్రభాశర్మ.

11. Whisky Visugu



నన్ను చూస్తే మైమరచిపోతారు......మైకం కమ్మేస్తుంది.....చుట్టూ పరిసరాలు గాని,ఇల్లు, పిల్లలు గాని.......కష్టం, సుఖం,మంచి,చెడ్డా గాని....ఏవి గుర్తుకురావు......ఒంటిమీద స్పృహ ఉండదు.....అంత మత్తులో తేలిపోతారు....ఈపాటికర్ధమైపోయుంటుంది...ఇంటి ఇల్లాలి ఉసురుపోసుకున్నదాన్ని.....పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టేదాన్ని.....మందునండీ బాబూ.....ఆరోగ్యం ఇచ్చే మందుకాదురా నాయనా ...మీకు అనారోగ్యం తెచ్చే మందుని.....అదే "మందు బాబులం మేము మందుబాబులం" అనీ ఆ మధ్య సినిమాలో వచ్చింది కదా.....ఆ మందుని.....సుబ్బరంగా ఇంత తిని హాయిగా పడుకోక....ఇంట్లోవాళ్ళని ఏడిపిస్తూ ఏమైనా బాగుందా.....బయటకెళ్లిన యజమాని ఎప్పుడొస్తాడా అని.....వేయికళ్లతో ఎదురుచూసే యిల్లాలికిచ్చే బహుమతి ఇదా....ఆ బండిమీద వస్తున్నప్పుడు.....ఏ గోతిలో పడ్డావో, ఏ కాల్వలో పడి కొట్టుకుంటున్నావో......ఏమైపోయావో....అసలు ఉన్నవో లేదో.....వస్తావో రావో....ఎన్ని సందేహాలు....యెంత ఆందోళన....నీకోసం అన్నీ చేసి అట్టిపెట్టి చూస్తూ......తినక, నిద్రపోక కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూపులు....రంకెలేసిందంటే వెయ్యదా మరి...ఈ అరుపులు కేకలకు పిల్లలు బిక్కు బిక్కుమని చూస్తూ భయపడటమా.....నీ యిల్లాలిమీద తిరిగి తిరుగుబాటా......దీన్నే అంటారు మొగుణ్ణి కొట్టి మొగసాలెక్కిందని....ఏం బావుకుంటావని నావల్ల....అనారోగ్యం, సమాజంలో పరువుపోవడం తప్పా......ఆ తాగుబోతోడా అంటే సిగ్గెయ్యదు....ఒళ్ళు,ఇల్లు కాలిపోవటం తప్పా ఒరిగేది ఏంలేదు......డిఫన్స్ మందా,ఫారిన్ మందా....ఏ మందైనా యిదే పరిస్థితి.....పార్టీ అనేసరికి....ఏంటి మందుందా?అని కొట్టుకుపోతావా.....నన్ను కనిపెట్టిన మహానుభావునకు శతకోటి....హూహూ....ఎందుకులెండి బయటకంటే బాగోదు.....మద్యపానాన్ని నిషేధించమని....అరిచీ గీ పెట్టినా వినిపించుకోరే.....అవునండీ నావల్ల వ్యాపారం ఎలా అంటే ఆలా ఉంటోంది......ఎందుకు నిషేధించాలి.....దీనికి ఒకటే మార్గం.....మీరందరూ నా జోలికి రాకుండా బుద్ధిగా ఉంటే...మద్యం దుకాణాలవాళ్ళు....చక్కగా చెక్క భజన చేసుకోవడమే.....అప్పుడొస్తారు పాకానికందరు....నేను బాధపడుతున్నా మనసులో.....అయ్యో..పతనమవడానికి కారణం నేనే అనీ......అంచేత....మీకు నా మనవి ఒక్కటే.....నేను కనిపిస్తే లొట్టలేయొద్దు.....లోపల తపన వెళ్ళు, వెళ్ళు, తాగు,తాగు అన్నా వినొద్దు.....ఎహె.పో..అని కసిరి....హాయిగా జీవించాలి......మీరు బాగుంటేనే.....మీ యిల్లాలు,పిల్లలూను... తల్లిదండ్రులకెంత క్షోభ....వారినికూడా మానసిక హింసకు గురిచేయకండి........ప్రభుత్వం వారూ......మీరు కూడా ఓ కన్ను వేయండి....మద్యం దుకాణాలపై....మీరు తల్చుకుంటే ఎంతసేపు.....నిషేదించటం.....ఆడపడచుల ఆనందమే ......మీ ఆనందంగా భావించండి.....మరి వింటారని ఆశిస్తున్నా.... మందువారి మంచిమాట.....మా గొప్ప ధనరాశి అనుకోండి....మీకో దండం.....వుంటానురా బాబూ....ఇట్లు,మహిళామణుల మాటలతూటాలకు నిత్యం బలవుతున్న మందు బాటిల్.
జయప్రభాశర్మ.

12. CHIII CHIPURU

నేనంటే అసహ్యం...పరమరోత.....చూస్తే కడుపులో తిప్పు.....గబ్బు కంపు.....అది నా బతుకు..... నా పేరు చెప్పాలంటే భయమేస్తోంది....ఐనా చెప్పాలి కదా.....చీపురుకట్టని....మీ యింటి తలుపు వెనకాల నన్ను దాచిపెడతారే.....ఆ దరిద్రకొట్టుదాన్ని నేనే.....మీ యిల్లు శుచిగాఉంచుతూ....మీ రగడలన్ని కడుగుతూ...ఎంచక్కా పరిశుబ్రతగా వుంచుతే....విశ్వాసమా ఏమైనా.....అంతేనండి....యింతే పెట్టిపుట్టాను..యెంత ఏడిస్తే ఏం ప్రయోజనం......ఒక్కదాన్ని ఆ మూల ఉండాలంటే.....యెంత కష్టంగా ఉంటుందో.....బోరు కొట్టదూ....పనికే పుట్టానా.....పోనీ మరో చీపురొస్తే......వీళ్ళకి తుప్పు....ఎదురెదురుగా గాని.....పక్క పక్కన గాని వుండకూడదట......ఏవంటే నే తుడుస్తానంటే నే తుడుస్తానని పోటీ పడతామట. .......అంటే లక్ష్మీదేవి తుడుచుకుపోతుందని.....అన్ని దరిద్రాలు తుడవడానికిమాత్రం నే సిద్ధంగా ఉండాలి.....బాలింతరాలు మంచం కింద నన్ను పెడతారు....మూసుకుండు అని...గాల్లు, దూళ్ళు వాలకుండా.....నే కాపు కాయాలి......చంటి పిల్లల్ని తీసుకొని బయటకి వెళ్లి వస్తే నన్ను రెడీ చేసి.....ఆ పిల్లలకి దబ్బు దబ్బు అని నేలకేసి బాదుకుంటూ దిష్టి తీయాల్సిందే......మీ స్నానాల గదులు కడగాలంటే.....ఫినాయిల్, యాసిడ్లు తెగ పోసేసి.....మంట పెట్టిన్చేసి......ఇంక పావుడే పావుడు.....నేనెలా పోయిన పర్వాలేదు.....మీ సుబ్బరమ్ మీకు ముఖ్యం...పూర్వం ఐతే పెరట్లో ఆకులు అలములు తప్పా....ఇంకేమైనా ఉండేవా తుడవడానికి.....కాలకృత్యాలు తీర్చుకోడానికి పాపం ఎక్కడికో పోయేవారు....యిప్పుడెక్కడున్నాయి పట్నాల్లో.....కొండలు కోనలు,పొలాలును....అన్ని యింట్లోనే.....మీ సంగతెలావున్నా....నాకు మరణ యాతనలా వుంది...యీమధ్య కాలంలో మిషన్లు వచ్చాయి......బతికిపోయాను.....నోరు లేని దాన్నని...యిష్టం వచ్చినట్టు ఆడుకుంటారా
....కొత్తగా యింటికి తెస్తే ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదట.....బుధవారమో,శనివారమో వాడాలట.....సందె వేళ యిల్లు తుడవకూడదట.....తెల్లారి నా మొఖం చూడకూడదట....ఓయబ్బో...చిన్నిలు.....నేనే లేకపోతె ఒక్క క్షణం గడుస్తుందా....ఆలోచించాలి....దయచేసి నన్ను చిన్నబుచ్చకండి.....యిటుపైన నన్నుకూడా బాగా చూసుకోండి....ఓకేనా.....చీపురుకట్ట తీసి బాదేస్తా అనకండి....యిట్లు,చీవాట్ల చీపురుకట్ట.
జయప్రభాశర్మ.

13. Kanipinchani Kullu


"ఏయ్" మిమ్మల్నే.....పిలుస్తున్నాను...వినిపించలే.....ఎటో చూస్తారేంటి.....తిరగండిటు....నా పేరేంటో తెలుసా.....కుళ్ళు....ఎప్పుడూ ఇలాంటి పేరు మీరు బహుశా వినలేదేమో.....థిస్ ఈజ్ ఫస్ట్ టైం అనుకుంటా......ఐన మనం చాల వెరైటీ ......ఒక రేంజ్ .....మనకొక లెక్కుంది.....చాల డిగ్నిటీగా ఉండటం చూసి.....ఏదో అనుకుంటున్నారేమో.....నో....బయటకి అలా కనిపిస్తాను .....అంత మాత్రం చేత ఏదో అనుకుంటే.....పప్పులో కాలేసినట్టే.....మీ అంచనాలన్నీ తారుమారే.......చాల అపాయకరమైనదాన్ని....నమ్ముతారా.....ఎందుకు నమ్ముతారూ......నవ్వుతు మాట్లాడుతుంటే...ఎవ్వరికైనా అనుమానం వస్తుందా.....చచ్చినా రాదు.....నేను మహా నటిని కదా.....నా సంగతి చెబుతాను యిప్పుడు వినండి......నాకు ఎదుటి పచ్చ కిట్టదు....ఎవరి ఎదుగుదల చూసి ఓర్వలేను......అందంగా ఉంట్టే కన్ను కుడుతుంది.....అభివృద్ధిలో పయనిస్తే అసూయ....ఎప్పుడూ ఒకరి పతనాన్ని కోరుకున్న నైజం నాది.....ఒకరి గొప్పతనాన్ని సహించలేను.....ఎవర్నైనా నా దగ్గర ప్రశంసించారో చచ్చేరే.....వినలేనుగాక వినలేను.....ఎక్కడికెళ్లినా భయం.......ఆమ్మో ఏ పొగడ్త వినాలో...
అని అదే ద్యాస.....ఎప్పుడు దేవుడా, దేవుడా ఎవరికి మంచి జరగనే జరగకూడదంటూ మొక్కులు....నా గురించి కంటే పక్కవారి గురించే ఆలోచన.....మారమని నా మనసు ఎన్నిసార్లు చెప్పిన....డోంట్ కేర్....నే ఎందుకు వినాలి....నేనింతే...ఒకరు చెప్పటం నేను వినటమే....ఏవండీ....రోడ్డు మీద చెత్త శుభ్రం చేయొచ్చు....కనిపిస్తుంది కాబట్టి.....కుళ్ళు పదార్ధాలు కనిపిస్తే శుభ్రం చేయొచ్చు.....ఎందుకంటె దుర్వాసన భరించలేం కాబట్టి.....నేనో...ఉరిపెట్టుకు చచ్చినా కనిపించను.....డాక్టర్స్ ...వారికే అంతుచిక్కని....ఏ స్కెనింగ్ చేసిన దొరకని దొంగనండీ బాబు...నన్నుసృష్టించిన బ్రహ్మ దిగిరావాలి తప్పితే....మీ వల్ల కానే కాదు.....ఎప్పుడూ నేనే గొప్పగా ఉండాలి.....నాకే అన్ని ఉండాలి అనుకునే స్వార్ధం నాది.....మా అక్క వుందేం....దాని పేరు మంచి....ఎప్పుడూ కల్మషం లేక....కిల కిల నవ్వుతూ.....గల గలా మాట్లాడుతూ ఉంటుంది లెండి....అది తప్పు అలా వుండకూడదంటుంది ..మనకవేమి పడవు...మన ధోరణే మనది....మా అక్క మంచిని చూస్తున్నా కదా.....ఏదోలే అన్నట్టు చూస్తారంతా...చాల్లే ఆపు అన్నా వినదు....నీ ఖర్మ అనీ వదిలేసా....ఇదండీ.....నా గుణం....అంచేత తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని....వార్నింగ్ ఇస్తున్నా....నాకు మంచి మాటలు గాని.....ఉపకారాలు గాని......మంచి మంచి పన్లుగాని.....ఒంట కెక్కవు.....నా ఆశ పెట్టుకుని తిరిగినా వేస్టు.....కాలం వృధా.....తస్మాత్ జాగ్రత్త.....బై. యిట్లు,కంటికగుపించని,మీ కుళ్ళు. జయప్రభాశర్మ.

14. Adire Chappal


చెప్పు తీసుకొని కొడతాను.....నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి...ఏంటండీ యిది....ఏమైనా బాగుందా...ఇంకేదీ దొరకలేదా .....నేనేనా....నాకిది నచ్చడం లేదు.....అంత అలుసుగా ఉన్నానా ....మీ యింటి తలుపు తాళం పడిందంటే టక్కుమని నేనుండాల్సిందే.......లేకపోతె కుదరదు....ముసలోళ్లనుంచి చిన్నపిల్లలవరకు అందరికి నేనే.....ఒక్క నిముషం వుండగలరా నన్ను వదలి.... బయటకి వెళుతున్నారు అంటే అంటిపెట్టుకుండాల్సిందే....మళ్ళీ నేనంటే మాత్రం మహా చులకన....అసలైన పాదసేవ అంటే నాదే.....కాదనమనండి చూస్తాను....మీ పాదాలకు యెంత రక్షణగా వుంటాను.....అందుకే నన్ను పాదరక్షలు అంటారు.. ఏ మహానుభావుడు పెట్టాడో అంత చక్కటి నామధేయం.....లేకపోతె ఏంటి ..... ఎండలో వెళ్తున్నప్పుడు....ఏమాత్రం కందిపోకుండా.....వానాకాలంలో ఒరిసిపోకుండా......గాజుపెంకులు, ముళ్ళు గుచ్చుకోకుండా......విష జంతువులూ అవి కుట్టకుండా.....యెంత అపురూపంగా చూస్తానూ....ఒక్క క్షణమైనా నన్నొదిలి వుండగలరా.....హబ్బే.....ఎలా కుదురుతుంది.....కదా....మరి నా సంగతి ఆలోచించండి....మీరు బురదలో కాలేసిన.....అశుద్ధాన్ని తొక్కినా నాకుమాత్రం అసహ్యం వెయ్యేదేం....నోరా పాడా.....అడిగినవాళ్ళెవ్వరూ........మీ ఇష్టారాజ్యం.....ఏవి గుచ్చుకున్న బాధ భరించాల్సిందే...మీరు ఘుమ ఘుమలాడుతూ సెంట్లు పూసుకొని తిరుగుతుంటే.....నాకు లోపల మంట పుట్టుకొస్తుందీ...యిలా ఆలా కాదు....దానికి తోడు యీమధ్య కాలంలో వేలకు వేలు పెట్టి కొనేసుకొని......ఫోజ్ కొడ్తుంటే.....ఏడుస్తుంటే ఎక్కిరించినట్టనిపిస్తోంది.....బూట్లయితే మరీను కాలుమీద కాలేసుకొని...ఓ...డాబు దర్పం....మాటల్లేవ్....ఏం చేస్తాం....రాజే కింకరుడు.....కింకరుడే రాజగు అన్నట్టు....వీళ్ళకి బాబులాగా మళ్ళీ జన్మలోనైనా మనిషిగా పుట్టాలి......అదే నా కోరిక....ఏం చెప్తాం....ఎంతని చెప్తాం....ఆఖరికి గుడికి వెళ్లినా నా పైనే దృష్టి.....నన్నేదొంగ పట్టుకుపోతాడో అనీ....ఆ కాసేపైనా దేవుని ధ్యానించుకుందామని ఉండదు......ఒకవేళ తస్కరణం భవేత్ ఐతే...పోనీలెండి దరిద్రం వదిలేసింది....పోయేయని అంటూవుండకూడదు....అది మంచిది కాదు.....అంత ఛండాలంగా చూడ్డం ఎంతవరకు సమంజసం....మీరు షుగర్ వ్యాధిగ్రస్తులైతే....హాయిగా నడవాలని....యిబ్బంది పెట్టకుండా ఉండాలని....వైద్యులు చెప్పిన చెప్పునై అక్కడ కూడా నేనే కదండీ....అందువల్ల నా మనసు గాయపరచకుండా.....రంగు రంగుల చెప్పులు, రక రకాల మోడల్సుతో అదరగొట్టండి.....వేల విలువైన బూట్లు వేసుకోండి....పాపం ఫార్మల్ గా ఉండాలికదా..... ఆఫీసుకెళ్ళినా ఇంటర్వ్యూలకెళ్లినా .....అలాగే ఎంచక్కా కాబోయే అల్లుళ్ళకి కూడా..... మంచి మంచివి కొని పెట్టండి.....మీ శ్రేయస్సే నా అభిలాష.....నా ఆకాంక్ష.....అన్యదా భావించకండి....అపార్ధం చేసుకోకండి.......నా ఆవేదన యిదంతా....అవునట్టు చెప్పడం మర్చిపోయాను.....నన్నే నమ్ముకొని .....ఎండకి ఎండి వానకు తడుస్తూ......నన్ను రిపేరు చేస్తుంటారే.....పాపం వాళ్ళైతే దేవుడి బొమ్మ పెట్టుకొని పని మొదలెడతారు..యి చిన్నిలన్ని మీకే...వాళ్ళకదేం లేదు....చూస్తే జాలేస్తుంది......ఏం చేయలేని అసమర్ధురాలిని కదా.....సరే మరి...వెళ్ళొస్తా అనను ..ఎందుకంటే.... మిమ్మల్ని ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండాలిగా అందుకు....మూలకు పోతా. యిట్లు, మీ చెప్పు.
జయప్రభాశర్మ.

15. Pelli Pallaki


పెళ్లి అనగానే ముందు నేనుండాల్సిందే.....నాకు పిలుపు రావాల్సిందే....అంత ఉబలాటపడేవారు....పిలుపు అందుకోవడమే తడవు......ఉరుకులు, పరుగులు పెట్టి....అలంకరణతో సిద్ధం కావాల్సిందే....."పల్లకిలో పెళ్లికూతురు రాణిలా వుంది".....అని చక్కటి పాట వుంది చూసేరూ.....ఆ...ఆ పల్లకీని......రక రకాల గాజుగొట్టాలు, పూసలతో నన్ను యెంత బాగా అలంకరణ చేసేవారో.....మెరిసి పడిపోయేదాన్ని.....పూర్వం రాణీవాస స్త్రీలు, జమీందార్లు ఎక్కడికైనా వెళ్లాలంటే....ఒక పెట్టిలా ఉండి రెండువైపులా ఎక్కడానికి, దిగడానికి,గాలివేయడానికి...... కొంచెం ఖాళీగ ఉంచి
....ఎవరికి కనిపించకుండా తెరలు ఏర్పాటు చేసేవారు....దీన్ని సవ్వారి అనేవారు...ముందు మంది మార్బలం....ఈటెలు,బల్లలు పట్టుకొని రక్షక భటులు నడుస్తుంటే.....ఆ వెనకాల బోయలు నడిచేవారు.....వీరికి ఆలా సేవ చేసినందుకుగాను.....ఈనాములిచ్చేవారు.....ఇది రజక వృత్తి వారు మాత్రమే చేసేవారు...కాలక్రమేణా మార్పు వచ్చి పల్లకీ....అని అత్యత్భుతంగా ఏర్పాటు చేయబడింది....సవ్వారి మారుతీ కారులాంటిదైతే....పల్లకీ బెంజ్ కారులాంటిదన్నమాట.....ఇది వెదురుబొంగులతో మోయడానికి వీలుగా వంచి తయారుచేసేవారు.....పెళ్లికూతురు కూర్చోడానికి కింద బొంతలు పరిచేవారు.... కనీసం పదిమంది బోయలు వచ్చేవారు.....కొంత దూరం వరకు కొందరు.....ఆ తరువాత మరికొందరు పంచుకునేవారు....ప్రాంతాలను బట్టి పాటలు పాడుకుంటూ...."ఏకో రామ్ బాకో రామ్" అనీ....."తిరువాడ పిల్లా మహా తిప్పులాడి" అనీ.....నడవడం కాకుండా పరుగులే......యింకా అలసట వస్తే .....ఒక దగ్గర నిలువుగా కర్ర బలమైనది ....ముందు కొకటి వెనుక ఒకటి పాతిపెట్టి.....పల్లకీని ఆ కర్రలపై ఉంచి అలసట తీరగానే......మళ్ళీ పయన మయ్యేవారు... బలమైన వాళ్ళైతే ముందు యిద్దరు...వెనక యిద్దరు ఉండేవారు.....కొంచెం బలహీనులైతే....ముందు ముగ్గురు...వెనక ముగ్గురన్నమాట....యింకా అవసరమైతే మిగతావారుండేవారు...ఒక గ్రామం నుంచి వేరే గ్రామం కి పెళ్లికూతురు పల్లకీ వస్తోందంటే....గ్రామంలోని ఒకటే సందడి.....ఇప్పటి హీరో, హీరోయిన్లని చూడ్డానికి ఎలా యెగపడుతున్నారో అలా.....డబ్బు, ధనం ఆశించేవారు కాదు.....ఇరు పెళ్లిపెద్దలు బహుమానంగా ఏది యిస్తే అదే పుచ్చుకొనేవారు.....పెళ్ళివారి విందు ఆరగించి యెంత సంబరపడిపోయేవారో.....అలా ఉండేది నా చరిత్ర....ఇప్పుడా...లక్షలకి లక్షలు ఖర్చుపెట్టి పల్లకీ అంటే....గుండార్చుకుపోతోంది.....ఐతే పూర్వ సంప్రదాయం ...మరుగున పడకుండా .....నన్ను మర్చిపోకుండా వున్నందుకు.....మహదానంద పడుతున్నాను....ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటూ.....తమర్ని సెలవ్ అడుగుతూ, ఇట్లు, మీరు మెచ్చే పల్లె పల్లకి....ముత్యాల పల్లకి.
జయప్రభాశర్మ.

16. Sabash Chodi


నూటికి తొంబైమంది నావెంటే పడతారు....నేనంటే పడి చస్తారు....నువ్వు రావాలి, రావాలి అని లాకెళ్తారు....నువ్వుంటేనే మేముంటామంటారు...తెలిసిపోయింది కదూ....ఆ....చోడినండీ....అదే మీ పట్నాల్లో రాగి మాల్ట్ అని ఉదయాన్నే పొట్టలో పోస్తారు కదా.....ఆ పిండిని.....ఒకప్పుడు యెంత వేళాకోళం చేసేవారో.....నా వైపు కన్నెత్తి ఐన చూసేవారా.....యిప్పుడు తెలిసింది మనమంటే ఏంటో.....సంచులు సంచులు చోళ్ళు కొనేసుకొని పిళ్లు ఆడించేయడమే.....అవును మరి నా సద్గుణాలు అటువంటివి...పల్లెల్లో రైతన్నలు మాత్రం నన్ను ఎప్పుడూ ఒకలాగే చూస్తున్నారు....శ్రద్ధగా పంటపండించుకుంటూ....వాళ్ళకి యెంత యిష్టమో నేనంటే.....లేత వెన్ను చూసి ఎంచక్కా కాల్చుకొనిగాని,పచ్చివైనా గాని తింటారు....కొంచెం ముదిరితే వెన్నులు తెచ్చి కాల్చి......వాటిని బాగా నలిపి నువ్వుల పప్పు కలిపి ఎంతో ప్రీతిగా తింటారు....ఇక పంటకి అందుకు రాగానే....కోత కోసి బాగా ఎండబెట్టి....ఆపైన వెన్నుల్ని దులిపి....చెరిగి, బాగు చేసి, గాలారబోసి.....అప్పుడు బస్తాలకెత్తి వాడుకుంటారు....వీరు చోడిపిండి అంబలి అని తయారుచేసుకు తింటారు.......
అంతేగాక బెల్లం తోపర, చోడిపిండి అట్లు అంటే మహా యిష్టం.....యిప్పుడు పట్నవాసులు కూడా....ఆరోగ్యం అని తెలిసి తిన మరిగారు.....చోడిపిండితో రక రకాల ప్రయోగాలతో అదరగోట్టేస్తున్నారు....ఏవంటే సుగర్లు,బి.పీ .లు, థైరాయిడ్లు దరికి రావని.....వైద్యులు చెప్పగా విని....కొందరైతే పాలలో కూడా దీన్ని వేసి కాస్త పంచదార కలిపి లాగించేస్తున్నారు....రాగిసంకటి అని ఏకంగా ఆంధ్ర ఫేమస్ అయిపోయింది....ఓ....వెర్రెత్తిపోతున్నారు నేనంటే......అతివృష్టి లేకపోతె అనావృష్టి.......బాధ పడితేనే గాని బోధ పడదని అన్నట్టు...యిప్పటికి తెలుసుకున్నారు....మా రైతన్నలో.....యెంత తెలివైనవాళ్ళో.....చదువులేకపోతేనేం.....అందుకే జుట్టేనా నెరవకుండా.....ఏ అనారోగ్యం లేకుండా....వాళ్ళ పనులు యెంత బాగా చేసుకుంటారో......మీరు వున్నారు...ఎందుకు....అతి సుకుమారం.....అందుకే యిటుపైన...బిల్డప్పులివ్వకుండా.....రొట్టెలు యిదేపిండితో చేసుకు తినండి....లేదా..గోధుమపిండితో కాస్త కలుపుకొని రొట్టెలు చేసుకున్నా బాగుంటుంది....ఆరోగ్యం తరువాతేకదా ఏదైనా.....నన్ను నిర్లక్ష్యం చేయకండి....రైతన్నలని ఉత్సాహపరచండి,ప్రోత్సహించండి.....పల్లెలే మన దేశానికీ పట్టుకొమ్మలు.....అవి బాగుంటేనే మనం...వాతావరణకాలుష్యంతో సతమతమవుతున్న మనకి...... ఆసరాగా నిలిచి .....మంచి పంటల్ని అందిస్తున్న రైతన్నకు జై కొడదాం....... ఇంక దయ చేస్తా. ఇట్లు, చోద్యం చోడి పిండి.
జయప్రభాశర్మ.

17.Naa Peru Pidaka


పశువులు ......అంటే ఆవులు గేదెలు....అనగానే మనకి టక్కుమని గుర్తుచ్చేది......పాలు అన్నమాటే తప్పా ......వేరే ఇంక్కేది గుర్తుకురాదు.....కానీ వాటివల్ల ఎంతో ప్రయోజనమైన యింకొక విష్యం వుంది......అదేంటో తెలుసా.....అవి విసర్జించే పేడ అన్న పదం.....అది యెంత విలువైందో చాల మంది పట్నవాసులకు తెలియక పోవచ్చు.....కానీ పల్లెవాసులకి మాత్రం ఎంతో ఉపయోగకరమైంది......ఛీ....యాక్...ఇదేంటి అనుకుంటున్నారా.....అవునండి....ఉదయాన్నే పశువులకాపరి వచ్చి .....ఆ ఊరి పశువుల పాకలో ఉన్న....ఆవుల్ని,గేదెల్ని ఇప్పుకొని మేతకి తోలుకెల్తాడు గుంపుగా....యి గుంపుని" మంద" అంటారు......యి మందని కాపు కాసిసాయంకాలం వరకు....ఆ తరవాత వాటిని గెడ్డల్లోనో,చెరువుల్లోనో బాగా కడిగి.....తోలుకొచ్చి మళ్ళీ పశువుల పాకల్లో వాటిని కట్టి వెళ్తాడన్న మాట......యి మేతకి తోలుకెళ్లేవారిని కంబారి, లేదా పాలేరు అంటారు....వీరికి సంవత్సరానికి ఒకసారి ధాన్యం పంట చేతికి రాగానే....పందుము,లేదా పుట్టిడు కొలిచి ఇస్తారన్న మాట....పందుము అంటే పది కుంచాలు....పుట్టిడు అంటే యిరవై కుంచాలు.....కుంచము అన్నది కొలపాత్ర.....యింకా యిత్తుము, ముత్తుము,నలుతుము.....రెండు,మూడు, నాలుగన్నమాట వారి భాషలో.....మరి అసలు సంగతికొద్దాం.....యి మంద బయలుదేరినప్పటికీ తట్టలు పట్టుకొని.....మంద వెనకాలే వెళ్తుంటారు.....పేడకడితో తట్ట నిండగానేవచ్చి.....ఏం చేస్తారో తెలుసా.....చక్కా కూచొని పేడతో పాటు పొల్లు ధాన్యాన్నికలిపి.....పొల్లు ధాన్యాన్ని కవ్వలు అంటారు....పిడకలు తయారుచేసి ఎండేవరకు ఉంచి.....అటు పైన వాటిని వరుస క్రమంలో పేర్చి ఉంచుకుంటారు...కర్రల పొయ్యిమీద వండేటప్పుడు.....వీటిని ఎక్కువగా చేర్చి,ఒకటి రెండు కర్రలు పెట్టి ఎంచక్కగా వండుతారో.....చూస్తే ముచ్చటేస్తుంది.....అంతేకాదు ముంగిట్లో పేడ కలిపిన నీళ్లతో కళ్ళాపి జల్లి ముగ్గులేస్తే యెంత బాగుంటుందో.....మట్టితో కట్టే ఇళ్ళని, ధాన్యం నిల్వ ఉంచే గాదుల్ని, వారి యింట్లో మట్టి నేలని.....పేడతో అలికి ముగ్గులేసుకుంటే.....వారికి యెంత ఆనందమో.....వారి పంట భూములకు ఎరువుగా కూడా వాడతారు......దీన్ని గెత్తాం అంటారు......డబ్బులిచ్చి కొనుకుంటారు కూడా.....అంత ప్రాధాన్యమిస్తారు యి గెత్తానికి....భోగి పండక్కైతే బుల్లి బుల్లి పిడకలద్ది....దండలు గుచ్చి భోగి మంటలో వేస్తుంటారు.....యిప్పుడు ఆన్లైన్లో అమ్మకానికొచ్చాయంటే యెంత ఆశ్చర్యకరమో...యింకా గొప్ప విషయం......బయోగ్యాస్ అని పేడతోనే తయారవుతుంది....దానికి ప్రభుత్వం వారు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు.....అందుకే యిన్ని ప్రయోజనాలున్న దాన్ని పల్లెవాసులు బంగారంలా భావిస్తే.....మనం మాత్రం...యాక్....అని చీదరించుకుంటుంటాము.....అందుకే పల్లెవాతావరణం సహజమైనది,ఆరోగ్యకరమైనది.....ఇలాంటివి తెలుసుకొని.....మనం కూడా కొన్నైనా పాటిస్తే మంచిదని....అలాంటి వాటిని మరుగున పడకుండా చూడాలని కోరుకుంటూ......వుంటా. ఇట్లు, పేరు గొప్పా,పేడ పిడక.
జయప్రభాశర్మ. చివిరిగా చిన్నమాట....మా నాన్నగారింట్లో బయోగ్యాస్ ఉండేది.

18. Oho Chintha Chettu


రోడ్ల పక్కన చల్లటి నీడనిస్తూ......కాయలిస్తూ...పళ్ళనిస్తూ.....హాయిగొలిపే గాలినిస్తూ......ఎందరికో ఆనందాన్నిస్తూ .....ఆహ్లాదపరస్తూ.....గాలికి పుట్టి, గాలికి పెరిగారంటారే......అలాంటికోవకి చెందినదాన్నే....నేను కూడా..... చింత చచ్చిన పులుపు చావలేదని......నా పేరుతోనే తిడతారె.....చచ్చేవాళ్ళని యింకా చంపుతారె....ఆ చింతని......చింతచెట్టు నా పేరు.....చిగురు పెట్టిన దగ్గరనుంచి నా వైపే మీ చూపులన్నీ.....పప్పులో వేసుకుంటే భలే ఉంటుంది అనుకుంటూ.....ఆపైన చిన్న పిందెలు పెడతానో లేదో పచ్చడి యెంత బాగుంటుందో అనీ...... ముదిరితే నిల్వ పచ్చడికి బ్రహ్మాండం అనీ.....పళ్లైతే సంవత్సరానికి సరిపడా .....రోజు వాడకానికి ఉండాల్సిందే....అదే చింతపండు.....యి చింతపండు పిక్కలు తియ్యాలంటే ....దబ్బలాలు అని ఉండేవి పూర్వం......వాటిని తీసుకొచ్చి .....నన్ను గుచ్చి గుచ్చి పొడిచి .....చింత పిక్కలు తీసేవారు..... పిక్కల్ని కూడా ఊరికే వదిలేవారా....ప్రశ్న లేదు.....యి పిక్కల్ని రోజంతా నాన బెట్టి నీళ్లలో.....బాగా నానిన తరువాత....మెత్తగా రుబ్బి.....బుట్టలు మాదిరి చేసుకొని ఎండలో ఎండబెట్టి.....పప్పులు,ఉప్పులూ పోసుకొని వాడుకొనేవారు.....పల్లెల్లో అంతటి నైపుణ్యం చూపించేవారు......ఏది వృధా పోకుండా. ఇక పొతే చింతపిక్కలన్ని కూడబెట్టుకొని .....పిల్లలే కాకుండా పెద్దలు కూడా చింతపిక్కలాటలాడేవారు.......పుంజీలు,జోడాలు, గుర్రాలని వారి ఆటలో భాషన్న మాట.....అష్టాచెమ్మలాటకి నన్ను నేలకేసి తెల్లగా ఐనంతవరకు.....పావి పావి వదిలేవారన్నమాట....... ఇప్పుడు కొత్తగా పెళ్లిళ్లలో కూడా బొట్టలు పెడుతున్నారు.....ఏవిటో చోద్యం.....వింత వింతలు.....చింత నిప్పులని మరీ ప్రసిద్ధి......యిన్ని ఉపయోగాలున్న నన్ను జీవితంలో ఒక్కసారైనా......ఆప్యాయతగా చూసి చారెడు నీళ్లు పోశారు ఎప్పుడైనా......ఎలాగో ఖర్మ కాలి పుడితే...ఎక్కడో ఐతే పర్వాలే..... మరి అవసరాలకి ఉండాలిగా.....యింటి ముందు గాని పుట్టానో......పీకి పారియాల్సిందే.....చింత చింతలని ......చాదస్తం కాకపోతే.....ఏం చేస్తాం.....నా రాత ఆలా వుంది మరి....ప్రయోజనకారిగా పుట్టినందుకు......అందరికి చక్కటి సేవ చేస్తున్నందుకు.....అదే చాలు....మళ్ళీ జన్మంటూ ఉంటే....మీలా నేను పుట్టాలి....నాలా మీరు పుట్టాలని కోరుకుంటూ. యిట్లు,చింత తీరని చింతచెట్టు.
జయప్రభాశర్మ.

19. REMOTE RANI


సూర్యోదయం మొదలు అర్ధరాత్రి వరకు.....నాతోనే పని....నేను ఒక్కనిమిషం కనబడకపోయేసరికి....ఓ..గొగ్గోలు పెట్టేసి......కొంపలు మునిగిపోయినట్టు అరుపులు, కేకలు..... కాస్త వెతికితే దొరకనా.....అః...బద్ధకం....ఒళ్ళు అలిసిపోదూ....అవునూ.....ఇంతకీ నా పేరు చెప్పలేదుకదూ.......నా మతి మరుపు మండా.....నేనండీ బాబూ....మీ రిమోటుని.....మీరు ఎలా హింస పెడితే అలా భరించే అక్కు పక్షిని. మీకు యిరువైనాలుగంటలు అందుబాటులో వుండాలా......మీరు ఎలా చెబితే అలా వినాలా.....మీ టి.వి. కి నేనే.....మీ ఏ.సి.కి నేనే.....మీ కార్లో స్టీరియో కి నేనే.....అన్నింటికీ నేనేనా......ఏమాత్రం పనిచేయక కొంచెం యిబ్బంది పెడితే ఒకటే తిట్ల పురాణమా....యింట్లో పోట్లాటలొస్తే నేనే కనిపిస్తానా......నన్ను నేలకేసి కొడతారా......నేనేమవుతానో ఆలోచించరా....అంత హీనాతిహీనంగా చూస్తారా.....అంటే అవసరం వున్నప్పుడు ఓలా....అవసరం లేనప్పుడోలా అన్నమాట.....అదిరింది.....ఎవరింట్లో చూసిన యిదే భాగోతం.....మీ ఆనందానికి టి.వి ముందు కూచొని దర్జాగా.....ఎంచక్కా ప్లేట్లలో ఏదోఒకటి తెచ్చుకొని.....లాగించేస్తూ...నన్ను పట్టుకొని యిది కాదు అది.....అది కాదు ఇదీ అని విపరీతంగా బాధిస్తారా....అంతటితో ఆగుతారా......మహారాజుగారిలా యిహ నిద్రకి ఉపక్రమించినప్పుడు ......ఏ.సి. ఉండాలి కదా.....యిబ్బంది కలిగించేనో చచ్చేనే....అనారోగ్యం పాలైందనో....ఏదో పాపం యిబ్బందొచ్చిందనో....ఆలోచించాలి కదా....అదేనండి...బ్యాటరీ ఐపొయుంటుందని, లేకపోతె రిపేరోచ్చిందని. ఐన నాకు తెల్వక అడుగుతాను.......ఆమాత్రం ఒళ్ళు వంచకపోతే ఎలాగండి....అందుకే యిప్పుడు విపరీతమైన బరువు సమస్యలు ఎదురవుతూ ........తెగ బాధపడుతున్నారంటే ఇందుకే మరి.....బీ.పీ లు, షుగర్లు వస్తున్నాయంటే రావా మరి.....కార్లో సినిమాలు షికార్ల కెళ్ళి నప్పుడు కూడా......పాటలు వింటూ వెళ్ళాలి.....లేకపోతె బోరు .....అప్పుడూ నేనే కనబడతాను.....చచ్చిపోతున్నానండి బాబూ.....పాపిష్టి పుట్టుకాని పాపిష్ఠిపుట్టుక.....వీళ్ళ చెమట్లు, పుళ్ళు,గజ్జిలు, కంపులు అన్ని నాకే.....ఎవరు కనిపెట్టి నన్ను వీళ్ళ పాలిట పడిశారో గాని......నా శాపం వూరికే పోతుందా.....అనుభవిస్తారు ఇంతకింత......వామ్మో....వీళ్ళ హోదాలు పాడుగాను.....పూర్వం ఇలాంటివి యెరుగుదురా......అమ్మోఅమ్మో గుండె బాదుకోవలసి వస్తోంది......కొన్నాళ్ళకు నన్ను పట్టుకొని ఓ నొక్కు నొక్కితే.....కాళ్ళ దగ్గరకి కంచాలొచ్చినా విచిత్రం ఉండదేమో.....అప్పుడైతే యింకా వైద్యులకు చేతినిండా పనే.....ఇప్పటికే తీరిక లేక సతమతమైపోతున్నారు.....యిల్లు పిల్లలు కానకుండా పాపం...వాళ్ళు కూడా చెబుతున్నారు చెవిలో జోరీగల.....ఐన వినిపించుకుంటేనా.....నోర్ముయ్...అంటారేమో యింకా మాట్లాడితే.....నిష్క్రమించటం ఉత్తమం....నొప్పించక తానొవ్వక అనీ.....వెనుకటికెవరో మహానుభావుడు చెప్పినట్టు.....నా గోల ఇంకేం కాదర్రా .....కోపాలు అవి తగ్గించుకుంటే మంచిదని....నన్ను విసిరేసిన పర్వాలేదు....నా బిడ్డల్లాంటి వారు మీరు......మరి ఉంటానేం. ఇట్లు, మీ ఆనందానికి అడ్డు రాని రిమోట్ రాణి.
జయప్రభాశర్మ.

20. ANDHRULA KALPAVRUKSHAM


ఎవరు విత్తు నాటారని....ఎవరు నీళ్లు పోశారని.....ఎవరు నన్ను పెంచారని.....ఎలా పుట్టానో..... ఎలా పెరిగానో......నాది నాకే ఆశ్యర్యమేస్తుంది.....నన్ను నేను చూసుకుంటే. నేనెవరో చెప్పలేదు కదూ.....తాటిచెట్టులా పెరిగావ్ అని.....నాతో పోల్చి తిడుతుంటారే.....ఆ తాటిచెట్టుని. నేను ఆంధ్రుల కల్ప వృక్షాన్ని..... నన్నెవరు పట్టించుకోకపోయిన ......నేను మాత్రం మీరంటే పడి చస్తాను.....నా గురించి ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా......మీకా అవసరం లేదు....అడక్కుండానే అన్ని యిస్తుంటే ......ఎందుకాలోచించాలి.....అదే గుండెల్లో గుచ్చుకుంటుంది.......యెంత ఉపయోగపడుతున్నానో మీ అందరికి......వేసవి వచ్చిందంటే.....తాటిముంజెలు......చలవ పందిళ్ళకి తాటికమ్మలు......పూర్వం ఐతే నాతొ బుట్టలు, చాపలు తయారు చేసి అమ్మేవారు బజార్లో.....ఏవేని శుభకార్యాలు యింట్లో జరిగితే......అన్నాలు వార్చి చాపలు మీద రాసి పోసేవారు......తాటి తాండ్ర అంటే నచ్చనివారుండరు.....ఉన్నదా? ఐతే నాకివ్వడంటే నాకివ్వండని పోటీలు పడతారు....అంత గొప్పది తాటి తాండ్ర.....ఇకపోతే తాటితేగలు .....కాల్చుకొని,ఉడకబెట్టి తెగ యిష్ట పడితింటారు.... తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారని భయపడుతున్నా......తప్పదు.......కార్లు వేసుకు మరీ పల్లెలకు నన్ను వెతుక్కుంటూ వస్తారండి.......ఎందుకో చేప్పేస్తున్నా....తాటికల్లు అనీ....క్యూలు కట్టేసి ఎగబడతారండీ బాబు....అలాగే తాటిబోదెలు వేసి నదిలో ప్రయాణం చెయ్యాలన్న ........ఆనందంగా వస్తాను.......చక్కటి ఆహ్లాదం పంచుతాను........అంత ప్రయోజనకారిని.....ఎక్కడ దేవుళ్ళ పెళ్లిళ్లు చేసిన నాతోనే పందిరి......నేనుండాల్సిందే....అంతటి భాగ్యం నాది....యింకొక విష్యం.....నేను దక్షిణాదిలోనే ఎక్కువ నివసిస్తూ వుంటాను......అదీ ఆంధ్ర అంటే మరీ ప్రీతి.....ఏదో ఇప్పటి వరకు నా అంతట నేను బతికేస్తున్నాను.....కానీ యిటుపైన వుండలేనేమో అనిపిస్తోంది.....ఎందుకంటె వాతావరణ మార్పులు ఆలా భయపెడుతున్నాయి....కాస్త నా గురించి కొంతైన పట్టించుకుంటే.....ఇలాగె అన్ని ఇస్తూఉంటాను. ఇట్లు, ఎంతో మేలు చేస్తూ,ఎక్కడోబతుకుతున్న మీ తాటిచెట్టు, ఆంధ్రుల కల్పవృక్షం.
జయప్రభాశర్మ.

21. TIKKU TIKKU TABLE WATCH


కాలాన్ని యెంత బాగా తెలిపేదాన్ని.....నన్ను నమ్ముకొని ఎన్ని పన్లో చేసుకొనేవారు. ...పైసా ఖర్చు లేకుండా పని చేసేదాన్ని....ఎన్ని ఉపకారాలు చేసానో....యెంత మందికి అండగా నిలిచానో.....అలాంటిది యిప్పుడు నా పరిస్థితి ఏంటి....ఆ తరం వారికిపనికిరాని తుక్కుని.....ఈ తరం వారికి చెబితేగాని తెలియని డమ్మీని....అప్పట్లో టేబుల్ మీద కూర్చొని టిక్కు,టిక్కుమని కాలాన్ని తెలిపేదాన్ని..మీ వాళ్ళని అడగండి చెబుతారు.....టేబుల్ వాచీ అని ఉండేదని .....అలా మండింది నా పరిస్థితి....కీ యిచ్చి కూర్చోబెడితే .....కాలం తెలుపడమే నా పని.....అర్ధరాత్రి లేచి చదువుకోవాలంటే నేనే....చంటి పిల్లలకి పాలు అవి పట్టాలన్నా నేనే....అనారోగ్యంతో బాధపడే వారికి మందులు అవి ఇవ్వాలంటే నేనే.....పెళ్ళిళ్ళకి,ఉపనయనాలకి,మరి ఏ ఇతర శుభకార్యాలకి.....ముహూర్తాలు పెట్టారంటే నేనే....ఎప్పుడంటే అప్పుడు మీ చేతి మనిషిలా కనిపించని సేవ చేసేదాన్ని......నా వల్ల యెంతమంది లబ్ది పొందారో మీకేం తెల్సు....సరస్వతీ పుత్రులు, లక్ష్మి పుత్రులు, పార్వతీ పుత్రులు......అంటే మరేంలేదర్రా....ఐ.ఏ.ఎస్లు, ఐ.పీ.ఎస్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, వ్యాపారవేత్తలు, ఎంచక్కా పెళ్లి చేసుకొని చిలక గోరింకల్లా వున్నవాళ్లన్నమాట.....మీ అభివృద్ధి కోసం యెంత పాటు పడ్డాను.....అవేవి గుర్తు లేవిప్పుడు.....కొత్త రకాలు చూసి ....అబ్బో ఏం ముచ్చటో....ఏదీ అది చూపించు, యిది చూపించు అనుకుంటూ...ఫారిన్ వాచీలట...ఫాస్ట్రేక్ వాచీలట...అదేదో బుక్కుట...పేస్ బుక్కు...అది కూడా వాచీలో వుంటుందట....ఇంకోటి చెప్పనా....అసలు వాచితో పనే లేదట....ఓ..సెల్ఫోన్లో కాలం తెలుపుతుందట......మా బాగుందమ్మా.....అందుకే నేను వుప్పా, పత్తిరా.....నా అవసరం ఏముంది....యిన్ని రకాలు వచ్చిన తరువాత.....పోవే డొక్కు అని తిట్టిపోయ్యరు.....రిపేరుకి వచ్చానంటే మహా ఐతే రూపాయలతో సరిపెట్టుకొని....యిబ్బంది పెట్టకుండా మళ్ళీ రెడీ ఐపోయేదాన్ని.....అలా తీర్చే దాన్ని వాళ్ళ అవసరాల్ని....యిప్పుడు లక్షలు,కోట్లలో కూడా వాచీలేనట......ఆడంబరాలు కాకపోతేనూ...
చాల్లే నీ ఊక దంపుడు....అంటారు...నాకు తెలుసు....నన్నువాడకపోయినా...కనీసం మర్చిపోకుండా ఐన తల్చుకుంటుంటే.....నాకు సంతోషం కలుగుతుంది కదా.....ఏ పార్టుకాపార్టు పీకేసి మూల పడేస్తారా...ఈ తరం వాళ్ళకి తెలియజేయాలి....యిది టేబులు వాచీ అనీ.....చెబుతారు నాకు తెలుసు....మళ్ళీ ముందు ముందు మాలాంటివాళ్ళని పిల్చి.....మ్యూజియం అనే వేదిక పెడితే కనిపిస్తాం.....అది మీ దయ. యిట్లు,టిక్కు,టిక్కు టేబులు వాచీ.
జయప్రభాశర్మ.

22. Amma Prema


అమృత మూర్తి.....త్యాగశీలి....అభిమానపు ఘని......అనురాగపు నిధి....వెల లేని సిరి.....అవనిలో అతి గొప్పది......ఆ పేరే మధురాతి మధురమైనది.....ఇంకెవరు....మన మాతృమూర్తి....అమ్మ....నవమాసాలు మోసినా బరువు అని భావించదు....పురిటి నొప్పులు పడుతున్నా.....భరించలేని బాధ అని అసలు అనుకోదు.....బిడ్డని చూడగానే.....ప్రపంచంలో ఎక్కడా చూడలేని ఆనందం .....ఆ రోజు నుంచి తానే సర్వస్వము...బుడి బుడి అడుగులేస్తే తిల్లానాలా ....బుల్లి బుల్లి మాట్లాడితే మోహన రాగంలా...మురిసిపోయే అమ్మ....బోర్లా పడితే బొబ్బట్లు.....అందెలేస్తే అరిసెలు......అందరికి పంచిపెట్టి సంబరాల్లో మునిగి తేలేది అమ్మ.... సృష్టిలో ఎంతో విలువైనది... ...అమ్మ అన్న పదం.....సుగంధ భరితం.....సువాసనల గంధం...ఏ కవికి అందని సాహిత్యపు గ్రంధం.....స్వార్ధం అన్న మాట యెరుగనిది....బతుకంటే నువ్వే అని తలచే వెర్రిబాగులది.....తనకంటూ ఏది కోరుకోలేనిది.....కాలిలో ముల్లు గుచ్చుకున్న.....విల విల లాడేది....దైవాన్నిపూజిస్తే....నీ గురించే అడిగేది....అలాంటి తల్లి అనే బొమ్మను....భగవంతుడు రాలేక....అమ్మ అనే బహుమతిని మనకిచ్చాడు.....సృష్టికి ప్రతి సృష్టి అమ్మ...
కనిపించే దైవం....ఎన్ని కష్టాలెదురైనా....చెక్కు చెదరకా.....ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తూ...మరెంతో ధైర్యాన్నిస్తూ.....మనో నిబ్బరంతో కొనసాగుతూ.....విజయాలనందించేది అమ్మ.....తనకంటే గొప్పవారిగా చూడాలి.....అందనంత ఎత్తుకు ఎదగాలి....అష్టైశ్వర్యాలతో తులతూగాలి.....ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలి.....ఇదే తన తలపు...మనమే తన శ్వాస....మన పైనే తన ద్యాస.....అందుకే అమ్మని అంత ప్రేమగా చూడ గలుగుతాం....ఒంటికి విపరీతమైన బాధ కలిగినప్పుడు కూడా.....అమ్మ అనే పిలుపు తప్పా....ఎంత మంది వున్నా వేరే ఇంకేదీ రాదు....అలాంటి అమ్మ ఋణం ఏమిచ్చి తీర్చుకోగలం......విసుగు,విరామం ఎరుగని అమ్మని......కరుణామూర్తిని.....కన్నతల్లిని......మనల్ని కళ్ళల్లో పెట్టుకొని ఎలా చూసిందో.....అలాగే మళ్ళీ మనం కూడా.......ప్రేమాభిమానాలతో, ఆప్యాయంగా చూసుకొనే బాధ్యత మనందరిపైనా వుంది....చూస్తారు కదూ......మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో.......................... యిట్లు, ఆజన్మాంతం మరువలేని అమ్మ అను నామం.
జయప్రభాశర్మ.

23. GO VYADHA


ఉదయాన్నే నా మొఖం చూసి.....దండం పెట్టుకొని లేస్తే.....ఆ రోజంతా మంచే జరుగుతుందనీ....నన్ను పూజిస్తే ఎంతో మంచిదనీ......మీరెంతో ఆప్యాయత చూపిస్తూ,అభిమానం కనబరుస్తూ ఉంటారే......మీ కళ్లెదుట నిలిచే ప్రత్యక్షదైవాన్ని......గోమాతని......శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రీతికరమైనదాన్ని......మిమ్మల్ని, మీ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్న గోవుని.....మీరు పెట్టె పచ్చ గడ్డి మేసి పాలు,పెరుగు,వెన్న,నెయ్యి......ఇవికాకుండా యింకా కోవా, జున్ను, పన్నీరు.....ఎన్నని చెప్పను....ఇవంటే యిష్టం లేని వారెవరైనా వుంటారా......అందుకే నేనంటే విపరీతమైన ప్రేమ.....అభిమానం.....అలాగే నన్ను చూస్తే రాజపూజ్యం.....నా చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేస్తే పాపాలు పోతాయని.....గోమూత్రం దివ్య awshadamani .......నవరత్నాలలో ఒకటైన గోమేధికం నానుంచి వచ్చిందని..నన్ను చూస్తే ఎంతో పూజితం.......నే విసర్జించే పేడ కూడా మీపంటలకి ఎరువుగా వాడబడుతుంది....ముందుకొస్తే పొడవును....వెనక్కొస్తే తన్నను.....సాధుజంతువుని....మరి అలాంటి నన్ను చూసి కొందరు దుర్మార్గులు......గోవధకి తరలిస్తుంటే ......కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాను.....నన్ను, నా తోటివాళ్లను లారీలెక్కించ్చి తీసుకెళ్తుంటే .....నిస్సహాయంగా ....ఏవి చెయ్యలేక.....మూగ బాధ అనుభవిస్తూ.....
మమ్మల్ని పట్టుకుపోతుంటే....ఏ మహానుభావుడైన చూసి పుణ్యం కట్టుకుంటే బాగుండునని అనిపిస్తుంది.....యెంత కర్కోటకులు కాకపోతే.....మేమేం చేశామని అంత నిర్దయ....ఏనాడైనా ఎవరికైన హాని తలపెట్టామా.....తల్లి తరువాత తల్లిలా పాలిచ్చి పాలించేవాళ్ళం......ఆవు పాలు యెంత శ్రేష్ఠమైనవో కదా....మా అంశమైన ఒంగోలు గిత్త ప్రపంచ వ్యాప్తంగా యెంత పేరు ప్రతిష్టలు సంపాదించింది.....దానికి పేటెంట్ హక్కులు కూడా వరించాయి....అంత గొప్పతనం మాది.....నన్ను శ్రీమహాలక్ష్మితో పోలుస్తారు....చిత్రగుప్తుడు నోము చేసుకున్న వాళ్ళు నన్ను పవిత్రమైన బ్రాహ్మనికి యిస్తారు....ఇచ్చేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి యిస్తారు.....ఎందుకంటే సంరక్షణ చెయ్యగలరా లేదా అని.....యి పవిత్ర భారతదేశంలో .....అతి పవిత్రంగా నన్ను కొలిచే భాగ్యానికి నోచు కున్నతరుణంలో.......అమానుషంగా యంత్రాలలో వేసి ముద్ద చేస్తుంటే.......ఎన్ని శాపాలు పెడుతున్న.... 
వినేవారు ఎవరున్నారని....మా పిల్లలనుంచి వేరు చెయ్యటమే కాకుండా.....తిరిగి రాని లోకాలకు పంపించటం...మహా పాపం....క్షమించరాని నేరం.....దయచేసి ఇలాంటివి జరగకుండా చూసుకొనే భాద్యత మీదే.....చూస్తారు కదూ. ఇట్లు, అమ్మ కాని అమ్మ, మీ గోమాత.
జయప్రభాశర్మ.

24. Mirchi Bajji 


సాయంకాలం అయ్యిందంటే చాలు ......గుడ్లగూబల్లా చూపులు.....ఎక్కడ నే కనిపిస్తానో అనీ......పళ్లీసిపెట్టుకొనే వెతుకులాట......మీ దుంప తెగ......నూనె వాసనొస్తే చాలు .....కనిపెట్టేసి పరుగో పరుగు.....తింటే యిక్కడే తినాలి....అదరగొట్టేస్తాడు,చించేస్తాడు....అనుకుంటూ....అక్కడే దేవులాటలు....తిండికి మొహం వాచిపోయినట్టు...ఎప్పుడిస్తాడా అనీ....ఎదురుచూపులు.....ఎన్నాళ్ళనుంచో తిండిలేనట్లు.....ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ......నా మొహం మండా......మిరపకాయ్ భజ్జీని......ఇదేంటి తెగ రెచ్చిపోతోంది అనుకుంటున్నారా......మరేం లేదండి.......ఎంతకని భరిస్తాను వీళ్ళని......బజ్జీ అనీ ఏ మహానుభావుడు నామకరణం చేసి కనిపెట్టాడో గాని.....వేపుకు తినేస్తున్నారు.....యిష్టం అంటూ ఉండొచ్చు గాని ఇంత వ్యామోహం పనికిరాదు....మిరపకాయ కుక్కేసి శనగపిండిలో ముంచేసి......ఆ బండివాళ్ళు ఇచ్చేసరికి.....దేభ్యం మొహాలేసుకుంటూ .....ఓ...లొట్టలేసుకుని తింటారా...నేనెంత మాడిపోతున్నానో పట్టించుకోరా.....ఇంకొందరైతే మరీను....భజ్జీని చీల్చి....అందులో ఉల్లి, వాము దట్టించి......... నిమ్మకాయ పిండేసి కొరికేస్తారా ......అంత చిత్ర హింసలు అవసరమా.....ఎంచక్కా దానికి చట్నీ......అదీ మామూలు పనికి రాదు.....గురువుగారికి కొబ్బరి చట్నీ ఉండాలన్న మాట....యిహ తినే టైములో చూడాలీ... ఆ అవతారం.....ఎవరైనా చూస్తున్నారు అనీ గాని......యిలా తింటే బాగుండదు అనీ గాని జ్ఞానం ఉంటే ఒట్టు......ఆ నూనె ఏనూనె కానీ.....అనవసరం......వాళ్ళు ఎలాంటి గిన్నెలో కలపని.....అప్రస్తుతం.....ఏ ప్లేట్లో ఇవ్వని....పర్లేదు....
రుచికి ఢోకా వుండకూడదు....పక్కనే కాలవ వుండని, కుక్కలు తిరగనీ.....కనిపించవుగాక కనిపించవు......కడుపెక్క లాగించేసి ......పక్కనెవరైనా చూస్తారనేనా అనుకోకుండా.....పెద్ద తేనుపు ఒకటి.....భూకంపం వచ్చినట్టు..... వెలగబెట్టిన ఘనకార్యానికి.......క్యూలు కట్టేసి ఎప్పటికిస్తాడ్రా బాబు.....అనీ విసుగులు.....ఎందుకంటె పార్సిల్ యింటికి తీసుకెళ్లాలి కదా....భార్యామణికి....ఆ బండివాడి బిల్డప్ చూడాలీ.....రోజు వచ్చేవాళ్ళకి స్పెషల్ ......పలకరించుకుంటూ వేగం సప్లయ్ చేసేసరికి....మేమేదో పెద్ద గొప్ప అన్నట్లు ఫీలింగు.... ఎప్పుడో వచ్చినవాళ్లని పట్టించుకోకుండా నిలబెట్టేసరికి.....ఏదోలే అన్నట్టు వీళ్ళ బిల్డప్పు.....వామ్మో చూడలేక ఛస్తున్నాననుకో......ఏదెలా వున్నా నన్ను మాత్రం నోట్లో పడేసుకుంటున్నారు ....... వర్షం పడుతుంటే....తినాలీ....వేడి వేడి బజ్జీ.....అదిరిపోతుందని వాగుడా.. ...ఏం వేరే ఇంకేం కనబడవా.....ఆఖరికి మందు కొట్టేవాళ్ళకి కూడా నేనే.....న బతుకు చెడా.....వెధవ జన్మ.... ఎలా ఉండేదాన్ని....ఒంటికి నలుగు పెడితే నా తల్లి......అదేనండీ...సెనగపిండి....మేనికి యెంత వన్నె తెచ్చేది....మెరిసిపడిపోయేవారు.....ఏం చక్కదనం.....జంతికలు వేసి పిల్లలకి పెడుతుంటే యెంత సంబర పడేవారమో......... పెళ్లిళ్లయినా, పేరంటాళ్లయినా.....లడ్డూలు,మైసూరుపాకులు చేసి పెడుతుంటే యెంత వేడుకగా ఉండేదో.....ఇప్పుడిది చూస్తుంటే....చిరాకేస్తోంది......ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు.....గ్యాస్టిక్ సమస్యలు అవి వొచ్చి బాధపడితే......నే కూడా బాధపడాలి....నా వల్లే కదా అనీ...అందువల్ల నన్ను హింస పెట్టకండి.....హింస పడకండి.....అదే పనిగా బజ్జీ వద్దు......అప్పుడప్పుడు తింటే ముద్దు. ఇట్లు, మాడిపోయిన బజ్జీ.
జయప్రభాశర్మ

25. I am  Dustbin


తెల్లారి లేచిన మొదలు రాత్రి మీరు నిద్రపోయేవరకు......నేనుండాలి మీకు....ఎందుకంటె మీరు తిని వదిలేసిన ఎంగిలి మెతుకులు, చెత్తా చెదారం అన్ని భరించాలికదా మరి....దానికోసమే వేచివున్న కంపు డబ్బాని....వెలిగిందా, లేదా....ఎందుకు వెలుగుతుంది లెండి......నాకోసం ఆలోచించే మనసెక్కడా....వేస్టు ఫెలోని....నా వెర్రితనం కాకపోతే. " చెత్తడబ్బాని"....యింకో పేరు"డస్టుబిన్ను"...నా మొహానికి అదొక్కటే తక్కువ...ఇంగ్లీషొకటీ....మీ పళ్ళు తోముకొనేబ్రష్షు,మీ ఒళ్ళు పావుకొనే సబ్బు ఉంచే సోపుబాక్సు,మీ అందానికి మెరుగులు దిద్దే క్రీము డబ్బాలు, మీ జుట్టుకి పట్టి పట్టి రాసిన నూనె సీసాలు, మీ గడ్డానికి రాసుకున్న క్రీము డబ్బాలు .....ఖాళీ అవగానే నాదగ్గరకొచ్చి పడేస్తారా?. పోనీ వాటితో అయిపోతుందా అంటే అబ్బే....అన్నం మెతుకులు,కూరతొక్కులు, చింతపండుట్లు.....తమరు ఏ పండు తింటే ఆ పండు తొక్కలు.....రాజావారు జిహ్వచాపల్యానికి తెచ్చుకొని తిన్న ఖాళీ పేకెట్లు.....ఇవేవి చాలవన్నట్లు మీ పిల్లలు రగడ చేసినవి...మీ శ్రీమతిగారు వీటన్నిటికీ మించి తెచ్చిపడేసినవి..... చింకిపాతలు, చిరిగిన కాగితాలు, బొక్కి చీపురుకట్టలు....యింకా నేను నిండిపోయి, వెయ్యడానికి వల్లకాకపోతే...వీధుల్లో అటు యిటు చూసి పడేస్తారా?. మీ యిల్లు శుభ్రతగా ఉంటే సరిపోతుందా...వీధి శుభ్రత అక్కర్లేదు...ఈ పారేసిన చెత్తల్ని పీక్కుతింటు పందులు, కుక్కలు స్వయిరవిహారం.....జబ్బుల్ని కోరి తెచ్చుకోవటమే..... ఇకపోతే మీ చండాలానికి అందుబాటులో వుంటూవుండాలి ఎప్పుడూ ఈ దరిద్రకొట్టుడబ్బా......అన్నిటికి నేనే.....ఒక్కనాడైనా చక్కగా శుభ్రం చేసిన దాఖలాలున్నాయా....అబ్బే.... కంపు,అసహ్యం,రోత....మీ గబ్బు కంపులన్నీ నేను మాత్రం భరించాలా.....మనం చక్కగా వున్నాం చాలు.....ఆ...... డబ్బా కడిగితే యెంత కడగకపోతే యెంత అని విసురా.....మున్సిపాలిటీ తమ్ముడొస్తాడా........జాలివేస్తుంది చూస్తేను....వాళ్ళు మనుషులేనా.....తప్పుకదూ....నువ్వు కంపు కుడుతూ పడేసినవి తీసుకెళ్తుంటాడు....చిరునవ్వుతో ఒకసారి పలకరించటమో,నీకు తోచినది ఏదైనా పెడదామనో ఆలోచనే రాదు......ఎవడికోసం చేస్తారన్నట్టుగా చూస్తారా.....వాళ్ళు ఒక్కరోజు రాకపోతే మీ పరిస్థితి ఏంటి....మీరు అనారోగ్యం పాలవకుండా చూసే భాద్యత మాదనుకుంటే....మాకిచ్చే గౌరవం ఇదా....తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టాలనిపిస్తోంది....ఏం చేయలేని అసమర్ధురాలిని.....నోరు లేదుకదా...నా మూగ గోష ఎవరికి వినిపించి చస్తుంది గనక....ఏం చేస్తాం...మా ఖర్మ...స్వచ్ఛభారతో, స్వచ్ఛభారతో అనీ గోల పెడుతున్నా ప్రభుత్వం
పట్టించుకోరా....మీకోసమే కదా...చెప్పేది పాపం....వినండి బాబ్బాబు..మీకు పుణ్యం ఉంటుంది.....మనతోపాటు మన పరిసరాలు కూడా సుబ్బరంగా ఉన్ననాడే నిజమైన స్వచ్ఛభారత్....అన్నట్టు మీకు తెలుసా......మొన్న రేటింగులో మూడవస్థానం సంపాదించుకుంది మన విశాఖపట్నం.....యెంత గొప్పతనమ్ కదా.....మళ్ళీ సారికి ప్రధమ స్థానం సంపాదించుకోవాలి....మన విశాఖ....జై స్వచ్ఛభారత్..........యిట్లు,కనిపించని సేవ చేస్తున్న,కంపుడబ్బా బిరుదాంకితురాలు,డస్టుబిన్ను.
జయప్రభాశర్మ.

26. BAL PASAND


ఓహో ఏం తిండి....అద్భుతః...ఎన్ని సన్మానాలు చేసినా, ఎన్ని పురస్కారాలిచ్చినా తక్కువే......అసలు నన్ను చూస్తే చాలు ....వెర్రెత్తిపోతారు.....వైశాఖం వొస్తే వేరే ద్యాస ఉండదా.....యిదే పనా....ఓ పక్క ఉక్కపోతతో చస్తున్నా.....డోంట్ కేర్.....వీళ్ళనేమనాలో నాకు అర్ధం కాదు....తిండిపోతు రామన్నలు ....తిండి కోసమే పుట్టారా అనిపిస్తుంది.....ఇదెవరు, వాగుతోంది అనుకుంటున్నారా......ఎవరో ఐతే నాకెందుకు.....మూసుకూర్చుందును......నేనేనండీ .....మావిడిపండుని......నేను కనిపిస్తే చాలు గుడ్లప్పగించి......" అః నా పెళ్ళంటా" సినిమాలో బ్రహ్మనందం గారిలా ..... యెంత వేగం కడుపులో పడేసుకుందామని చూస్తారు......ఆ యిష్టం ఏవిటో నాకర్ధం కాదు.....తొక్కలు చెక్కేసి ముక్కలుగా తిన్నవాళ్ళు కొందరైతే.....టెంకకు టెంక, తొక్కకు తొక్క లాగేసి,ఛీకేసి,నాకేసి .....నానా హంగామా చేసి నన్ను విసిరేసిన వాళ్ళు కొందరు......నేనేం పాపం చేసేనని....మధురాతిమధురంగా పుట్టటమే నే చేసినా తప్పా.....ఆ భగవంతుడు నన్ను యిలా పుట్టించినందుకు మొర్రో మని ఏడవాల్సివస్తోంది.....ఇందులో కూడా ఎంపుడొకటి వీళ్ళ మొహాలకి....పండంటే బంగినపల్లేనట....మహారాజు పండట...రసాలంటే....నూజివీడు రసాలేనట.....ఆ బనగానపల్లి నవాబులకో దండం.....ఉన్నవేవీ చాలక యివి కూడా తినండి అని పరిచయం చేసినందుకు......ఉత్తరాదిన నేను చాల ఎక్కువగా వుంటాను.....తర్వాతే మీ దగ్గర.....ఇతర దేశాలకి కూడా నన్ను పంపించేస్తుంటారు...అక్కడ కూడా యిదే తంతు....ఎక్కడ కెళ్ళినా కడుపు గోల ఒకటేగా...ఇవేవి చాలవన్నట్టు జ్యూసులు,జాములు.....సింగినాదం జీలకర్ర.....తొక్కా, తోలు.....పూర్వం ఐతే .....ఉగాది పండగ అయితేనే గాని మావిడిపిందె అయినా ముట్టుకొనేవారుకాదు.....వైశాఖమాసంలో ఒక మంచి రోజు చూసుకొని ......తాటాకు విసెనకర్రలు, చక్కటి మావిడి పళ్ళు బ్రాహ్మణికి యిచ్చి.....అప్పుడు తినేవారు. పెళ్లిళ్లలో కూడా చాల చోట్ల నేనే.....అతి ఎప్పుడు పనికి రాదు.....ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి......లేకపోతె అనేక అనర్ధాలు.....సంవత్సరానికొకమారు అనీ.....తెగ లాగించేస్తారా....అందుకే మీకు తగిన శాస్తి చెయ్యాల్సిందే అనీ......సెగ్గడ్డలు, కడుపులో గజిబిజి గపదని చేస్తుంటాను....లేకపోతె మార్కెట్లో కనిపించగానే డజన్లు,డజన్లు మోసుకెళిపోతారా......నాకు మహా అక్కసుగా వుంది సుమండీ......నన్ను అంత చెండాడుతారా.....మనలో మన మాట.....చిన్న రహస్యం......ఏ పళ్ళు చూసిన ఇంత యెగబడరు.....నేనంటేనే తెగ మోజు......గొప్ప గరవంగా ఉంటుంది....పోనిలెండర్రా.....మీకోసమేకదా నే పుట్టింది.....మీ ఆనందం నా ఆనందం కాదా....మీకు మాత్రం కోపం రాదా ఏవిటి ఎప్పుడైనా.....అలాగే నేను కూడా.....అపార్ధం చేసుకోకండి......ఎప్పటికి ఇలానే ఆదరించండి. యిట్లు, పసందుపండు, మీమామిడిపండు.

27. Janaala Jaanapadam


నమస్కారం శాస్త్రీయ సంగీతం వారికి.......నమస్కారం, నమస్కారం.....జానపదం వారు బాగున్నారా.....బాగున్నాము స్వామి......మీవంటివారు కచేరి చేస్తున్న యి వేదికపై మేము కూడా పాడుట అన్నది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము.....సంతోషం జానపదం వారు.....యిహ మా కచేరీకి వెళ్ళాలి ....వస్తాం...శాస్త్రుల వారిని మాటల్లో పెట్టకండమ్మా....శాస్త్రీయ సంగీతమంటే ఏవనుకుంటున్నారు.....సాంప్రదాయ పద్దతిలో కచేరి అంటే చిన్న విష్యం కాదు......మీలా ఏదో ఆడుతూ పాడుతూ కచేరి చేసి వెళ్ళటం కాదు....మహానుభావులు ఆశీనులైన సభా వేదిక....జానపదం వారూ దయచేసి ఏమి అనుకోవద్దు, అన్యదా భావించవలదు......{ చిన్న బుచ్చుకున్న మనసుతో జానపదం} యెంత మాట అంటూ {పక్కకి తొలగిపోతూ}......పక్కనే ఉన్న లలితసంగీతంవారు యిదంతా విని .....ఏవిటి ఆ మాటలు ....నిర్వాహకులు చిన్నబుచ్చటం ఏవైనా బాగుందా.....దేని గొప్పతనం దానిదే...అలా అనడం యెంత వరకు సమంజసం.....జానపదం పాట కాదా ......శ్రుతి లయలు ఉండవా....యెంత దమ్ముతో పాడాలి....జనాలికి భావం వ్యక్త పరుస్తూ రంజింప చేయాలంటే.....తల ప్రాణం తోక్కొస్తుంది....మాటలన్నంతసులభం కాదు.....బాగుందమ్మా.....సినిమా పాటలా, జానపదాలా అనేస్తారు .....కానీ....ఎన్ని పాట్లో పడితే గాని ఒక పాట రాదు.....ముందు రాసిన పాటకి స్వరాలూ సమకూర్చి....సన్నివేశానికి తగినట్టు ఉండేలా చూసుకొంటూ.....అందర్నీ మెప్పించేలా పాట చెయ్యాలంటే.....యెంత కష్టమో....మాటల్తో చెప్పిన సన్నివేశాన్ని భావంతో, ఉచ్చారణ దోషాలు లేకుండా పాడగలగాలి అంటే చిన్న మాట కాదు.....వాళ్ళు కూడా శాస్త్రీయ సంగీతం మీద పట్టు ఉంటేనే పాడగలుగుతారు.....వేదికపై పాడితే దానికెన్ని పాట్లు....రిహార్సల్ వేసుకొని అదే పనిగా .....సిద్ధంగా ఉండాలి......దేనికుండే కష్టం దానికే.....ఎప్పుడు నోరు జారకండి....చులకనగా అసలు చూడకండి.......వారి మనసు యెంత చిన్న బోతుంది.....జగమే నాదమయం....చినుకు టప్ అని శబ్దం చేసిన స్వరమే.......అందర్నీ ఆనందింప చేయటమే వారి విధి....మరి అలాంటి కళాకారుల్ని సత్కరించి గౌరవించటం మన ధర్మం.....యీమాట యిప్పుడన్నారు గానీ ఇంకెప్పుడు అనొద్దు.....కళాకారుల హృదయాలు అతి సున్నితంగా ఉంటాయి......వారిలో ఎప్పుడు ఉత్సాహాన్ని నింపి, ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి......పాపం మా జానపదం యెంత వొద్దికో చూడండి.....ఆ మాటకి చిన్నబోయింది....రండి జానపదంవారు ముందుకి..... కల్లా కపటం తెలియని మంచిమనసువారు......వీరిని యింకా ప్రభుత్వం వారు గుర్తించి .....సన్మాన సత్కారాలేర్పాటు చేసి ముందుకి తీసుకెళ్లాలి.... పూర్వ వైభవం మళ్ళీ రావాలి.....హుషారు అంటే జానపదమే కాదా....జోరు జోరుగా సాగిపోవాలి మరి.....నడిపిస్తారు కదూ. యిట్లు, మీ లలితం.
జయప్రభాశర్మ.

28. Bhalaa Ithadi


యెవర్రా "యిత్తడి గిన్నెని"......గుర్తున్నానా?...ఓస్ పెద్ద బంగారం....ఇంతోటి గొప్పగా గుర్తుంచుకోడానికి....బోడి యిత్తడి....ఏ మాత్రం.....వెండికే ఠికానా లేదు......ఆపేహే ని గోల. ఏవిటలా విరగబడిపోతున్నారు?. గతం ఒక్కసారి గుర్తు చేసుకోండి.....తెలియకపోతే తెలుసుకోండి.....ఇదేం బాలేదు....లేకపోతె ఏంటీ........నేను లేంది ఏ శుభకార్యం జరిగేది కాదు.....పెళ్ళికి పానకం బిందెలంటే నేనే......అండాలు, డేక్సాలు, పళ్లేలు, గ్లాసులు,గిన్నెలు, బాల్చీలు......రకరకాల సారె సామాన్లు అంటే నేనే.......అవి చూడ్డానికి ఎగబడి వచ్చేవారు.....ఏం తెచ్చింది మీ కోడలంటూ......ఎన్ని యిత్తడి సామాన్లు తెస్తే అంత గొప్పన్నమాట.....ఇప్పుడా వెండి సామాన్లు పెట్టినా మొహం ఎత్తరు.....ఇచ్చినవి దొంగ సోడిగాడ్ల ఎంచక్కా నొక్కియడమే......ఎవరైనా అడుగుతున్నారా ఏమైనా ఏం తెచ్చింది మీకోడ్లని?. అడగాలంటే చచ్చేంత భయం....ఏమోనమ్మా ఏవనుకుంటారో ఏమో అని.....ఆ రోజుల్లో నన్ను మంచాలేసి కూచోబెట్టి ....అందర్నీ పిలిచి మరీ చూపించేవారు.....ఎన్ని ప్రశంసలు కురిపించేవారో.....అది బాగుంది అంటే యిది బాగుందని....ఇకపోతే కొత్త యిల్లు కట్టుకొని గృహప్రవేశం చేసారంటే.....సత్యనారాయణ వ్రతం చేయాల్సిందే, నేనుండాల్సిందే....స్వామివారికి ప్రసాదం చెయ్యాలంటే.......కొత్త యిత్తడి గిన్నె కొనుకొచ్చి అందులో చెయ్యాల్సిందే.....అలాగే పెళ్లిల్లో దింపుళ్ళు అని పెడతారు... లాడువుండలు, మినపసున్నుండలు,చక్కిలాలు,మైసూరుపాకులు...అవికూడా యిత్తడి పల్లేల్లోనే పెట్టేవారు తెలుసా....ఇప్పుడైతే.. ఓ.....మరి చెప్పకర్లే......అట్టపెట్టెలు,ప్లాస్టిక్ డబ్బాలూను......ప్లాస్టిక్ వద్దు మొర్రో అని చెప్తున్నా.....వింటున్నారా...అబ్బే....వాళ్ళు అలాగే అరుస్తార్లే అని విసురు.....యిహ నా విషయానికొద్దాం...పూర్వం ఐతే ఎక్కడ శుభకార్యం జరిగినా నేనే తళ తళలాడిపోతూ.....రెండు కళ్ళు చాలేవికావు.....వాళ్ళు నిత్యం వాడుకొనే వాటిల్లో కూడా నేనే ఎక్కువగా ఉండేదాన్ని.....యిత్తడి గిన్నెలో తప్పా వేరే దాన్లో వంట చేసేవారు కాదు......యెంత రుచిగా ఉండేదో ఆ వంటకం....మీకేం తెలుసు....వాళ్ళనడిగితే చెప్తారు......అదే యిప్పుడు ఓ హోటల్ పెట్టి.....రండి, తినండి.....యిత్తడి గిన్నెల్లో మీ కోసం వంటకం ఎదురు చూస్తోంది.....మరెందుకాలాస్యం అంటే....ఎగబడి క్యూలు కట్టేసి .....సూపరంటే సూపరని పరుగులా......యిత్తడి గిన్నెల్లో వండుకు తిని యెంత ఆరోగ్యంగా ఉండేవారో ఆ రోజుల్లో......యిప్పటికి పల్లెల్లో పెద్ద పండగ......అదేనండి మన సంక్రాంతి.....వచ్చిందంటే....చెక్క బల్ల మీద వున్న సామాన్లన్నీ......ఆ...చెప్పటం మర్చిపోయాను...కోడలు తెచ్చిన యిత్తడి సామాన్లు బల్ల వేసి పెట్టుకునేవారు......ఆ సామాన్లన్నీ తీసి చింతపండు ఇసక వేసి శుభ్రంగా తోముకొని మళ్ళీ పేర్చుకుని బల్ల మీద.....యెంత మురిసిపోతారో.....మళ్ళీ వస్తాయి మారోజులు....చూస్తూ వుండండి.....మీకు సుత్తి కొడుతున్నానని.....నన్ను తిట్టుకుంటున్నారని.....నాకు తెలుసు బాబూ.....మీకు మీ ఫోజులకి ఓ దండం....విన్నారా సంతోషం.....వినకపోతే ఆనందం.....యిత్తడి చిత్తడైపోద్ది అని మాత్రం అనొద్దు....మీ భాషా సంస్కృతికి నమస్కారం.....ఉంటా. యిట్లు, ఇరగదీసిన యిత్తడి.
జయప్రభాశర్మ.

29. Gangiredla Vaaram


అమ్మగారికి దండం పెట్టు.....అయ్యవారికి దండం పెట్టు......అనీ బసవన్నని వెంటపెట్టుకొని తిరిగేవాళ్ళం.....బసవన్న లేకపోతె మేము లేము......బసవన్న మా ప్రాణం.....బసవన్న మా ఊపిరి....బసవన్న మా బతుకు.....బసవన్నతో భుక్తి గడుపుకుంటున్న సంచారజాతులం.....గంగిరెడ్లవారం......గుడారాలేర్పరచుకొని ఊరూరా తిరుగుతూ బతుకుతున్నవాళ్ళం.....తెల్లారి లేస్తూనే గంగిరెద్దుని తయారుచేసి.......ఇంటింటికి వెళ్లి సన్నాయితో చక్కని పాటలు పాడుతూ.....బసవడికి ఏదైనా యివ్వాలని కోరితే.....తప్పకుండా యిచ్చి తీరుతారు.....ఎందుకంటె వారికి గంగిరెద్దు దైవాంశమని నమ్మకం....అపారమైన భక్తి.....పెళ్లినాటి పాత పట్టుచీరలు, ఇక్కిలిపేర్లు, గవ్వల దండలు, బొంతలు గంగిరెద్దుకు యిచ్చి యెంత ఆనంద పడతారో.......మాటల్లో చెప్పలేం......యివి గంగిరెద్దుకు మాత్రమే యిస్తారు దాచిపెట్టి......అవి గంగిరెద్దుపై వేసి భక్తితో దండం పెట్టి దీవెనలందించమని కోరుకుంటారు.....పల్లెటూళ్లలో చాలా చోట్ల పంట పండగానే......బుట్టతో బసవనికి ముందు తీసి పెట్టి అప్పుడు వాడుకుంటారు.....ఎప్పుడు గంగిరెద్దు వస్తే అప్పుడు తెచ్చి తినిపిస్తారు.....యిహ మేమైతే సంవత్సరానికి ఒకమారు గంగిరెడ్లకి కళ్యాణం కూడా జరిపిస్తూవుంటాం తెలుసా....ధనుర్మాసం వచ్చిందంటే మా పంట పండినట్టే......మా ఆనందానికి అంతుండదు.....మేము ఎప్పుడొస్తామా అని ఎదురుచూస్తుంటారు......సంక్రాతి రోజైతే మరి చెప్పక్కర్లే......
గంగిరెద్దు దాసరొచ్చాడంటూ .....డూ డూ బసవన్నని తోలుకొచ్చాడంటూ......పిల్లలనుంచి పెద్దలవరకు యెంత సంబరపడిపోతారో..... మేమొస్తేనే సంక్రాతి శోభ.....అనాదిగా వున్న యి ఆచారం యిప్పటికి కొనసాగుతోందంటే......ఎంతో పొంగిపోతుంటాం......మా బసవన్న పరమేశ్వరునికి ప్రియమైనవాడు......సింహాద్రిఅప్పన్నకి ప్రీతిపాత్రుడు.......కోడెదూడ ఇస్తానని మొక్కుకుంటే......కోరిన కోర్కెలు అప్పన్న తీరుస్తాడని అపారమైన నమ్మకం......అందుకే కోడెదూడని తెచ్చి స్వామి సన్నిధిలో పూజ చేసి వదిలేసి వెల్తారు.....అంత గొప్పవాడు మా బసవన్న.....మేమంతా బసవడి సేవకే అంకితమై జీవిస్తున్నవాళ్ళం.....మేము మగవాళ్ళం మాత్రమే బసవనితో వస్తుంటాము......మా బతుకు ప్రయాణంలో సన్నాయి ఊదుకుంటూ,పాటలు పాడుకుంటూ, అలసట తెలీక, అలుపన్నదిలేక,కడుపుకింత కూడుంటే చాలు అని తృప్తి పడే దాసరులం....ఎప్పటికి యిలాగే బసవడితో ఉండాలని కోరుకున్న అల్ప సంతోషులం.....మీ ఆదరణ మరువలేనిదిగా ఉండాలని ఆసిస్తూ......దండాలు బాబయ్యా.
యిట్లు, మీ గంగిరెడ్లవారు.
జయప్రభాశర్మ.

30. Uttaradamma


నా వేషధారణ చూస్తే యెంత ముచ్చటేస్తుందో తెలుసా.......నేనూ...... మీ ఉత్తరాదమ్మను.......నే ధరించే ఆభరణాల పేర్లు చెప్పండి ఒక్కటైనా.....చెప్పలేరు.....నా అలవాట్లు ఏంటో చెప్పండి......చెప్పలేరు గాక చెప్పలేరు......నేనే చక్కగా చెప్తాను వినండి.......తెలుసుకోండి.....నా నగలు .......కొప్పులు, కొనసీళ్లు, అడ్డుకమ్ములు, నాను, పట్టిడి, జిగిని,అల్లిక్కడియాలు, నాగరము, జెడగంటలు, రాగిడి,చెంద్రవంక......ఇవీ నా నాగాలన్నమాట.........ముఖానికి పసుపు రాసుకొని రూపాయి బిళ్ళంత కుంకుమ బొట్టెట్టుకొని......చక్కగా తలకి నూనె రాసుకొని కర్రదువ్వెనతో దువ్వుకొని మెట్ట పెట్టుకొని బంతిపువ్వైతే బంతిపువ్వు,నందివర్దనమైతే నందివర్ధనం పువ్వు......ఏ పువ్వు దొరికితే ఆ పువ్వే...కొప్పులో ముడుచుకొనేవారము......యి పండక్కి వేయించుకుంటే గాజులు మళ్ళీ పండుక్కే వేయించుకోవడం.....యీరంగు, దానికి యిఅంచు అని చెప్తే నేసి తెచ్చేవారు.....మేము కోక అనేవారము చీరని.......కుడి పైటతో చక్కగా కట్టుకుంటే యెంత బాగుండేదో......శనివారం తలకి స్నానం చెయ్యాలంటే.......ఏటికెళ్ళడం ఒడ్డున కూర్చొని పుట్టదగ్గిర తెచ్చిన మట్టితో చక్కగా పులిమి స్నానం చెయ్యడం.......ఇక మా తిండి....తెల్లారి చలిదన్నం, అంబలి తప్పనిసరి రోజుకొకసారి.....తియ్యరుగు అని మావిడి పళ్ళని ముక్కలు కోసి ఎండబెట్టి తెచ్చి అమ్మేవారు.....దాన్ని కొనుక్కొని బెల్లం పాకం పెట్టి కారం కలిపి నంజుకోడానికి వాడేవారం.....మినపప్పు రుబ్బుకొని చిన్న చిన్న వడియాలు పెట్టి కూర లేనప్పుడు తీసి వండుకొనేవారం.......పండిచ్చిన ఉలవలు, మినుములు,పెసలు కందులు కూరొండుకు తింటే ఏం రుచి..బెల్లంతో చోడి పిండి తొపరేసేవాళ్ళం.......మట్టితో పొయ్యి చేసుకొని కర్రలు తెచ్చి వంట చేసేవాళ్ళం...........రాత్రయితే నులకమంచంవేసుకొని పడుకోవడమే.....పందిరి మంచం ఉంటే కోటీశ్వరులన్నమాట........అద్దమైనా చూసుకోవడం తెలిసేదికాదు.....ఏ ఒక్కటైనా నేను చెప్పినవి మీకు తెలుసా.....ఓరి నాయన....ఇపుడైతే రకరకాలు.....సబ్బులు,షాంపూలు, సెంట్లు,.....అవేంటో పిజ్జాలట, బర్గర్లట....సినిమాలట షికార్లట.....కార్లు,బైకులు....మాకైతే నమస్తే నారాయణ......ఏమి తెలీదు.....పుట్టింటికెళ్ళాలన్నా, అమ్మోరి పణ్డుక్కెళ్లాలన్న......బళ్ళు పూయించుకొని వెళ్లేవారం......యిన్ని చిన్నిలు మా కెక్కడ తెలుసు.......నాలాంటోళ్ళు ఎక్కడైనా కనిపిస్తున్నారా......అబ్బే......కనిపిస్తే మీది ఆ ఊరా,ఈ ఊరా.....అనీ అడుగుతుంటే ఏదోలా ఉంటుంది....మీ ఆర్భాటాలు,హంగులు మాకెక్కడివి......మీకిప్పుడు తెలీదు.....ముందు ముందు బాధపడతారు......ఎందుకో తెలుసా.....పాత రోత, కొత్త మోజు కొన్నాళ్లే.....లేకపోతె మరేంటి....జుంకాలు,జిగినీలు, ఎత్తుగొలుసులు, బుట్టచేతుల జాకెట్లు, చెమ్కీ చీరలు.........మా కాలంనాటివే కదా.....మళ్ళీ యిప్పుడు వచ్చాయి.......అంటే మా సంప్రదాయం మీకు నచ్చినట్టే కదా....మనసుకి చాల సంతోషం కలుగుతుంది అది చూస్తే.......బోల్డ్ బోల్డ్ చెప్పేను మీకు.....బుర్ర తినేసింది అనుకోకండి......అన్ని తెలుసుకోవాలి మరి.....వుంటాను. యిట్లు,ఉత్తరాదమ్మ.
జయప్రభాశర్మ.

31. Chelamala Cheruvu


అలా చూస్తున్నారేంటీ.....నీళ్ల చెరువునండీ నేను.....నన్ను కోనేరు అని కూడా పిలుస్తారు......నా అందమే వేరు......అంత బాగుంటాను......తామర పువ్వులు,తామరాకులు,కలువ పువ్వులు.......యింకా లోపలకెళ్తే....తామరతూళ్లు అని కూడా ఉంటాయి.....వీటిని కూరగా వండుకుంటారు తెలుసా.....దేశ రాజధాని ఢిల్లీ కూరగాయల మార్కెట్లో దీన్ని అమ్ముతుంటారు....యెంత ఇష్టన్గా కొనుక్కుంటారో......పల్లెటూళ్లలో బిందెలు బిందెలు నీళ్లు నాదగ్గరకొచ్చి పట్టుకెళ్తుంటారు....వాళ్ళ అవసరాల చెలిమిని........వర్షం పడితే జల పుష్పాలకైతే కొదవే ఉండదు.....యెంత ఆహ్లాదాన్ని కలిగిస్తానో.......మరెంత ఆనందాన్ని యిస్తానో.....పట్నవాసులకి నా గురించి తెలియదు గాని.......పల్లెవాసులకి మాత్రం ప్రీతి పాత్రురాలిని.....ఏమాత్రం వర్షాలు పడక ఎండిపోతే యెంత బెంగ పెట్టుకుంటారో పాపం........నిండుగా జలసిరితో ఉంటే పొంగిపోయి,పరుగులెత్తుకొని వచ్చి.....యిత్తడి బిందెల్ని ఎంచక్కా చింతపండు ఇసక వేసి కొబ్బరి పీచుతో తెల్లగా తోమి నీళ్లు తీసుకెళ్తుంటే ఏం ముచ్చటేస్తుందో.....నన్ను తవ్వి యిలా 
అందంగా తయారుచేయించిన పూర్వికులు యెంత గొప్పవారో కదా......వారి పేరు చరిత్రలో చిరస్థాయి.....మహానుభావుల కృషి ఫలితం.....యిప్పటికి చాలా గ్రామాల్లో నేను వుండడమన్నది నా అదృష్టం.......ఒకింత గర్వన్గా ఉంటుంది.....దైవ దర్శనానికి వెళ్తే పుష్కరిణిలో స్నానం చెయ్యాల్సిందే.....పుష్కరిణి అంటే ఎవరు......మనమేనండీ......అయ్యవార్లకు అమ్మవార్లకు చక్ర స్నానాలని చేయిస్తూఉంటారు......శైవులు,వైష్ణువుల పురోహితులు వేద మంత్రోచ్ఛరణాలతో.....అంతటి మహా భాగ్యం నాదండీ......పుష్కరిణి లేని పుణ్యక్షేత్రం లేదంటే నమ్ముతారా.....నిజమండీ.....అలాగే పల్లెటూళ్లలో......పెళ్ళికి ముందు నా దగ్గర కొచ్చి నీళ్లు తీసుకెళ్తారు........యివన్నీ చెబుతుంటే డబ్బా అనుకుంటున్నారేమో......వాస్తవం.......నమ్మరా......ఐతే కొన్ని విషయాలు మాత్రం నాకు నచ్చట్లేదండి......గ్రామాల్లో ఐతే బట్టలు తెచ్చి ఉతుక్కుంటుంటారు....యింకా కొన్ని గ్రామాల్లో పశువుల్ని కూడా కడిగేస్తే మాత్రం బాదేస్తుందండీ.... అయ్యో మీరు నీళ్లు ఎలా తాగుతారో ఏంటో అని.....మీకోసమే నా యాతనంతా......అది తెలుసుకొని అరికడితే మీకే మంచిదని చెబుతున్నా......వినండి....ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా.....నా అందం, నా అవసరం గురించి చెప్పేసాను ......హమ్మయ్య....ఇంక వెళ్ళొస్తా. ఇట్లు, చెలమల చెరువు.

జయప్రభాశర్మ.

32. Gaajula Abbi


రకరకాల గాజులు తెచ్చి .....ఊరంతా తిరుగుతూ ......ఎవరికి ఏ రంగు కావాలంటే ఆ రంగు .....ఏ సైజు కావాలంటే ఆ సైజు ......ఎంచక్కా వేసేవాడినో .......నే వచ్చానంటే పండగే......యెంత ఆప్యాయతగా పలకరించేవారో.......ఎప్పుడొస్తానా అని ఎదురుచూపులు.....మట్టిగాజులంటే అంత యిష్టం .......పండగలొచ్చినా,జాతరలొచ్చినా, పెళ్లిళ్లు వచ్చినా ముందు గాజుల సంగతే ఆలోచించేవారు.....పట్నం వెళ్లి గాజులు కొని తెచ్చి.... భుజంమీంచి వేలాడేసుకొని జాగ్రత్తగా గాజుల్ని పట్టుకొని వచ్చేవాడిని......."మలారం" అనేవారు దాన్ని.....సీమంతాలకి నన్ను పిలిచి యింటికి.......ఎంతమంది వస్తే అంతమందికి గాజులు వేయించేవారు.... సీమంత పెళ్ళికూతురికి చేతినిండా గాజులేసిన తరువాత దీవెన గాజులని నా చేత్తో వెయ్యాల్సిందే..... పిల్లాది మొదలు అందరికి వేసిన తరువాత.... నాకు కడుపునిండా భోజనం పెట్టి తాబూలం యిచ్చి పంపించేవారు......ఇప్పుడా మెటల్ గాజులట,మెటీరియల్ గాజులట, వెండిగాజులట,బంగారంగాజులట.......యెంత కోటీశ్వరులైన మట్టిగాజులే వేసుకునేవారు.....దీన్నే అంటారేమో సిరికొద్దీ సిండలని.....నే తెచ్చిన గాజులు చేతినిండా వేయించుకొని యెంత మురిసిపోయేవారో....గాజులు వేయుంచుకున్న తరువాత "మలారంకి" దండం పెట్టేవారు.....ఆ సంప్రదాయాలు ఆలా ఉండేవి......గాజులబ్బీ అని పిలిచేవారు.....నాకు కూడా వాళ్ళని చూడగానే యెంత సంతోషం కలిగేదో.............వాణిశ్రీ గాజులని, సావిత్రి గాజులని, సినిమా వాళ్ళ పేర్లు చెప్పి గాజులు తీసుకొస్తే యెంత సరదా పడేవారో.......ప్రేమనగర్ గాజులనీ,దసరాబుల్లోడు గాజులనీ సినిమా పేర్లతో కూడా తెచ్చేవాడిని......అవన్నీ మచ్చుకైనా కనబడకుండా మరుగైపోయాయి కదా......అప్పటి వాళ్ళు యిప్పటికీ ప్రేమతో పలకరిస్తుంటే.....కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతాయి......ఇప్పుడైతే చేతికి గాజులు అసలు వేసుకున్నవాళ్ళే తక్కువ...కావాలంటే యింట్లో కంప్యూటర్ దగ్గర కూర్చొని ఆర్డర్ ఇచ్చేస్తే తలుపు తట్టి యిచ్చేస్తారట........మా మనవలు చెబుతుంటే.... భళా అనుకున్నా.......ఆ రంగులు, వన్నెలు, చిన్నెలు చూసి ఆశ్యర్యమేస్తోంది......ఎన్ని మార్పులు.....ఏం విడ్డురాలు......నా మాటలు వింటే....చాదస్తం ముసలోడి అని తిట్టిపోయ్యరూ .....అందుకే మూల కూర్చున్నా......
....ఏం చేస్తాం.....కాలంతో పాటు మారాలి......నా వైభవం చెప్పాలనిపించి చెప్పి విసిగించా....మన్నించ్చాలి.......తెర మరుగైపోయిన మీ గాజులబ్బి.

జయప్రభాశర్మ.

33. Jamun Jaalari Bhagotam


జాలారి బాగోతం ఎంతమందికి తెలుసో చేతులెత్తండి......తెలియదు కదూ...అవునులెండి ఎలా తెలుస్తుంది...ఎవరైనా చెప్పేరా....ఎప్పుడైనా చూసారా......నాలుగు బల్లలు......రెండు కొబ్బరి మట్టల పందిరి......ఓ పిసరు బాగున్న దుప్పటీ తెచ్చి తెర.....హార్మోన్యం వాద్యకారుడు......మామూలు బల్బు....ఇదేనండి నేను...ఉత్తరాంధ్రా దాన్నండి.....జాలారిబాగోతాన్ని......పండుగలొచ్చినా, పబ్బాలొచ్చినా ఎగబడి చూసేవారండీ నన్ను....నన్ను యెంత బాగా ఆదరించేవారో......ఆడవాళ్లు, మగవాళ్ళు, ముసిలివాళ్ళు, తెల్లవార్లూ కూచొని బాగోతం చూసి యెంత ఆనంద పడేవారో.......నేనున్నాను అని తెలిస్తే చాలు పక్కనున్న గ్రామాల నుంచి కూడా జనాలే జనాలు........ముచ్చి చీర్లనీ, జిగ జిగలాడుతూ ఉండేవి......అలాంటివి ఎవరైనా కట్టుకున్న కూడా అడిగి వినియోగించుకొనేవారు......పాపం ఉన్నదాంతో ఉన్నంత ముఖానికి రంగేసుకొని......వేదిక ఎక్కేసరికి.....ఓ.....ఒకటే ఈలలు...... మావోడంటే, మావోడని..... ఆ ప్రేమలు అలావుండేవి......ఆ ప్రోత్సాహం అటువంటిది......వూరు ఊరంతా పడిచచ్చేది నేనంటే.....కరెంటు గాని పోయిందంటే పెట్రోమాక్సలైట్లు అద్దెకి తెచ్చి పెట్టేవారు.....ఓ లలనా, ఓ మగువ....అని అండమే తడవు చప్పట్లు.....మైమరచిపోయేవారు....."ఎవ్వారి దానావె జాలరి గంగా " అంటూ రాగయుక్తంగా పాడుతుంటే తన్మయం చెందేవారు. ఆ వాద్యకారుడు యెంత బాగా వాయించేవాడో.......చదివింపులు ఐతే మరి చెప్పకర్లే........ఒకరికొకరు పోటీ పడి మరీ చదివించేవారు.....
కుళ్ళు, కపటం ఎరుగని హృదయాలు నిజంగా......వాళ్లలో వాళ్ళు యెంత శక్యంగా ఉండేవారో....టీంలో ఎవ్వరికీ ఒళ్ళు వెచ్చగున్నా విల విల లాడిపోయేవారు......భోజనాలు చేసి కూర్చుంటే తెల్లారిపోయేది.....అలసట అంటూ కనబడకుండా, విసుగు అన్నది లేకుండా యిష్టన్గా చూసేవారు..... యింకా అవకుండానే మళ్ళీ ఎప్పుడని అడిగేవారు...........ఆ....ఇంకోటి చెప్పడం మర్చిపోయాను.....మా బాగోతం వేయాలంటే డబ్బులు వూరు ఊరంతా పోగేసి ఇచ్చేవారు.......ఇప్పటిలా స్పాన్సర్లు, భారీ పారితోషకాలు, ఫ్లైట్ టికెట్లు,కార్లు,ఫైవ్ స్టార్ హోటల్సు, పురస్కారాలు,సన్మానాలు ఎక్కడుండేవి......యెంత నిరాడంబరమో......భాగోతం వేస్తె అదే పదివేలు అనుకొనేవారు.....ఎంతసేపని చెప్తాను......ఎంతైనా అంతే....... ఆదిత్య369 సినిమాలా....అదే మన బాలయ్య బాబు సినిమాలా.....ఆ రోజులు మళ్ళీ వస్తే బావుండును......అదే కోరుకుంటూ.....మీ జాలరి బాగోతం.........దండాలు బాబులు,అమ్ములు........దయతలిస్తే మళ్ళొస్తా.......సెలవు మారాజా.

జయప్రభాశర్మ.

34. Touring Talkies


చుట్టూ తడికెలు ....సాయంకాలం అయ్యేసరికి లౌడ్సుపీకార్లలో పాటలు......నేడే చూడండి మీ అభిమాన థియేటర్లో అని మైకులో అరుపులు.....ఎండనకా వాననకా తిరుగుతూ.టక్కున చెప్పండి ఎవరో......ఉహు ....ఉలుకు పలుకు లేదు......నాకు తెల్సు.....యింకా వెలగ లేదా.......బుర్ర బాదుకున్నా....వృధా....బుర్ర బద్దలైపోతుంది తప్పా......ఓకే.....చెప్పక ఛస్తానా......చెప్పకపోతే చస్తాను.....".టూరింగ్ టాకీసునండీ " బాబూ.......ఎక్కడైన మచ్చుకైన కనిపిస్తున్నానా........ఐమాక్సులు, ఐనాక్సులు, వచ్చి.....ఓ..రెచ్చిపోతుంటే నేనో లెక్కా..... పోవే గొట్టాం......అని మూల పడేసారండి......అప్పట్లో ఐతేనా....రిక్షాలమీదనో, ఎడ్లబండి మీదనో, యింకా కొందరైతే నడుచుకోనో వచ్చేవారు...నేల టికెట్ అంటే నేలే, బెంచి అంటే బెంచినే, బాల్కనీ అంటే..........హై క్లాసన్నమాట......సినిమా చూస్తున్నంతసేపు ......చేగోడీలు అవి బుట్ట తగిలించుకొని అమ్మకానికొస్తే......చక్కా కొనుకొని తింటూ.......యెంత ఆనందించేవారో.......యిప్పుడైతేనా బైకులు, కార్లు.....వాటికి పెట్రోలు.......పార్కింగులు.....సినిమాకి వెళ్తుంటే యింట్లో భార్యామణి పాపం ఏం వంట చేస్తుందీ...అలసిపోతుంది కదా.....కాబట్టి హోటళ్లు,పార్లర్లు......దాహానికి కూల్డ్రింకులూ......మూరెడు మల్లెపూలు.....మధ్యలో 
ఇంటెర్వెల్లప్పుడు ......సోమోసాలొ,పిజ్జాలో, చిప్సో కొనిపెట్టాలి మరి......స్నేక్సన్నమాట.......అలా చూపిస్తేనే సినిమా.....ఆ అమ్ముకున్నవాళ్ళకి పెర్మిషన్ ఉండాలట.......ఎవరు పడితే వాళ్ళు పెట్టకూడదట.........మీ ఇంటికొస్తే ఏవిస్తావు....మా ఇంటికొస్తే ఏం తెస్తావు అనీ కృష్ణారెడ్డిగారి సినిమాలా..... మావాళ్లయితే వేరుశెనక్కాయలు,బఠాణీలు,చుప్పులు ఎంచక్కా అమ్ముకొనేవారో...........మనమేది తినడానికి తీసుకెళ్లకూడదట.....ఏం రూల్సో.....కూల్డ్రింక్ కూడా తేకూడదెవరు......బాగుందమ్మా..... మేమెరుగుదుమా.....వ్యాపారం బుర్రలు....డబ్బు తెలివితేటలూ.....యిహ మనవాళ్ళ సంగతి చెప్పుకుందాం....పులుసు దిగిపోతున్నా......చిద్విలాసమే...... యిలా వారానికొక సినిమా ఐన చుడొద్దా.....అదీ మొట్టమొదటిరోజున మొట్టమొదటి షో చూస్తేనే లెవెల్.....యిలా వందలు వందలు కృష్ణార్పణమస్తు.... చచ్చింది గొర్రె......సినిమాచూస్తునంతసేపు సూపర్... తర్వాతుంటుంది అసలు కథ......అల్ప ప్రాణికి తల ప్రాణం తొక్కొస్తుంది సినిమా అనేసరికి......అవి చాలవన్నట్లు ఆడియో ఫంక్షన్లు....విజయోత్సవాలు....సిల్వర్ జూబ్లీ ,గోల్డెన్ జూబ్లీఫంక్షన్లు......అన్నింటికీ హాజరవ్వాలి.......సోకు సొమ్మసిల్లిపోను....గొప్పన్నమాట......
ఆ రోజుల్లో ఇలాంటి ఆర్భాటాలు ఉండేవా.....టూరింగ్ టాకీస్ అంటే ఏదో.... సంసారిలాంటిది...యిప్పుడు యివన్నీ చూస్తుంటే గూండాగిపోతోంది...... నేను యింకా చెబితే చాదస్తం అంటారమ్మా......నాకెందుకు.....ఊరుకో ఊరుకో అనీ మనసు గోల పెడుతున్నా......వినబుద్దికాలే.......కక్కిస్తేగాని తోచలే......ఒక్క మాట చివరిగా.....మెచ్చుకోవాలి కదా మన సినిమాని..... బాహుబలివన్,బాహుబలి టు......రాజమౌళిగారట దర్శకులు....ప్రపంచవ్యాప్తంగా తెగ మెచ్చుకుంటున్నారట......ఎంచక్కా ఇలాంటి సినిమాలెన్నోచెయ్యాలని .....యింకా మంచి పేరు తెచ్చుకోవాలని......ఆల్రెడీ పేరు ఎక్కడికో వెళ్లిపోయింది....ఐనా మనం మంచి మాట ఆడాలి కదా......అదన్నమాట......ఆల్ ది బెస్ట్ సర్. మరి నన్ను మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి పుణ్యం కట్టుకోండర్రా.....ఓల్డ్ ఈజ్ గోల్డు, ఓల్డ్ వైజ్ గోల్డు అంటుంటారు కదా.....అలాగే చెయ్యండి......మాటలు కాకుండా చేతల్లో.........అప్పుడదొక వెరైటీ. 
యిట్లు,టూల్సు లేని టూరింగ్ టాకీసు.

జయప్రభాశర్మ.

35. Dekho Deepam Buddi


కారు చీకటిలో కాంతిని.....మినుకు మినుకుమంటూ వెలుగిచ్చేదాన్ని....పొద్దుపోయేసరికి నన్ను వెతుక్కు తీసుకెళ్లి పెట్టేవారు......చెప్పండి నేనెవరో......నా పిచ్చిగానీ.....నేనెక్కడ గుర్తుంటానూ.....నేనే చెప్పి చావాలి.....".దీపం బుడ్డీని"....చీకటి పడేసరికి గ్రామాల్లో ఎంచక్కా కార్తీక దీపాల్లా కనిపించేవారం......ఆ వెలుగు యెంత ముచ్చటగా ఉండేదో......కాలక్రమేణా ఎన్ని మార్పులు......కరెంటు అంటేనే గొప్పగా చెప్పుకొనేవారు.....అలాంటిది యిప్పుడు.... ఓయబ్బో.....జనరేటర్లు, ఇన్వెర్టర్లు, ఛార్జింగ్ లైట్లు......విసినికర్రలు అక్ఖర్లేదట, అవేవో ఫేన్లట, రుబ్బురోలు కాదట గ్రైండరట, రుబ్బులన్నీ ఎంచక్కా రుబ్బేస్తుందట.... లైట్లు ఐతే యిహ చెప్పక్కర్లేదట....యివన్నీ వాటి మీదే కరెంటు లేకపోయినా పనిచేసేస్తాయటమ్మ .......బాగుందమ్మా విడ్డురం.....ఐన నా కెందుకులే......కుళ్ళిపోతోంది అనుకుంటారు......యిప్పటికీ అడవి ప్రాంతాల్లో వుండే అడవి బిడ్డలకు నేనే తల్లిలా రాత్రంతా కాపలా కాస్తుంట్టాను......మీ అంత తెలివితేటలు వాళ్ళకెక్కడివి........అమాయకులు........పాపం. సరే...నా సంగతికొద్దాం..... వీధుల్లోకి కిరసనాయిలు అమ్మకానికొస్తే....కొనుక్కొని శ్రద్ధగా అట్టిపెట్టుకొని.....సాయంకాలం అయ్యేసరికి కిరసనాయిలు బుడ్డీలో వుందా,లేదా చూసుకోవడం,చిమ్ని తళ తళ లాడేట్టు తుడుచుకోవడం......దినచర్యలో భాగం......ఆ వొత్తి దిగిపోతే ఆరిపోతానని.......వొత్తి పెద్దదైతే చిమ్ని మసిబారి పగిలిపోతానని.......యెంత బెంగపడిపోయేవారో......అందుకని నన్ను ఏం ప్రేమగా చూసేవారో.....రాత్రయేసరికి నాకోసమే వెతుకులాట.....అవన్నీ మర్చిపోయారర్రా. సుఖాలు మరిగీ.......నన్నెక్కడ పట్టించుకుంటారు.....కనీసం మీ పిల్లలకైనా" బుడ్డీ" అని ఉండేది అని చెప్పండి.....నాకు కొంతైన సుర్రు తగ్గుతుంది.....లేకపోతే.... అరికాలి మంట నషాలానికొస్తోంది...నా దగ్గిరే తెల్లవార్లూ చదువుకొని ......పెద్ద పెద్ద ఆఫిసర్లు అయినవాళ్ళెంతమంది వున్నారో......వాళ్ళు మాత్రం పాపం......నన్ను తల్చుకుంటుంటారు సుమండీ......అది విన్నప్పుడల్లా గాల్లో తేలిపోతుంటాను.......అంతసంతోషంగా ఉంటుంది....... కాకపోతే మరుగున పడిపోయినట్టే కదా.......అదే తల్చుకుంటే ఏడుపొస్తుంది......పేదవాడికి పెళ్ళామే భార్యన్నట్టు......అప్పట్లో నేనే గొప్పా......అందుకే సెల్ఫ్ డబ్బా....యిలా చెప్పడం తప్పా.......కాదంట నెనల్లాటప్పా......ఇక ఉంటానప్పా. యిట్లు,"మసిబారిన దీపం బుడ్డీ".
జయప్రభాశర్మ.c

36. Nene Number 1


ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.......ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రం......అనీ తెల్లవారేసరికి వందేమాతరంతో ప్రారంభించి........సోమవారం మొదలుకొని ఆదివారం వరకు అన్ని దేవుళ్ళ సుప్రభాతలతో మొదలుపెట్టిన నేను..... అనేక కార్యక్రమాలతో యెంత రంజింపచేసేదాన్నో.........ఒక్కసారి ఆలోచించండి......నేనెవరో......ఆ.......మీ రేడియోని........ప్రాంతీయ వార్తలు మొదలుకొని బి.బి.సి.వార్తల వరకు అన్ని నా దగ్గరే ఉండేవి..............అప్పుడైతే నేనొక్కదాన్నేగా.......ఇప్పుడా....వామ్మో......లెక్కకంతు లేదమ్మా.....అన్ని ఛానల్సు, పేపర్లును.......ఏం చేస్తాం.....దూసుకెళ్తోంది టెకనాలజీ.....సరే... వాటి ఊసు నాకెందుగ్గాని........నా సంగతికొద్దాం.......మిమ్మల్ని విసిగిస్తున్నానేమో.......ఐన తప్పదు చెప్పాలి... యిహ నాటికలు,సూక్తిముక్తావళి,పద్యాలూ,జానపదగీతాలు,లలితగీతాలు,సినిమాపాటలు......ఒకటా రెండా......ఎంచక్కా ఉద్యోగస్తులకు కార్మికుల కార్యక్రమాలని, యువవాణిఅనీ, పసిడిపంటలనీ.......ఎన్ని అందించేదాన్నో.......యిప్పటికీ వున్నాను.......కానీ పూర్వ వైభవం ఎక్కడుంది......రేడియో అమ్మే షాపులు ఎక్కడైనా కనిపిస్తున్నాయా?.....అబ్బే....ప్రభుత్వం వారి రేడియో ప్రసారాలు యెంత బావుంటున్నాయి.....వినాలి కదా.....అః అఖ్ఖర్లేదు......ఎంతసేపు వినండీ,వినండీ.... అనీ.....తెగ గోల పెడుతుంటారే.....అవి కావాలి......ఎందుకంటే వీళ్ళు గోల పెట్టరు కాబట్టి.......ఏం చేస్తాం జనాల నాడి అలా వుంది.......ఎవరైనా ఈ ప్రసారం యెంత బాగుందో ఇవాళ విన్నారా అంటే......ఎగాదిగా చూసి .....యింకా రేడియో గురించి చెబుతారేంటి అని చూసిన వాళ్ళే..........నా సాటి ఎవరండీ......వార్తలు చదువుతున్నది అద్దంకి మన్నార్ అని చదువుతుంటే......ఎంతసేపైనా వినాలనిపించేది......అంత స్పష్టన్గా పలికేవారు భాషనీ......ఏ కార్యక్రమమైనా అంత సొంపుగా ఉండేది......హరి కధలు, బుర్రకథలు,స్త్రీలకార్యక్రమాలు.....ఇప్పుడంటే యివన్ని వొచ్చాయి గాని......నేను యెంత గొప్పగా వుండేదాన్నో......నన్ను యిప్పటికి పెద్ద పెద్దవాళ్ళు పొగుడుతుంటే యెంత పొంగిపోతానో తెల్సా......నా గురించి నే చెప్పుకోక తప్పలేదు......నా ఉక్రోషం అలాంటిది మరి......ఎప్పటికి కింగుల ఉండాలని కోరుకుంటూ .......మీ రేడియో.

జయప్రభాశర్మ.


37. Malli Ochesa


నేను ఏ యింట్లో వున్నా ఆ రోజుల్లో యెంత గొప్పగా చూసేవారో........నా మీద ఎంచక్కా కూచొని తొక్కుతుంట్టే ఆ ఆనందం చూడాలీ........మాటల్లో చెప్పలేం......ఓహో పందేలు వేసుకు మరీ పోటీలు పెట్టుకునేవారు......రెండుచక్రాలు, చైను,ఫెడల్స్, డైనమో, హారను........యింకా గుర్తుకు రాలేదా......అలా వుంది నా దౌర్భాగ్యం.......సైకిల్నిరా బాబు.......ఏవి లేని రోజుల్లో నేనే మీకు దిక్కులావుండేదాన్ని........ఏ వృక్షం లేని చోట ఆముదం వృక్షమే మహావృక్షమన్నట్టు, మీరనుకుంటారని నాకు తెలుసులే...... ఐనా వుండబట్టక వాగాలనిపిస్తోంది..........మదుపు మరమ్మత్తు ఏవైనా ఉండేదా.....నన్ను వాడితే.........మహా ఐతే చైనుజారడం, ఫెడలు ఊడిపోవడం, యింకా ఐతే టైర్లు మార్చుకోవడం తప్ప........అంతేలే కాల మహిమ.......మనదేశం చాలదన్నట్టు విదేశాలనుంచి కూడా తెప్పించేసుకొని......ఓ సంబరాలు......లక్షలు పోసి కొనేసుకొని......ఆ బైకు, యీబైకు, ఆ రంగు చూడు, యి రంగు చూడు, కొంటే అదే కొనాలి, కొంటే యిదే కొనాలి అనీ........యి పిల్లలు ఏది చెబితే అదే ఇచ్చేయాలి అమ్మ నాన్న.......ముద్దు అదంతా.......రైడింగ్ చేసుకు వెళ్తుంట్టే .....అది లెవెలు. నాకు మాత్రం యెంత బాదేస్తుందో....... అమ్మో అమ్మో పిల్లలు ఏవైపోతారో అని.......నా మాట వినేదెవరు....... అంత అవసరమా........పిల్లల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను.......తక్కువ నోట్లతో ఆనందంగా వెళ్లిపోతాను వాళ్ళ యింటికి.......అల్ప సంతోషిని......చిన్న పిల్లలకి కూడా యెంత సంతోషమో నన్ను చూస్తే........అంతెందుకు యిప్పుడు మళ్ళీ డాక్టర్లు చెబుతున్నారు .........ఫోజులు కొట్టకుండా వాడండి అనీ........పెద్ద పెద్ద పొజిషన్లో వున్నవాళ్లు కూడా నన్ను మోసుకెళ్తున్నారు.......ఆ వొళ్ళు తగ్గుతుందని, అనారోగ్య సమస్యలు ఏవి రావని, బతికుంటే బలుసాకని...........లేకపోతె ఏంటిది నన్ను నిర్లక్ష్యం చేస్తారా......డాక్టర్లకి ముందు సన్మానం చేయాలి, యి మాట చెప్పినందుకు......మన ప్రభుత్వంవారు ఎంచక్కా పిల్లల్ని పిల్చి సైకిళ్ళు ఇస్తున్నారు.......యెంత గొప్ప మనసో......వాళ్ళ యిల్లు వెయ్యిళ్లయ్యి ........మా బంగారాలే.......యెంత మంచి పని చేస్తున్నారో......ఎన్ని బైకులోచ్చినా నన్ను గెలవలేవు.......నాలో అంత గొప్పతనముంది మరి........ప్రెజెంట్ కాలరెగరేస్తున్నా..........ఆ బైకుల బిల్డప్ చూసి నేను నేర్చుకున్నా......యిలా ఉంటే లాభం లేదు మనం కూడా మారాలని.......నేనూ మంచి మంచి రంగులు, మంచి మంచి మోడల్సులో వచ్చేసా........నన్ను తీసుకెళ్లండి......ఆరోగ్యం కాపాడుకోండి.........లెవ్లో లెవ్లో అనీ బుర్ర బాదుకోకండి.......యిది సైకిల్ సుభాషితం.......ఆల్ద బెస్టూ.......యిట్లు తక్కువలో ఎక్కువ......ఓకే.
జయప్రభాశర్మ.

38. MY NAME IS VESAVI


ఉక్కపోత,కరెంటుకోత ......వామ్మో భరించలేము తల్లో..........అనీ భయపడుతుంట్టారు కదా......అదే నేను.....ఇంకెవరు మీ వేసవిని......ఎందుకండీ అలా ఆడిపోసుకుంట్టారు.......సంత్సరానికి ఒక్కసారైనా నన్ను భరించలేరా చెప్పండి........నా పని నే చేసుకొనిపోవాలిగా........నాతోపాటు ఎన్ని రకాలు నావెంట వస్తాయీ.........తీయని మావిడిపళ్ళు, చల్లని తాటిముంజెలు, ఘుమ ఘుమలాడుతూ మల్లెపూలు......యివి ఎప్పుడైనా దొరుకుతాయా........నే వచ్చినప్పుడే వస్తాయి.....నా వెంటే ఉంట్టాయి శుభకార్యాలన్నీ వరసపెట్టి.....పెళ్లిళ్లు, పేరంటాళ్ళు..... లొట్టలేసుకు తినడానికి ఆవకాయలు.......అలాగే వేసవి శిక్షణా శిబిరాలని ఉంట్టాయి గాని.......శీతాకాల శిక్షణాశిబిరాలని ఉన్నాయా.......గెంతులేసుకుంటూ పిల్లలు ఆటలు, పాటలు అనీ నేర్చుకోవడానికి వస్తూంట్టే యెంత ముచ్చటేస్తుందీ....... అది గుర్తుంచ్చుకోరేం.......నేనే నాలుగు రోజులపాటు రాకపోతే యెంత యాతన పడిపోతారు.......బట్టలారకా, బయటకెళ్లలేక, జలుబులు, దగ్గులు, జ్వరాలు నరకయాతనలా ఉంట్టుంది.........ఇల్లంతా కంపు కుట్టిపోతుంది.......వానాకాలంలో బీచుకి వెళ్తారా చెప్పండి.......ఎంచక్కా నే వొచ్చినప్పుడే వెళ్తారు.....ఆ త్రిల్లే వేరు.......అప్పుడప్పుడు ఒంటికి చెమట పడితేనే ఆరోగ్యం కూడాను........ఒంట్టిలోవున్న మలినమంతా పోవాలంటే నే ఉండాల్సిందే.........మీ వూళ్ళో బాబోయ్ చెమట.......మా వూళ్ళో ఐతే అస్సలు చెమట పట్టదు.....అనీ......ఊరించడం పెద్ద గొప్పా ఏం........అదేదో అవార్డు పొందినట్టు.......వినలేక చస్తున్నా........ఏం ఫోజులమ్మా......నాన్సెన్స్ యి చెమటపొక్కులేంటీ,యి చెమటలేంటి అనీ విసుగా..... యిరవైనాలుగుగంటలు ఆ ఏ.సి లు బిగించుకొని మగ్గిపోతున్నారుకదా రూముల్లో చాలదూ.........కాకపొతే కరెంట్ బిల్లు పేలిపోతుందని భయం తప్పా.........పూర్వం ఐతే యిలాగే ఉండేదా.......ఎంచక్కా ఆరుబయట మంచాలేసుకొని పడుకునేవారు........నే వస్తానంటే యెంత ఆనంద పడేవారో ...... తాటి,వెదురు విసనకర్రలు తెచ్చుకొని విసురుకొనేవారు........పాపం ఫేనైనా ఉండేదా........రామ రామ........ఒక్కనాడైనా విసుక్కొనేవారుకాదు........తిరిగి నాకు ప్రశంసలు.......ఆహ వేసివి.....మావిడిపళ్ళెంట్టి, తాటిముంజెలేంటీ, మల్లెపూలెంట్టి అనీ.......మీరు వున్నారు.....ఎందుకూ........ఎంజాయ్ చెయ్యడమంటే........సినిమాలు షికార్లు కాదు..........ఇదికూడా ఎంజాయ్ చేయగలగాలి........యెవర్రా...తెలియకడుగుతాను......మీరుచేసుకున్నదే........లేకపోతె మరేంటీ......ఎక్కడ చెట్లు కనిపించిన నరికేస్తారా........చెట్లు పెంచే ప్రసక్తి లేదంటారా.......పెద్ద పెద్ద భవనాలు కట్టేస్తారా.........పూర్వం వాళ్ళు ఇలానే చేసారా.......అందుకే అనుభవించండి........చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత మహాదేవ అనీ..... ఎవరి ఖర్మకు ఎవరు కర్తలు......పర్యావరణాన్ని కాపాడండి అనీ.........ప్రభుత్వం అరుస్తున్న వినిపించుకోరా.......యిప్పటికైనా కళ్ళు తెరవండి.......బాధపడితేనే గాని బోధపడదని......తెలిసిందిగా......మీరు చెట్లని పెంచీ......వున్న చెట్లని నరికివేయకుండా......చూసుకున్న నాడు నే కూడా మిమ్మల్ని యిబ్బంది పెట్టను.........అవునూ నే ఉంటేనే కదా వర్షాలు పడేది...... నే ఉంటనే కదా పంటలు పండేది..........నేనే లేకపోతె కుళ్లిపోయి నాశనమైపోవు........ఎందుకుపనికొస్తారు......ఏకాలానికి ఆ కాలం ఉంటనే మజా......... నే చెప్పినట్టు చెయ్యకపోయారో......అప్పుడుంది అసలు కథ.........యింకా రాబోయే రోజుల్లో చుక్కలు చూపిస్తా తస్మాత్ జాగ్రత్త....గుర్తుంచుకోండేం.........నన్నుమాత్రం ఎప్పుడు తిట్టకండి...... ప్లీజ్. యిట్లు ముప్పుతిప్పలు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న మీ వేసవి.
జయప్రభాశర్మ.


39. EDUPOSTONDAMMA


"అమ్మా" నేనాడపిల్లనమ్మా....... నామాట వినిపిస్తోందమ్మా .....ఎలాచెప్పాలో అర్ధం కావటం లేదమ్మా .....నీ కడుపులో యిలాగే దాగుండాలని ఉందమ్మా .....".ఎందుకో చెప్పనా" బయటికి వస్తే ఊపిరి ఆపేస్తారని.......ఏవంటే ఆడపిల్లని కదమ్మా.....నిన్ను చూస్తే జాలేస్తోందమ్మా.....నవమాసాల మోత నాకోసమే కదా.....పురిటి నొప్పుల బాధని అస్సలు పట్టించుకోవు కదా....నే దుర్మార్గుల పాలవుతే యెంత శోకమో నీకని ...కడుపు శోకం గురించి వాళ్లకేం తెలుసని.....నీ కోసమే ఎంతగానో ఆలోచిస్తున్నానమ్మా....మమతానురాగ మాణిక్యాన్ని....ప్రేమాభిమానానికి ప్రతీకని........ యేనేరం చేసానని? ఏ పాపం చేసానని? క్రూర మృగం సైతం చేయని ఘోరం.....కసురు మొగ్గనమ్మా....కాలరాయొద్దని చెప్పమ్మా.....కన్నతండ్రే కాటికంపే సన్నాహాలా.....తలచుకుంటే ఏడుపొస్తోందమ్మా.....లాలపోసి లాలి పాడే నువ్వున్నావని ....వేలుపెట్టి నడిపించే నాన్నున్నాడని....యెంత వేగం వద్దామా అని అనుకున్నా......కానీ నాకర్ధమైంది ఊపిరి ఆపేస్తారనీ........నిన్న రాత్రి వాళ్ళ మాటలు విన్నా........ముళ్ల పొదల్లో పడేద్దామా.....మురికి కాలవలోవిసిరేద్దామా....వడ్లగింజ వేసేద్దామా....చెత్తకుండీలో కుక్కల పాల్జేద్దామా అని అనుకుంటున్నారమ్మా.......ఆపమ్మా ఈ దారుణం.....చెప్పమ్మా వాళ్ళమ్మ కూడా ఆడదని.....అయ్యో యెంత అసమర్ధురాలివమ్మా...ఆడపిల్లంటే ఆదిలక్ష్మి కదమ్మా.....నేనొక పీ.వి.సింధునవుతా......కల్పనాచావ్లా అంతటిదాన్నవుతా.....నా మాట నమ్మమని చెప్పమ్మా....నేనేమి అల్లరి చేయను.....ఏదీకావాలని అడగను.....బుధ్ధిగా చదువుకుంటాను.....పెద్ద పేరు తెచ్చుకుంటాను....మీరు గర్వపడేలా........సృష్టికి ప్రతి సృష్టి కదమ్మా ఆడది......నేనే లేకపోతే సృష్టే లేదుకదమ్మా....సృష్టి అంతమవకుండా ఉండాలంటే.........నే వుండాలికదమ్మా......ఆడపిల్ల కరువయ్యే రోజులు అతి తొందరలోనే వస్తున్నాయని తెలుసుకోమనమ్మా...... ఆనందంగా బయటి ప్రపంచంలో అడుగుపెట్టి......నవ్వుతూ పెరగాలనికోరుకుంటున్నానమ్మా........మరి ఆ అవకాశమిస్తారని ఆసిస్తూ........నీ గర్భస్థశిశువు.

జయప్రభాశర్మ.

40.  Wah Kya Bhaat Hai


"కొండపైన వెండి వాన".....ఏవిటీ కొండపైన వెండివానే.....అబ్బా వెండీ...... యెంత బాగా చెప్పావే........అవును బంగారం. ఈ తిప్పలేందుకే మరి.......నానాపాట్లు పడిపోయి డబ్బుల సంచులు మోసుకెళ్లకుండా,ఎంచక్కా కొండెక్కి వెండివాన పట్టుకొని తేచ్చేయడమే........అద్భుతం,అమోఘం......అంటాననుకున్నావా........ప్రశ్న లేదు......వాళ్లెవరో సినిమాకోసం రాసి పెట్టుకుంటే నువ్వు కాపీ కొడతావా?. ఓకే.......యిప్పుడు నే సింగుతా సాంగ్....." నీ యిల్లు బంగారం కాను "........నువ్వు చేస్తున్న పనేంటమ్మ......యిది కాపీ కాదా.......నోరుందని పడిపోతావా......ఎస్ నిజం చెబుతున్నా.....వింటే విను, లేకపోతె పో......నా లెవిలిదీ .....నువ్వు వున్నావ్ దేనికి.....నన్ను పట్టించుకున్నంత నిన్ను పట్టించుకుంటరా ఏమైనా.....నేనంటేనా......పడి చస్తారు......ఆడవాళ్ళైతే మరీను.......పగలు రాత్రి నా ధ్యాసే...... అందం అయితేనేం ...అవసరార్ధం అయితేనేం......ఆభరణాలంటూ యెంత వ్యామోహమో నీకేం తెల్సు......ఓయబ్బో చెప్పొచ్చిందండి మాటకారి.....ఏం నేనేం తక్కువ ....గుళ్లో దేవతల విగ్రహాలదగ్గరనుంచి,యజమాని భోంచేసేపల్లెంవరకు నేనే......అదే కాదు పూజకు వాడే కుంకుమ భరిణె,దీపంకుందులు,హారతిపళ్ళెం,అగరొత్తులస్టాండు,ఆఖరికి సింహాసనం కూడా నేనే......యిప్పుడు వాళ్ళైతే మరీను .....జూకాలు, గాజులు యింకా రకరకాలు చేయించుకుంటున్నారు.....కాళ్ళకైతే పట్టిలు అంటే, నేనే ఉండాలి.....మన కంట్రీ సింగర్ ఉషాఉతఫ్ ఐతే మరీను నన్నే ఇష్టపడుతుంది......నన్ను పెట్టుకోని..... ఓ.....కీచురాళ్ళు అనీ పాడుతుంట్టే....నా సామిరంగా.... దుమ్ము లేచిపోద్ది.....నిన్నెవ్వడు పట్టించుకోడు......నువ్వు వాళ్ళ దగ్గరుంటే చస్తారని భయం కూడాను. హలో.....హౌ ఆర్ యు.....అయామ్ " ప్లేటినం".......నా గురించి విన్నారా ఎప్పుడైనా.....బహుశా తెలిసుండదు.......యిప్పుడు నేనంటేనే క్రేజు.........మిమ్మల్నెవరూ పట్టించుకోరు. నీ డూబు కబుర్లాపుతావా.........ఎందుకు విన్లేదు.....బ్రహ్మాండంగా విన్నాం.......నా దగ్గర ఇవేవి పనికి రావ్.....నా తర్వాతే నువ్వు.....నకిలీదాన్లా మొహం నువ్వునూ.....ఎవడికి తెల్సు నీ గొప్ప....నా మెరుపు నీకెక్కడిది.......ఆపమ్మా....చెవులు చిల్లులు పడిపోతున్నాయ్........అదిగో డైమెండుగారాస్తున్నారు.....హాయ్ ప్లేటినం, వెండీ, బంగారం......ఎలా వున్నారు....ఏవయ్యింది...ఏదోలా వున్నారు. ఏం బంగారం నువ్వు చెప్పు......ఏం జరిగిందో......ఆ ఏం లేదు.....వెండీ ప్లాటినం తెగ విరగబడిపోతున్నారు......నే గొప్ప అంటే నే గొప్పని.......మీ యిద్దరు కాదు నే గొప్ప అన్నా......విరుచుకు పడిపోతున్నారు.....ఆ మాటకి. ఓహో అలాగా......మరి నేనేమైపోవాలమ్మా......నువ్వే ఆలా అంటే....
మీరెవరు కాదు ......నేనే నెంబర్ వన్......నేనేంటీ.......నారేటింగ్, నా రేంజు... సామాన్యులకెవరికి అందని దాన్ని.......నా దగ్గరకొచ్చినవాళ్లు కోటీశ్వరులు మాత్రమే....దేభ్యం మొహాలేసుకొని ఎవరు రారు.....నోస్ పిన్ కొనాలన్నా లెక్కలేసుకొస్తారు.......ఎందుకులే దానికి బదులు యిదొస్తుందీ.....అదొస్తుంది బంగారంలో అని వెళ్లిపోతారు.....అంటే దానర్ధం ఏంటి ....నువ్వు నాకంటే తక్కువనేగా.....మామూలు వాళ్ళు వేసుకోలేరు......పెద్ద పెద్ద వ్యాపారస్తులు, సినీప్రముఖులు ....అలాంటివాళ్లకే నేను.....డైమెండ్ సెట్లు అంటారుగాని.......బంగారం సెట్లని ఎవరన్నారు... అసలు నా పేరు చెప్పగానే గుర్తొచ్చేది కోహినూర్ డైమెండ్....ఓకే.......మీ అందరిలోకి టాప్ నేను......దట్సాల్. బాగుందమ్మా......మారాజని మనవి చేస్తే........మరిరెండు తన్నమన్నాట్ట.......పోనీ ఏదో చెప్తే నా పక్షం మాట్లాడతావనుకున్నాను.....శెభాష్.....నా చెప్పు తీసి నేనే కొట్టుకోవాలి....అప్పటికి గాని బుద్ధి రాదు.....లేచిన వేళా విశేషం....ఏదో ఓ మాట అనుకున్నాం గాని మనకి తప్పదర్రా.....పదండి పోదాం.

జయప్రభాశర్మ.


41. TOY STORY !

హాయ్....నమష్కార్.....అయామ్ బార్బీ......ట్రింగ్ ట్రింగ్ నేను ఫోన్ని......దుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ ....నేను కార్ని....షూష్హ్హ్హ్హ్ .....నేను ఏరోప్లేయిన్న్నీ.......మేమిప్పుడు ఎక్కడున్నామంటే....పిల్లరాక్షసుల దగ్గరున్నామండీ.....అమ్మా..ఉండరా....నా జుట్టు లాక్కరా.....నీ పాల పడిపోయాన్రా బాబు......అయ్యయ్యయ్యో ......నన్నుస్పీడుగా తొయ్యకండ్రా......ఇప్పటికే బ్రేకుల్లేక చస్తున్నాను .....యింకా విరిచి పోగులుపెట్టేస్తారా ....ఆపరోరేయ్......నీ ఆట బంగారం గాను......అమ్మో అమ్మో ....నా నడ్డి విరిగిపోయిందిరా ......ఎక్కడ తోసేస్తార్రా నన్ను.....ఒరేయ్ ....నీకు పుణ్యం వుంటుందిరా.....యింత రాకాసి పిల్లలేంటమ్మ....వాళ్ళమ్మకేంపోయింది......బొమ్మలా అనీ కొని పడేసింది గాని.....మనకి పులుసు దిగిపోతోందమ్మా.....ఎప్పుడొస్తుందో తల్లి మాలక్ష్మి.....ఏ జోల పాట పాడి పడుకోపెట్టచ్చుకదా......అబ్బే...అలసిపోతుంది.....మేమున్నాం కదా యిక్కడ తేరగా.......మాకప్పచెప్పింది.......బావుందమ్మా.....బొమ్మగా పుట్టిన పాపానికి ఒళ్ళు పచ్చిపుండు అయిపోయిన భరించాల్సిందే......ఏం కారక్కా.....వీడు యింత వేగం పడుకోడంటావా........ఏమోనే బార్బీ అదే నే చూస్తున్న.....ఎప్పుడొదుల్తాడా అనీ......నువ్వేమంటావ్ ఏరోప్లేనన్నా....మాటాడే ఓపిక కూడా లేదర్రా......చీల్చి చెండాడిస్తున్నాడు.......వాళ్ళమ్మని చూడు......యెంత ధీమాగా వుందో......ఉండదా మరి........మనం మండేం కదా యిక్కడ......ఎప్పుడు పెరుగుతాడా అనీ తెగ చూస్తున్నామనుకో.....పెరిగి పెద్దైతే మనం మూలే......అస్సలు గుర్తుండం......ఎందుకు గుర్తుంటాం.......అవసరం తీరిపోయాక.....వాళ్ళమ్మే ముందు మూట కట్టేసి మూల పడేస్తుంది.......అంతేనమ్మా అంతే.......అదే వీడు పెద్దయిన తర్వాత సూపర్ మోడల్ కారు కొనేసుకొని ......కారుతోపాటే ఎంచక్కా కవర్ కూడా కొనేసి ఒక్క గీతైనా పడకుండా చూస్కుంటూవుంటాడు......యిలా విరిచి పోగు పెడతాడా...ఉహు.....అవునే నన్ను చూడు యెంత హింస పెడుతున్నాడో.....చూస్తున్నావు కదా......రేపు వాడి పెళ్ళాం వస్తేనో ....ఓ...చెప్పేదేంటి......మైసూర్ మహారాణిలా చుడ్డా......యిలాగే పీక్కు తింటాడా........బాగా చెప్పావ్.....నేను అదే కనిపెడుతున్నాను......యి రాజావారు భవిష్యత్తులో ఫ్లైట్లోనే వెళ్ళాలి కదా.....అబ్బో బస్సుల్లోనూ ట్రైనులోను వెళ్లాలంటే అలిసిపోరూ.....అవునర్రా ఇందాకనుంచి చూస్తున్నా.......నేనొకదాన్ని వున్నానని గుర్తుందా......కనిపెడుతున్నాను.......నా భాదేవని చెప్పాలి..... నన్ను యెంత పీకేసి పాకం పెటేస్తున్నాడు.......రేపెప్పుడైనా యిలా చేస్తాడా........ఫోను ముట్టుకోవాలంటేనే భయం ........బిల్లు పేలిపోదూ.......పై ప్రాణాలు పైకే.......గుండార్చుకుపోదు..... అప్పుడు చెయ్యమంటే సరి.. .ఇలాంటి పన్లు.....తెలుస్తుంది.....అః....ఎందుకు చేస్తారు......చెయ్యరుగాక చెయ్యరు......మనమంటే బొమ్మవెధవలం......నోరా పాడ.... కుక్కిన పేనులా పడి ఉంటాం.......మన గోడు వినేదెవరమ్మా......యింతే యి జన్మకి........వాడమ్మ వచ్చి పట్టుకెళ్లిందమ్మా....... పడుకున్నట్టున్నాడు......మళ్ళీ రేపు ఉదయం వరకు మనం కుచ్చి టప్పాలు కొట్టుకోవచ్చు. ....వామ్మో పిల్లడు కాదమ్మో వాడు పిడుగు.......అమ్మతల్లులు.....మీకో దండం.
జయప్రభాశర్మ.

42. Ammoo.. ITUPAINA EEKA BARABAR ANTE OTTU!! 


ఈకా బరా బర్..... .ఈకపాటి చెయ్యవు....... నా ఈక తెంపలేవు......ఏంటా మాటలు.....అది నాలుకా...... తాటిమట్టా ......అడ్డూ అదుపూ లేదా...... నోటికి ఏదొస్తే అది వాగడమేనా......నోర్ముయ్యండి......ఖబడ్డార్ ......నాపేరు ఏంటో తెలుసా మీకు...........నేనే ఆ వెంట్రుకని.....మీకు వీరావేశం వస్తే చిందులేయడానికి నేనే ఉన్నానా........మళ్ళీ మళ్లీ చెబుతున్నా.....నన్ను ఏవి కాకుండా మాట్లాడితే ఊరుకొనేది లేదు......చుప్ రహో......మీకేదైన అవమానం జరిగితే ......బుర్ర మీద వెంట్రుకలు లేకుండా ఐపోయిందంటారా.....నేను తప్పా యింకే పార్టు మీకు గుర్తు రాదా .......మీ ఒంట్లో బోల్డ్ వున్నాయి కదా......వాటి మీద పడి ఏడవండి.......నాలుగు రోజులపాటు నాలుగు వెంట్రుకలు రాలిపోతే.....బెంగ పెట్టుకుచస్తారు ................అద్దంలో అదేపనిగా చూసుకొని......అందం ఎక్కడ తరిగిపోతోందో అనీ.... వ్యాధి పెట్టేసుకుంటారు ......పేద్ద హీరోలా ఉండాలి మీరు మాత్రం......పట్ట తేరిపోయి బుర్రా మీరు ఉంటే ఎక్కడ కమ్మ కట్టేస్తారో అనీ భయం.....నూటొకటి కొడ్తుందేం....ఇంటర్వ్యూకెళ్తే ముసలోడిలా ఉంటే బాగోదని ......పెళ్ళికానోడైతే ముదరోడిలా కనబడకూడదని...........హైర్వీవింగులూ అవి చేయించుసికొని తెగ సంబర పడిపోతారేం....అక్కడ కూడా నేనే గతి.......ఆ వ్యాపారం చేసేవాళ్ళమీద నమ్మకంలేక .......... మనకెందుకులే ట్రాన్స్ ప్లాన్టేషన్లు అనుకుంటూ.......మనసు లాగుతున్నా......మళ్లీ అక్కడ మస్తు ఖర్చు పెట్టాలని ........తక్కువలో ఏదోస్తుందా అని బుర్ర పీకేసుకొని....ఆ వున్న రెండు వెంట్రుకలు ఊడేట్టు..... టక్కుమని ఆలోచన తళుక్కుమని మెరవగానే...పరుగులంకించుకొని...... ఆ తైలం, యీతైలం, ఏతైలమంటూ బజారంతా ఓ చుట్టూ చుట్టేసి.......హమ్మయ్య దొరికిందని.....నిధి దొరికినట్టు గొప్పయిపోతారా ........అది రాసుకొని. మీ సంబరం పాడుగాను...వెర్రి వెంగళప్పలు కాకపోతే ....యావనుకోవాలి మిమ్మల్ని .......అదీవ్యాపారమే కదా.
ఆ వున్నది ఊడినా పర్వాలేదు ..... ఆలోచించరు...... ..అది తర్వాత సంగతని.......ఏదైతే అదే అయిందని...... గాల్లో తేలిపోతారు..........మీలాంటివాళ్ళు యిలా మండబట్టే వ్యాపారాలు అలావున్నాయ్....
జుట్టుదేముందిరా అన్నా.....అబ్బే వింటారా ....అప్పైనా చేసి వాళ్ళ గుళ్లో పోసేయాలి......ఎవరైనా ఖర్మ కాలి ఒక మంచి మాట చెప్పినా ఒంటకెక్కి చావదు.... బుర్రలో తెలివి సున్నా....... ఐనా.....బుర్రమీద వెంట్రుకలుండాలన్నా అంటారు........అంటే మీరు పుట్టిన మొదలు పోయేవరకు నేను మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉండాలి......ఒత్తుగా, తుమ్మెదలా ఎప్పుడు పడిపోకుండా, పండిపోకుండా.......ఎంచక్కా మెరిసిపొవాలెం....
హెన్నాలు పెట్టేసుకొని ......మందారకులు రుబ్బి ఎక్కించేసుకొని .......సారీ....ఆ పని కూడా మీరు చేసుకోరు .....మీ ఆవిడ చెయ్యాలి.......ఎందుకంటె పెళ్లి చేసుకున్న పాపానికి.....ఆడకూతురు చెయ్యక చస్తుందా........చెయ్యకపోతే చస్తుంది...... దానికైనా కొంచెం ఒళ్ళు వంచండి......తరిగిపోదు ఆ ఒళ్ళేమి......ఆ చిట్కాలు పనిచేయకపోతే యిహ రంగు కెళిపోతారు......అంత అవసరమా.........కొండ నాలిక మందంటే వున్న నాలిక ఊడిపోయినట్టు.....ఏపీరెన్సుకి లోపం వుండకూడదు.....ఇంత కథ వుంది కాబట్టి నాకంత మంట వచ్చింది.....ఖామోష్.....మాట్లాడకండి..........వూరుకున్నన్నాళ్లు ఊరుకున్నా.....యిహ ఊరుకొనేది లేదు.....రోజు దేవుడికి ....ఓ....దండాలు పెట్టేసి.....మొక్కులు మొక్కేస్తారు......మీరు అనుకున్నవన్నీ తీరిపోతే...... తలనీలాలిచ్చేస్తామని.. ...తీరితే తెగించి ఇస్తారా అంటే......ఒకటికి పదిసార్లు ఆలోచన.....పోస్టుఫోన్ మెంట్లు.........మీ అవిడ తిట్లు భరించలేకో,లేకపోతె ఆ దేవుడు ఏ శాపం పెట్టేస్తాడనో.....పాపా భీతో .....ఎలాగో ఇవ్వలేక ఇవ్వలేక యిస్తారు........అక్కడ్నుంచి నేరం చేసినవాడైన సిగ్గు పడడు గాని.....మీరు మాత్రం గించుకుపోతారు.......అవును మరి నా అందం అలాంటిది...........నేనేగాని లేకపోతె ఎవర్నైనా చూడగలమా..... అంత గొప్పతనం నాది ఏవనుకున్నారో .........నా తలనీలాలుతో కోట్ల వ్యాపారం.....విదేశాలకి కూడా ఎగుమతయ్యే ఘనత నాది.......మీ విగ్గులకి,మీ సవరాలకి పనికొచ్చి అందానిచ్చేదాన్ని.........ఎంతమంది తెలుగుకవులు నా శిరోజాలను వర్ణించారో ...........సినిమావాళ్లయితే మరీను.......నేను లేకపోతె వాళ్ళు లేరు.....రకరకాల హేయిర్ స్టయిల్సుతో వాళ్ళు వచ్చేసరికి......వాళ్ళ లగే ఉండిపోదామని యాతన.....పులిని చూసి నక్క వాతపెట్టుకుందిట.......అలాగే ఉంటుంది మీ వాలకం......అంచేత నే చెప్పినట్టు విని మసలుకోండి..........అంతేగాని విఱ్ఱవీఁక్కండి........అందరూ గొప్పే ......ఎవరి గొప్ప వారిది.....నేను బాగుంటేనే మీరు బాగుండేది.......మీరే బాలేరనుకోండి నేను ఉండను.......అంటే యింకేంలేదు .....మీరు అనారోగ్యం పాలయ్యేరని లెక్క .......నేనూ ఉండను అని అర్ధం......అందువల్ల నోరు జారకండి ఎప్పుడూను......అదుపులో పెట్టుకోండి.......కల్లో కూడా నన్నుతిట్టకండి......తిట్టేరనుకో 
....నాక్కోపం వస్తుంది .....ఒక్క క్షణం కూడా ఉండను ........వెళ్లిపోతాను..... చూస్కోండి యిహ మీ పాట్లు అప్పుడు......మీ పెళ్ళామే మిమ్మల్ని చీదరించుకొని .....మీరు మీ మొహం పోదురవతలికి అంటుంది......మీ యిష్టం మరి.....ఇంత మేటర్ అష్ట కష్టాలు పడి చెప్పాల్సొచ్చింది.....మీ బుర్రకి ఎక్కిందో లేదో మరి.........ఎక్కిందనుకుంట్టాను......ఎక్కితే ఓకే. నే చేప్పిన మాట వినుమంటా ..... మీ సొంత వైద్యం మానమంట్ట ........వైద్యుల సలహా ముఖ్యమంటా.............ఏదిపడితే అది రాసుకోవద్దంట్ట........ఎవరెన్ని చెప్పినా వినొద్దంట్ట.........అప్పుడే మీతో నేనంటా.......ఎప్పుడూ తేకండి తంటా......తెస్తే మీ ఇల్లంతా పెంట పెంటా.

పోతూ పోతూ చిన్న చిట్కా చెబుతాను వినండి ......ఏంలేదు....గుంటకల్వాకు, గోరింటాకు బాగా ఎండబెట్టి,కొబ్బరి నూనెలో వేసి ....ఒక గ్లాసు కొబ్బరి నూనె పావు గ్లాసు ఐనంతవరకు ఎంచక్కా మరిగించి ......ఆ తర్వాత వడకట్టుకొని రోజు జుట్టుకి రాస్తే యెంత బావుంట్టుందో ...... చెప్పింది వినండి....యిలా చెయ్యండి...... నన్ను యిబ్బంది పెట్టకండి...మీరు ఇబ్బందుల్లో పడకండి...........మీకో నమస్కారం ........వుంటా....మీ కేశాలంకారిణి.
జయప్రభాశర్మ.


43. Itlu Mee THALAM-KAPPA


నేను లేకపోతె మీ ఇల్లంతా చిందరవందర.......గుండెజారి గల్లంతైపోతుంది.........నేను కనిపించకపోతే గగ్గోలు పెట్టేస్తారు.....నేను చూడకపోతే మీ సంపాదన అంతా హుష్ కాకి.......మీకు గుర్కాతో కూడా పనిలేదు......నేను మాత్రం ఉండితీరాలి. కుక్కకాపలా కాస్తూ రాత్రి పగలు ఉంట్టానే.... ఎవరనుకుంటున్నారు నన్ను......మీ యింటి తాళంకప్పని.....మీరు సినిమాలకి, షికార్లకి,పెళ్ళిళ్ళకి, పేరంటాళ్ళకి,తీర్ధయాత్రలకి ఎంచక్కా చెక్కేస్తూవుంటారే.......ఎవడికోసం చూడదన్నట్టుగా దర్జాగా ......ఆ కప్పని.....కనీసం చెరువులో కప్ప బెక బెక మని అరవానైనా అరుస్తుంది గాని.......నేనూ వున్నాను ఎందుకు.....నా బతుకు చెడా.......మీ డబ్బు, బంగారాలు, ఇతర వస్తువులు మీరు తిరిగి వచ్చినంతవరకు కళ్ళల్లో వొత్తులు వేసుకు చూడ్డమే మీకోసంతప్పా ......ఇంకేమి చెయ్యలేని అక్కుపక్షిని.......నా పుట్టుక యింతే... నేనింతే. ఎంతసేపు మీగురించేగాని...నా గురించి ఏనాడైనా ఆలోచించారా.....అబ్బే...మీ తిండి, మీనిద్ర,మీపిల్లలు.... యిదేగోల.....ఆఖరికి మీరు నిద్ర పోయేటప్పుడు కూడా నేనే గతి......అంత హింస పెట్టాలా నన్ను..... ఏ అర్ధరాత్రో దోచుకోడానికి దొంగ వచ్చి ఒక్కలాగు లాగేసరికి ......నేను రాకపోతే....వాడికీ కోపమే నన్ను చూస్తే...... నన్ను చిత్రహింసలకు గురి చేస్తాడండీ......అంత శీను నాకవసరమా?. ఏమిచ్చేరు నాకని .....ఏం చేస్తున్నారు నాకని.... మీ వాళ్ళెవరైనా చూడండర్రా అంటే.....ఒక్క రోజైన మేమున్నాం మీకని అంటారా....పర్వాలేదు వెళ్లి రండని భరోసా ఇస్తారా.........వీళ్లు ఎక్కడెక్కడో చెక్కర్లు కొట్టి వస్తే మనమెందుకు చూడాలి అని కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు........ఏదైనా జరిగితే సంకలు గుద్దుకుంటారు లోపల.....బయటికి మాత్రం ....అయ్యో యెంత పనైపోయింది ...అని ఓవెరెక్షన్లు. నిద్రాహారాలు లేక నిజాయితీగా వున్న నన్ను గుర్తించకపోవడమేమిటో.......నీతికి రోజులెక్కడ....అంతా స్వార్ధం......తిరిగి ఎప్పుడైనా చిన్న ఒంట్లో తేడా చేసి కొంచెం యిబ్బంది పెట్టెననుకోండి.....నోటికొచ్చిన కూతలు కూస్తారా....
పెంచి పెద్ద చేసి, అన్నం పెట్టి, గుడ్డలిచ్చి, వాళ్లకి రేంకులు రాకపోయినా యెంత డబ్బైనా పర్వాలేదు అనీ సీటు కొనేసి, కార్లంటే కార్లని బైకులంటే బైకులని.....మా నాన్నే....మా అమ్మే అనీ.....ముద్దులు పెట్టేసీ....కూడబెట్టాల్సిన సొమ్ములు కూడబెట్టేసి, ఏడు ఇరుకుల్లో దాచేసి యిచ్చేయాలా....ఇవేవి చాలవన్నట్లు. వాళ్ళేం చూస్తారని......విశ్వాసం ఏమాత్రమేనా చూపిస్తున్నారా....యెంత కష్టపడ్డారు మావాళ్ళని.....విశ్వాసఘాతకులు......మీ కడుపున పుట్టినవాళ్ళే లేదు..... ....మరి అలాంటి కఠినాత్ములకు ఆస్తులు యిస్తే యెంత.......ఇవ్వకపోతె యెంత.......వాళ్ళకోసం నన్నుకూడా భాగస్వామిని చేస్తారా.......కాపలాదారుగా వుండమంటారా.......చి......దౌర్భాగ్యపు జన్మాని.........నాది నాకే అసహ్యం వేస్తోంది......వృత్తి పనివారున్నారు.....యిలాగే వున్నారా?. ఏపూటకాపూట తెచ్చుకొని హాయిగా ఇంత వండుకొని యెంత సంతోషంగా వుంటున్నారు........జీవితం అంటే వాళ్ళది........మీరు వున్నారు ఎందుకు......తిన్నది వొంటకెక్కి చస్తేనా.....ఎప్పుడు చూసిన డబ్బు యావే......కూడబెట్టి పిల్లలకి యిచ్చేద్దామనే.......నాకు టైం వేస్ట్ గాని మీరు వింటారా ఏమైనా.......యెంత చెప్పిన వొంటకెక్కితేనా ........రెడ్డొచ్చేడు మొదలెట్టాడు అనీ..... నాకెందుకులే.......బాధ పడితే గాని బోధపడదని.......నన్ను బాగా చూడండి......మీ పని అవగానే మూల పారెయ్యకండి....పువ్వుల్లో పెట్టి చూసుకోండి.......మీ సొమ్ము తిన్న మీ పిల్లలకంటే గొప్పదాన్ని......అన్నం అడుగుతున్నానా....గుడ్డ అడుగుతున్నానా.......ఆస్తులడుగుతున్నానా....... మిమ్మల్ని ఎప్పుడైనా తిడుతున్నానా....మీవన్నీ భద్రంగా భాద్యతవహిస్తున్నదాన్ని.....మంచి తాళంకప్పని.....ఉంట్టానేం

జయప్రభాశర్మ.


44. WAHH… MOGALI !


మొగలిపువ్వు, మొగలిపొట్ట, మొగలిరేకు, కేతకీపుష్పము .............యిన్ని రకాలుగా నన్నుపిలిస్తుంట్టారండి.....ఎవరు ఎలా పిలిచినా పలుకుతా ....మరి యీమధ్య కాలంలో నన్ను ఎవరు పట్టించుకోవట్లే....యేవో మరి.......నా పూర్వ వైభవం తలచుకుంట్టుంటే బాధగా ఉంటోంది... ఎందుకో తెలుసా......అసలు నేనంటూ గుర్తున్నానా అని..... యెంత వెతుకుతున్నానో...... ఎక్కడైనా కనిపిస్తానా అనుకుంటూ........ఉహు.... జాడే లేదు గాక లేదు..........ఆ రోజుల్లో నేను కనిపిస్తే చాలు .......పండగే......మొగలిపువ్వంటే మొగలిపువ్వని యెంత సంబరంగా చూసేవారో ......ఎంచక్కా జడలు కుట్టుకోవడం, పువ్వులు కుట్టుకోవడం చేసేవారు......ఎక్కడుందో ఉత్తరాలకార్డు వెతుక్కుతెచ్చి,దాన్ని గుండ్రంగా కత్తిరించుకొని,ఆ మధ్యలో చక్కటి గులాబీగాని,కనకాంబరంపువ్వులుగాని పెట్టీ, రేకు తీసి చిన్న చిన్నగా కత్తిరించీ, మొగ్గల్లా వంచి కుట్టి యెంత పొంగిపోయేవారో నన్ను చూసీ......శ్రావణమాసం వచ్చిందంటే........నా సందడి అంతా యింతా కాదు.......... పూల దుకాణంలో పువ్వులుకూడా కుట్టి అమ్మేవారు.....వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారి పాదాల చెంత నన్ను పెట్టీ..........స్తోత్రాలు చదివి పూజిస్తుంట్టే......ఆహా.......నేను యెంత పుణ్యాత్మురాలినో కదా అనిపించేది........బంగారు రేకులా కనిపించేదాన్ని........యిప్పటికీ నన్ను శ్రీ తిరుమలతిరుపతి దేవస్థానంవారు పుష్పయాగంలో తోటి పువ్వులతో నన్ను కూడా చేర్చుకొని స్వామివారిని పూజిస్తుంటే నా ఆనందం వర్ణనాతీతం......ఎలాగైనా నన్ను వెతికీ ఒరిస్సాలో .....అదీ......శివరాత్రినాడు ఎంతైనా ధర చూడకుండా కొంటూంట్టారు తెలుసా.....ఎందుకంట్టే శివునికి మహా ప్రీతికరమైనదానినని .....నన్ను తీసుకెళ్లి పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని........అందుకే .......చిన్న రేకైనా ఇవ్వమని బతిమాలి తీసుకెళ్తుంట్టారు. 
ఇక సినిమాలో కూడా మీ మెగాస్టార్ చిరంజీవిగారితో "ఖైదీ"తీశారు కదా ......... డైరెక్టర్ శ్రీ కోదండరామిరెడ్డిగారు "రగులుతోంది మొగలిపొద" అంటూ నన్నే దృష్టిలో పెట్టుకొని చేయించిన పాట, ఆ నృత్యం యెంత పెద్ద హిట్టూ.......ఆతరం,ఈతరం,ఏతరమైన చెవులు కోసుకోవాల్సిందే........ మొగలిపొదలు, నాగిని డాన్సులు ఆంటే టక్కున గుర్తొచ్చేది మేమే......... నే వున్న చోట నాగులు, నాగమణులు అంటుంటారు.....భయపడుతుంటారు.....ఏం లేదండీ.................వాటికీ పాపం ప్రాణభయమే...........అందుకే నరుడి కంట పడకూడదని........... మావాళ్ళుకూడా దండాలు పెట్టుకుంట్టుంట్టారు......మానవులు మహా మేధావులని.....కనిపిస్తే వదలరు గాక వదలరని.......కాకపోతే తర్వాత దహనసంస్కారాలు చేసేస్తారని.......శాపాలు పెట్టేస్తాయని భయం ........అంతే గాని మరింకేంకాదు.....అసలు విషయం, ముఖ్యమైనది మరొకటి చెబుతాను వినండి.... .. ఒరిస్సాలో కొన్ని ఎకరాల్లో నన్ను ప్రత్యేకంగా పెంచ్చి వ్యాపారం చేస్తున్నారు..........ఎందుకో తెల్సా.........సెంట్లు తయారీకి........విదేశాలకు కూడా ఎగుమతి చేస్తూంట్టారు......యివన్నీ చూసి, గతాన్ని తలచుకున్నప్పుడల్లా 
ఒకింత....... గర్వన్గా కూడా ఉంటుంది ........యింకో సంగతి.....నన్ను కోయడానికి మాములుగా రారు.......పెద్ద బలమైన కర్ర తీసుకొని దాని చివర కత్తిని కట్టి నన్నుకోస్తారు.....నాగులుంటాయని భయమట......నిజమే నా సువాసనవల్ల వుంటూవుంటాయి......నా పరిమళం ఎలాంటిదో చెప్పనా......నన్ను తీసుకొచ్చి యింటిలో పెడితే ఎడిళ్ళవతల గుబాళింపు వ్యాపిస్తుంది......మల్లెపువ్వు కూడా నా ముందు దిగదుడుపే....అంత ఘుమ ఘుమ లాడతాను......నా రేకులు పొట్టకి పది నుంచి పన్నెండు వరకు ఉంట్టాయి ......రేకులు ఎండిపోయినా,ఆఖరికి పుప్పొడితో వున్న పొట్టఉన్నా నన్ను వదలరు గాక వదలరు.....బీరువాలో బట్టల మధ్య పెడితే వాసననీ....మరి... అంత మంచి పుష్పాన్ని ఐన నన్ను ఖాతరు చేయకుండా మర్చిపోతారా......వద్దండీ....మర్చిపోవద్దు....యి తరానికి కూడా తెలియజేయండి....నేనెవరో. ఎలావస్తానండీ.....యింత గొప్పదాన్ని.......అంతరించిపోకుండా కాపాడే భాద్యత మీదే.....ప్రభుత్వానికి కూడా తెలియజేయండి....ఆలోచించండి.....చరిత్రున్నంతవరకు మిమ్మల్ని సువాసనలతో ఆనందింపజేస్తాను. యిట్లు మొగలి.

జయప్రభాశర్మ.

45. OIL AAKROSAM


నా పేరు చెప్పటానికి భయమేస్తోంది...ఎందుకో తెలుసా.....మీకు సెంటిమెంట్లుకదా...అందువల్ల...నన్నెక్కడ విసిరి కొడతారో అని. సరే విష్యానికొద్దాం .................యిప్పుడు చెబుతున్న......... నా పేరేంటో......"నూనెనండి".....ఉదయం లేచిన దగ్గర్నుంచి నేనే.......పొపంటే, కూరంటే,బజ్జి అంటే,పకోడీ అంటే,పూరి అంటే మీ చిత్తులన్నిటికి నేనే. ఇవేవి చాలక జంతికలు చేగోడీలు.......అది కడుపా,కళ్లేపల్లి కాసారమా.............ఏవేనంటే కోపాలు.....చూస్తున్నాను......అంత అలుసా నేనంటే.........ఒక్క క్షణం గడుస్తుంది నే లేకపోతె............మీ అఘాయత్యం కూల.....రాత్రి పాడుకోబోయేముందు ఎక్కడో దాచేస్తారా.................తెల్లారి నామొఖం కనబడకూడదా......ఏంటంత నేరం చేసానని.........మళ్ళీ వంటింట్లో కొచ్చేసరికి నేనుండాల......యింత ఫిట్టింగ్ పెడతారా......వేరుశెనక్కాయలు కనబడగానే వేపుకొని తినేద్దామా,ఉడికించొకొని లాగించ్చేద్దామా అని గుడ్లబర్రిలా చూస్తారేం......చక్కటి నువ్వుపప్పు కంటపడితే అరిసెల్లో వేస్తె బావుంటుందా,గుండ ఆడుకుంటే బావుంటుందా ...........ఇవే ఆలోచనలు ...................పొద్దుతిరుగుడు పువ్వు ఎంచక్కా కనిపిస్తే......సూర్యకాంతం పువ్వు, సూర్యకాంతం పువ్వు అని మురిసిపోతారా......మరి నేనెక్కడ్నుంచ్చి వచ్చానమ్మా.......వాటిల్లోనుంచ్చి వచ్చినదాన్నే కదా.............ఇకపోతే పామాయిల్ తోటలు తెగ పెంచేస్తారు.......ఆశ......... డబ్బులొచ్చేయాలి...........మీ బుర్రకి, మీ ఒంటికి, ఓ....మసాజులంటారే.....అదెవరమ్మా........కొబ్బరికాయ.....అదెక్కడ్నుంచి వచ్చిందర్రా........మరి దానుఁచ్చి వచ్చినదాన్నేకాదా.......అంటే యిక్కడ నాకర్ధమైనదేంటంటే..... నా మీద అంత కక్ష అని.
పూజలు చేస్తారు.....ఆ పూజప్పుడూ నేనే .....దీపాలు దేదీప్యమానంగా వెలిగించేస్తారు......నన్ను మళ్ళీ శని అని తిడతారా.......మీకు శని పట్టి పీడిస్తే నన్ను ఆప్యాయంగా హత్తుకొని తీసుకెళ్లిపోయి.......అక్కడ నన్నొదిలి హమ్మయ్యా....... అనీ.......... ఉపిరిపీల్చుకోవడమూను...... పాపం పేద బ్రాహ్మడు చేతిలో పెట్టేస్తారా......వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు.........నా మీద జాలి,ప్రేమ,మానవత్వం......మీరు మాత్రం మహాకానివాళ్ళు సుమీ. 
కొబ్బరికాయ పూజకి ఓకే.....పొద్దుతిరుగుడుపువ్వు ఆనాటి సూర్యకాంతాన్ని గుర్తుచేసుకుంట్టావో లేదోగానీ....నువ్వు మాత్రం డాన్సులు తెగ చేస్తావ్....సూర్యుడు ఎటు తిరిగితే అటుతిరుగుతోంది సూర్యకాంతం సూర్యకాంతం అని.... అదీ ఓకే.....సెనగపలుకులు యిహ పేరు చెప్పగానే నోట్లో నీళ్ళే.......అదీ ఓకే.

పుట్టినప్పుడు కుంచ్చాలు కుంచ్చాలు నువ్వులు ఆడించ్చి తెచ్చిపెట్టాలి,నువ్వు ఏవైపోయిన నా తోబుట్టువు నువ్వులమ్మ కంపల్సరీ...... అలాంటి మేము పనికిరాకుండా పోయామా
.....అంత అసహ్యం పనికిరాదర్రా.......నేను లేని మీరెక్కడా.......ఇప్పుడంటే సింగినాదం జీలకర్ర గాని.......పూర్వం నా వైభవం ఎలా ఉండేదో.....నువ్వుల నూనె ఎంచక్కా గానుగాడించుకొని వాడుకొనేవారు...... నన్ను వాడకపోయినా సమస్యే......కాకపొతే మరీ ఎక్కువ వాడకూడదు..ఇప్పుడా ఎక్కడ చూసిన కల్తీ కల్తీ కల్తీ .......భయం ఎక్కవైపోతోంది మీక్కూడా.....వీళ్ళ మొహం మండా.......జంతువుల కొవ్వులతో నూనిలా......యెంత విడ్డూరం కాకపొతే.......మనుషుల ప్రాణాలతో చెలగాటమా.....యెంత దారుణం......ఏదో మనసు వుండబట్టక అన్నాను గాని.....మీ అందరు బాగుండాలనే నా కోరిక.....నన్ను మాత్రం దూషించకండి......ప్రేమగా చూడండి.....నా ఎదురు మంచిది కాదని, తెల్లారే దీని మొహం చూశానని, హమ్మో ఇవాళ శనివారంకొనకూడదు అని......పక్కన పెట్టి ఆలోచించండి.......ఉపర్ మే భగవాన్ హై....వాడు ఏం రాశాడో అదే జరుగుతుంది.....యివన్నీ చాదస్తాలర్రా.
మీ తలుపు గడియాకి,మీ తాళం కప్పకి తుక్కు పట్టి సమస్యోస్తే నన్ను పిలవండి....హెల్ప్ చేస్తా....అసహ్యించుకోకండి..........ఓకే....ఫిర్ మిలేంగే
. 
జయప్రభాశర్మ.


46. Sree Rama Navami


పుడమి పులకరించిన రోజు......దేవతలు పూల వాన కురిపించిన రోజు.....భక్తులు ఆనంద పారవస్యాన మునిగి తేలిన రోజు......జనక పుత్రి, బంగారుతల్లి సీతమ్మని శ్రీరాముడు మనువాడిన రోజు.....సీతారామ కళ్యాణం రోజు.......అదే...'శ్రీరామ నవమి'. మన దేశమంతా యి వేడుకను అత్యంత వైభవంగా జరుపుకున్న రోజు.......పచ్చివాసనలతో కూడిన కొబ్బరాకులపందిళ్లు,లేలేత మావిడాకు తోరణాలు........ముంగిట ముత్యాలముగ్గులు ....సీతమ్మతల్లికిపట్టుచీర, శ్రీరామునికి పట్టుచాపు, ముత్యాలు, మల్లెపూల దండలు, పళ్ళు, పిండివంటలు ఆభరణాలు ఒక్కటేమిటి.......ఎన్ని రకాలో మనకి కళ్ళవిందు చేస్తాయి......... చూడ కనులు చాలని రోజు....యెంత వర్ణించిన తక్కువే.......అంత రమ్య భరితం........రోజు సువాసనలు వెదజల్లే మల్లెలు....... ఆ రోజు సీతారాముల మేడలో ప్రత్యేకమైన సువాసనలు గుబాళిస్తాయి.......సన్నాయి మేళాలతో, రామదాసు కీర్తనలతో, వేదపండితుల మంత్రోచ్ఛరణాలతో, భక్తుల రామ నామ స్మరణతో,స్వామిని ధ్యానిస్తూ తన్మయము చెందుతూ,శ్రీరాములవారిని,సీతాసమేతుని ఎప్పుడు చూద్దామా అనీ వేయి కళ్ళతో ఎదురుచూస్తుంట్టారు.....కోరిన కోర్కెలు తీర్చాలని,దీవెనలు అందించాలని ఆర్తిగా కొలుస్తారు.....ప్రతీ గ్రామాల్లో,పట్టణాల్లో ఎంతో శ్రద్ధగా "శ్రీరామా నవమి" చేయటం విశేషం......భద్రాచల రామయ్య భద్రాద్రి నుంచి మనకోసం వేంచేసాడా అన్న రీతిగా ....అంత వైభవంగా చేయుట ఎంతో ఆనందదాయకం.
కమనీయమైన ఆ కల్యాణానికి తలంబ్రాలుగా వచ్చిన ఆ ముత్యాలు ......యెంత అదృష్టం చేసుకున్నాయి కదా....లేకపోతె ఏంటి.....ఎక్కడో సాగర గర్భాన దాగిన ముత్యాలు యిలా స్వామి వారి కల్యాణంలో ముఖ్యఘట్టంలో ఉపయోగ పడ్డం ఏవిటి......అక్షింతలు యెంత పెట్టి పుట్టాయో......దీన్నే అంటారు పూర్వ జన్మసుకృతమని......సిగ్గులమొగ్గ సీతమ్మతల్లి మెడలో మంగళసూత్రధారణ జరిగిన తదుపరి ......తలంబ్రాల వేడుక.....ఆహ.....యెంత రమణీయం....."సీతారాముల కళ్యాణము చూతము రారండి" అనీ శ్రావ్యంగా సుశీలమ్మ గానం వినిపిస్తుంట్టే.........మనసుకి యెంత హాయిగా ఉంటుందో కదా.....ఎంతసేపైనా వుండాలనిపించేలా......స్వామివారిని అలా చూస్తూ ఉండిపోదామా అనిపిస్తుంది......
ముత్తైదువులు మంగళహారతి యిచ్చిన తదుపరి.......స్వామి వారికి తెచ్చిన వడపప్పు,పానకం పళ్ళు,పిండివంటలు నైవేద్యం పెట్టిన అనంతరం......భక్తులకు బెల్లం పానకం పంచటం ఆనవాయితి......
తృప్తి తీరా సీతాసమేతుని మరొక్కసారి వీక్షించి ......తిరుగు పయనం అవుతారు.....సీతారాముల్ని వదల్లేక వదల్లేక వెళతారు.....అప్పుడే అయిపోయిందా అన్న భావన......మళ్ళీ శ్రీరామనవమి ఎంతవేగంగా వస్తుందో .....అనీ మళ్ళీ ఎదురుచూపులు..............శ్రీ సీతారాముల దీవెనలు అందరికి వుండాలని కోరుకుంటూ..............శ్రీ సీతారామచంద్రాయ నమః.

జయప్రభాశర్మ.
47. BULLI CINEMA


రాత్రి పగలు అలుపు అంటు మరచి వెండితెరపైన వెలగాలని .....మంచి కధని తయారుచేసుకొని......ఎండకి ఎండీ,వానకి తడుస్తూ,నిద్రాహారాలు మాని,ఎలాగైనా సినిమా తియ్యాలి అనే తలపుతో, నిర్మాతలకోసం వెతుకుతూ.......అవిశ్రాన్తంగా పోరాడుతూ నేనే లోకంగా కలలు కంటున్న మావాడిని చూస్తే యెంత జాలేస్తుందో.......కధ ఎవిరికైనా వినిపిద్దామన్నాఆ చాన్సయినా దొరికితేగా.............ఏదో ఎలాగో వారిద్వారా, వీరిద్వారా, ఎవరో ఒకర్ని పట్టుకొని వెళ్లి కధ వినిపించమంటే, వినిపిస్తే ......అబ్బే యిది జనాలకి రీచ్ అవదనో,యింకా మారిస్తే బావుంట్టుందనో, మళ్లీ మరోసారి వస్తే మాట్లాడదామనో, యి కధ యిదివరకే వచ్చేసినట్లుంది......యిలా...యేవో వంకలు పెట్టి ......ఆశల్ని నీరు కార్చేసి పంపించేస్తారు......ఆశ చావకా మళ్లీ వేట మొదలు......ఓ మంచిముహూర్తాన అదృష్టం బాగుండి ఆర్ధికంగా నే వున్నానంటు నిర్మాత దొరికితే ......అక్కడనుంచి యింకో రకం పాట్లు......నా బడ్జెట్ యింతే, ఇంతలోనే తియ్యాలి అని షరతు........చచ్చింది గొర్రె.........ఎదురుచెప్పలేని అయోమయ పరిస్థితి.........ఓకే అనక తప్పదు........వచ్చిన అవకాశం చేజారితే మళ్లీ రాదనీ భయం.
ఇన్నాళ్లు ఒక ఎత్తైతే ఇప్పుడొక ఎత్తు.....మ్యూజిక్ డైరెక్టర్,కొరియోగ్రాఫర్,లిరిసిస్ట్లు,ఎడిటర్స్,సింగర్స్,ఇతర టెక్నీషియన్స్, ఎవరైతే బాగుంట్టుంది,యి బుడ్జెట్టుకి వస్తారా.......రారా....రాకపోతే ఏం చెయ్యాలి.......బడ్జెట్ గోలఒక పక్క......ఎన్నో తంటాలు పడి తీసే ప్రయత్నాలు మొదలెట్టేసరికి......మధ్యలో మరో కధ ఎంట్రీ....నేనంతకంటే తక్కువలో చేస్తానని......ఆ కధ నచ్చో ,బడ్జెట్ తక్కువని అనుకొనో,యింకా వేరే కారణాలవలనో........డ్రాప్ ఐపోతే మళ్లీ కధ మొదలు.....మరో నిర్మాత కోసం వెతుకులాట.....ఎలాగోలా ప్రయత్నాలు చేసుకొని ...... నిర్మాత దొరికేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది.........సినిమా మొదలెట్టేసరికి యిదొకరకం టెన్షను......నిర్మాతని ఒప్పిస్తూ,తనకున్న తెలివితేటలతో అందర్నీ మేనేజ్ చేసుకుంటూ .....నిద్రాహారాలు మాని, యింటిని మరిచిపోయి,వొంటిని పట్టించుకోకుండా..........అదే శ్వాసగా ....అదే ఆశగా....కలలు ఎన్నో కన్నసినిమా వస్తోందని ఆనందంతో.....మెల్లిగా అష్ట కష్టాలు పడి అయిందని ఊపిరి పీల్చుకుందామంటే........ఏం పీలుస్తాడు ......ఇప్పుడుంది అసలు కధ......దియేటర్లివ్వక,కాళీల్లేక, ఎవరు 
కొనడానికి ముందుకు రాకా ......నానా పాట్లమ్మ పాపం........ఆవగింజంత అదృష్టంతో థియేటర్లు దొరికాయనుకోండి.......గూండాగినంత టెన్షను.....హిట్టా,ఫట్టా అని.......ఏదైనా తప్పదు కదా........చూస్తాడు. హిట్టయితే క్యూలు .....ఖర్మ కాలి ఫట్ ఐతే ......ఆ వంకే ఎవ్వరు చూడరు......అన్ని అవస్థలు పడతాడు మావాడు........ఏవిటో వెండితెర.......నా భాధలు అలా ఉంటాయి మరి.......ఈజీగా అనేస్తారు......బాగుంది లేకపోతె సుత్తియని .......ఎన్ని కష్టాలో నా తండ్రికి.......యి టాలెంట్ అన్నది వరమో శాపమో నాకైతే అర్ధం అవట్లేదు.......యి బుల్లి సినిమాల్ని, మాత్రం ఆదరించండి 
........ఎంతమందో మంచి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చేస్తున్నవాళ్లు ......రామ రామ.....యి బుల్లిసినిమా బాగా వుండాలని కోరుకోండేం........యిట్లు......మీ బుల్లిసినిమా.

జయప్రభాశర్మ

48. VEGETABLES VEERANGAM


ఏవే బెండకాయ్....ఎలావున్నావ్.....ఎన్నాళైనా ఒళ్ళు చెయ్యవా .....రివట్లా అలాగే వుంటావా ఏంటీ......అసలే నిన్నుచూస్తే రోత..కడిగినా పోని బంకా నువ్వునూ. ఓయబ్బో చెప్పొచ్చిందండి .....అడ్డంగా బలిసి భూమికి బెత్తెడు .....నువ్వూ నన్నన్నదానివే.......నాకేం తక్కువ ....లేడీ ఫింగర్స్.... అని .....అందమైన ఆడవాళ్ళ వేళ్ళతో పోలుస్తారు......నాకోసం వెతుక్కొస్తారు.....ఎందుకో తెలుసా?......తెలివితేటలుంట్టాయని......నిన్ను ఎద్దు మొద్దు స్వరూపమని పెద్ద పట్టించుకోరు.......అదెందుకోతెల్సా ......వున్న తెలివితేటలూ ఊస్ట్ ఐపోతాయని. అబ్బో ..అః ..అలాగా....నేను పండిపోయినా పచ్చడి చేసుకొని లొట్టలేసుకు తింటారు దేనికమ్మా.....అదే నువ్వు ముదిరావనుకో అవతల విసిరేస్తారు..... అదీ దొండకాయంటే. " పోవే దొండకాయ్." మధ్యలో యిది ఒకర్తి....గజ్జిలా ఒళ్ళంతా యిదీనూ కాకరకాయ్. ఏవిటీ నన్నుగజ్జితో పోలుస్తారా....మీ మొహం మండా......యెంత ధైర్యమే మీకు....అల్లాటప్పలా కనిపిస్తున్నానా............ కాకరకాయ్ అంటే కాకరకాయ్ అని పడి చస్తారు..........ఎలాగైనా రావాలంటు నన్ను తీసుకెళ్తారు.....నేనున్నచోట రోగాలు రొచ్చులు వుండవు గాక ఉండవ్......ఏవనుకుంటున్నారో...కురూపి కురూపి యెందుకు పుట్టావ్ అంటే స్వరూపాల్ని ఎంచడానికన్నట్లు.....ముయ్యండి నోరు. టమాటా వయ్యారి వస్తోంది ఊపుకుంటూ.....దానికి మరీ తలబిరుసు ....లోకంలో దాన్ని మించిన అందగత్తెలు లేరనుకుంట్టుంది......
మన ముగ్గురం దాని దగ్గిర ఎందుకు పనికిరామ్.....ఆ రంగుని చూసి ఏం మిడిసిపాటో....ఏం చేస్తాం ఎన్ని తెలివితేటలూ వున్నా రంగు లేదు కాబట్టి మూసుకుచోవాల్సిందే. .ఏవిటో అందవిహీనులందరి సమావేశం.....నా అందం గురించేనా చర్చించుకుంటున్నారు.....ఓసి నీ అందం పాడుగాను.....ఏవిటమ్మా విరగబడి పోతున్నావ్ అందం అందం అనీ.....మేం నీ మీద పడ్డామంటే
ఎందుకూ పనికిరాకుండా పోతావ్ ....విసుక్కోని అవతల పారేస్తారు తిట్టిన తిట్టు తిట్టకుండా....అదే మేమయితేనా......అస్సలు చెదరం గాక చెదరం .....అంత బలమైన వాళ్ళం......చీపి ఒళ్ళు నువ్వు పోవే.
హమ్మో బంగాళాదుంప వస్తోందమ్మా.....దీంధాటి అసలు తట్టుకోలేం......తూర్పు ఉత్తర, దక్షిణ, పడమర అంతా దీందేనని అహంకారం.......హరిద్వార్లో రాయిలాగ మొహం యిదీనూ.....ప్రపంచం అంతా నాదేనంటుంది.....యెవర్రా; దొండ,బెండ ముగ్గురం కొట్టుకున్న తిట్టుకున్నా యిక్కడే ...........కట్టుగా ఉండాలి ముగ్గురం......లేకపోతె లాభంలేదు......చుప్ చాప్. హాల్లో..హౌ అర్ యు....క్యా సమావేష్ హై యిదర్. వీడి భాష మండిపోను.......ఎంచక్కా తెలుగులో మాట్లాడకుండా ఇదో తెగులు.....ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు. అవునట్టు మరిచిపోయాను......భాష ప్రాబ్లెమ్ కదా.....ఇట్సాల్ రైట్......నేను ప్రపంచదేశాలన్ని తిరుగుతున్నాను ....నేనంటే అందరికి చాల యిష్టం.....మరి మిమ్మల్ని యెందుకు లైక్ చేయట్లేదో.....ఐ డోంట్ నో. చాలా మందికి తెల్సి చావకా..తెలిస్తే వదుల్తారేంటి....నీ రూపం నువ్వు అడుక్కు తిన్నట్టున్నా......పెట్టి పుట్టావ్ .....మా రుచి మరిగితే వదుల్తారా........చిన్నా పెద్దా ఎగపాకిరి నిన్ను తింట్టారని పొగరు......ఇప్పటికే నానాబాధలు పడుతున్నారు జనాలు.......ఏవి తిండం.... ....ఆపు తల్లీ ఆపు .... నీ గొప్పలు వినలేక చస్తున్నాం.......మా దొండ,మా బెండ,మా కాకర యెంత మంచివో.......యిహ నా గురించ్చి నే చెప్పుకోకూడదు కదా......డబ్బాలా ఉంటుంది......మా వాళ్ళు చెబుతారు......అవును మా టొమేటోయెంత మంచిదో" కాన్సర్ ' ని దగ్గరకొస్తే కర్ర పట్టుకున్నంత పని చేస్తుంది.
పోనిలెండర్రా .....ఏదో బుద్ధి గడ్డితినీ వాగాను.....అందరం గొప్పవాళ్ళమే.......ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని ఎప్పుడు అనుకోకూడదు......అదిగో మాటల్లోనే వచ్చేసారు ...మనవాళ్లంతా......ఏవే కేబేజి ...ఏవే చిక్కుడు కాయ్....ఏం వంకాయ.....అందరు కుశలమా.....ఎంతమందో .....చాల సంతోషమర్రా.....అందరం ఒక్కదగ్గరే ఉండడం.....మనం లేకపోతె యెలాగర్ర....యి జనాలు బతికేది......వాళ్లకి ఆరోగ్యం,అయుష్హు యివ్వాలి కదా......కాకపోతే
వాళ్ళకోసమే చేస్తున్న మనవి.....సేంద్రీయ ఎరువులతో మన్ని చూసుకొమ్మని చెప్పాలి.......పాపం వాళ్ళు బాగుండాలి కదా.....ప్రభుత్వంవారు కూడా అదే చెప్తున్నారు.....పర్యావరణాన్ని కాపాడాలి.....కాలుష్యం లేని గాలినందించాలి.....చక్కటి రుచిగల కూరలై వెంట ఉండాలి......అప్పుడే మనకి నిజమైన తృప్తి.....సరేనా.....నా మాట వింటారని కోరుకుంటూ
.....లోకా సమస్తా సుఖినోభవంతు.........సెలవ్ చెప్పండి అందరికి.
జయప్రభాశర్మ

49. PALLE SEEMANANDI


పచ్చని పైర్లు,పంటకాల్వలు,పిల్లతెమ్మెరలు, కుహు కుహు కోయిలలు, తుళ్ళుతూ గంతులేసేలేగదూడలు, ,డూ డూ బసవన్నలు, కల్మషమెరుగని మనుషులు, ఆహ్లాదకర వాతావరణం,ప్రకృతికి పెట్టింది పేరు నేను. ఇంతకీ యిది ఎవరు అనుకుంటున్నార.....పల్లెసీమనండీ.
కోడికూయకముందే మావాళ్లంతా నిద్రలేచి యిల్లు శుభ్రం చేసుకొని, ముంగిట కళ్ళాపి జల్లి ముగ్గులు వేసుకొని, తర్వాత పశువుల పాకలో పేడని తీసి ఒకదగ్గర పెద్ద గొయ్య తీసుకొని అందులో వేస్తువుంట్టారు......ఎందుకంట్టే అది పంటకి ఎరువుగా వాడుకుంట్టారు. చక్కటి కాగుపుల్లో, వేపపుల్లో,భరణికపుల్లనో విరిచి పళ్ళు తోముకుని .......పశువులకు గడ్డి వేసి,కుడితి పెట్టి చక్కటి పాలు పితికి తెచ్చుకుని వాడుకుంట్టారు....మీరూ వున్నారు...... ఏ కెమికలో కలిపిన పాలు వేస్తువుంట్టే .....ఓ...పాలపేకెట్లంటే పాలపేకట్లని. చక్కగా వండుకొని ఒకదగ్గర పెట్టుకొని వెళతారు......పొలం పన్లకి వెళ్లి సాయంత్రం దాకా రాలేరు కాబట్టి. మీలాగా టిఫ్ఫిన్లుండవ్ .....గంజి అన్నంలో ఏ ఉల్లిపాయో,ఉల్లికాడో,ఏదీలేకపోతే ఎండుమిరపకాయ కాల్చుకొని నంజుకొని ఎంచక్కా తింటారు.....ఉడుపులనో,గొప్పులనో ,గాబుతీతనో ఏదో పని వుంటునే ఉంట్టుంది. ఇంటిల్లిపాది యెంత కష్టపడతారో తెలుసా .....పశువులకు పచ్చగడ్డి కోసుకోవడం,అదునుచూసి దున్నుకోవడం,నారుపోసుకోవడం,కోతకోసుకోవడం, కుప్ప నూర్చుకోవడం.....యెంత చేసుకున్నా విసుగు విరామం ఉండదు......ఎప్పుడు చూసిన ప్రతీ యింట్లో నవ్వుల పువ్వులే ....మీ పట్నవాసులున్నారే.........తిన్నది అరక్క వాకింగ్లు, జాగింగులు,డైటింగులూను అదే మావాళ్లయితేనా ఎప్పుడూ కష్టపడతారు..... యిలా ఆలా కాదు ......చెమటలు పట్టి ఒళ్ళు అలిసేలా ....ఎందుకు అనారోగ్యాలొస్తాయి....సాయంకాలం పనినుంచ్చి రాగానే అది ఏకాలమవని, ఉడుకునీళ్లు పెట్టుకొని చక్క స్నానం చేస్తారు ......పొలం గట్లమీద పండించిన కాయగూరలు తాజాగా తెచ్చుకొని ఏంచ్చక్క కూరొండుకుతింటారు ....అంబలి కాచుకోంది ఒక పూటైనా వుండరు.. అందుకే జుట్టు తుమ్మెదల 
మెరిసిపోతుంటుంది....నువ్వులు నూనె గానుగాడించుకొని అదే వాడతారు వంటకానికి. యిహ పంటలైతే చెప్పే అక్కర్లేదు ...ధాన్యం,పెసలు,మినుగులు,ఉలవలు,కందులు,మిరపకాయలు,నువ్వులు,చోళ్ళు,శెనక్కాయలు ఒకటేమిటి సమస్తం పండించుకుంటారు. యిహ మావిడి,ఉసిరి,పనస,చింత ఐతే చెప్పనవసరమేలేదు..... 
....ఉడుపులప్పుడు ఆ ఊరి గ్రామదేవతని ఎంతగానో పూజించ్చి, వుపారాలు పెట్టి యెంత సంబరం చేస్తారో .....పంటలు బాగా పండాలని కోరుకుంటు. పుష్యమాసమొస్తే ఏమి ఆనందమో......పాడిపంటలతో,పసుపుగడపలతో ప్రతీ యిల్లు కళ కళలాడుతూ,ధనలక్ష్మి యిక్కడే తాండవం చేస్తుంది. ఆ మాసంలోనే వచ్చిన భోగి,సంక్రాతి,కనుమ పండగలు కళ్ళవిందుగా ఉంటాయి. భోగిమంటలు,కోడిపందేలు,గంగిరెద్దులు,జంగమదేవరులు,తప్పెటగుళ్లు. కనుమరోజైతే పశువులకు పసుపురాసి కుంకుమబొట్టు పెట్టి పూజిస్తారు.
పిండివంటలైతే అరిసెలు,పొంగడాలు,పాకుండలు పిండి దుంపుకొని మా బాగా చేస్తారనుకోండి.ధాన్యరాశికి పూజ చేసిన తరువాత ఆ యింటి ఆడపడుచు గంప నిండుగా ధాన్యం తీసుకోవాలి......గరిసెతో ధాన్యం రాగానే ఎడ్లకి కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్టుపెట్టి .... 
అప్పుడు గాదెలో పోస్తారు......ఏవిటనుకుంటున్నారు మరి.......యెంత సంప్రదాయాలో.....కట్టు, బొట్టు 
అవి చూస్తుంటే యెంత ముచ్చటేస్తుందో......మావాళ్లకి సాటి ఎవ్వరు లేరు, రారు ......అంత గొప్పవాళ్ళు .......యెంత చెప్పిన తక్కువే.
ఎక్కడ చూసిన పూల ఘుమ ఘుమలు, పండ్ల తీయదనాలు. మీకూ అమ్ముతున్నారు పళ్ళు......ఏం పళ్ళు అవి......అవేవో రసాయనాల వల్ల పండుతాయట.......వున్న ఆరోగ్యం పోవటానికి. ......వీళ్ళ దుంపతెగా......పాపం ఒడికట్టుకుంటున్నారు ......అదేం పొయ్యకాలం.....మా పళ్ళు తింటే వదుల్తారా......అంత మకరందం.......తింటుంటే తినాలనిపిస్తుంది. ఎందులో చూసినా నేనే ప్రముఖం.......వాతావరణ కాలుష్యం లేనిదాన్ని........మీరు మీ పట్నవాసం......చాల్లెద్దురూ బడాయి.....ఎప్పుడూ రణగొణ ధ్వనులు,పరిశ్రమల కాలుష్యం మీరూను.
సుగర్లు, బి.పీలు, ఫేట్లు అన్నీను. మిమ్మల్ని మీరే చూసుకోండి. 
పట్నవాసులమని ......అన్నింట్లో మేమే ప్రధమం అని అనుకోకండి.......రండి నన్ను చూడండి......వస్తారు కదూ .......తాటి ముంజెలు,కొబ్బరి బొండాలు యిస్తా వస్తే. దండాలు.

జయ ప్రభాశర్మ.


50. TELUGU PALUKU


హాయ్ ....హౌ అర్ యు .....హమ్మో యిందేంటిది నాక్కూడా యి భాషోచ్చేస్తోంది ....అందుకే అంటారు ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని. నన్ను నేనే మర్చిపోతున్నాను. సరే అసలు విషయానికొద్దాం ......నేనండీ.. తెలుగు భాషనీ ....ఏంటీ యిలా వచ్చింది?అని చూస్తున్నారా...ఆ ఏం లేదు...నాలుగు ముక్కలు చెప్పిపోదామని.....నా భాషను ఎందుకండీ పట్టించ్చుకోవట్లేదు ....అంత అలుసుగా కనిపిస్తున్నానా?....తేనెకన్నా తీయనైన దాన్ని, పలుకుతుంట్టే పలకాలనిపించేదాన్ని, వింటూవుంటే వినాలనిపించేదాన్ని.....అలాంటి నన్ను మూలపెడతారా.....యిది ఎంతవరకు సమంజసం .....మీ పిల్లలు మమ్మీ అని పిలుస్తుంటే భుజాలు గజాలైపోయి పొంగిపోతారా...ఎప్పుడో బ్రిటిషువాడొచ్చి వదిలిన ముక్కల్ని పట్టుకొని వేళ్ళాడతారా?. ఆంగ్ల భాష అంటే అంత మోజా?. అందులో సగం నాకోసం కేటాయించ్చిన ఉబ్బితబ్బిబ్బైపోతాను.
అమ్మ అన్న పిలుపు యెంత కమ్మదనం ....దేశవ్యాప్తంగా ఏ భాషలోనైనా,ఏజంతువైన పలికే పలుకు "మా". సంస్కృతంలోనుంచ్చి పుట్టినదాన్ని. రామాయణం,భారతం మరెన్నో కావ్యాలకు మూలమైనదాన్ని.ఎందరో కవులకు ముద్దుల బిడ్డని. మరి అలాంటి మహానుభావురాల్ని ఐన నన్నుయెంత ఎత్తున కూర్చోపెట్టాలి .....వీలయితే "సింహాసనం"ఏర్పాటు చెయ్యాలి. చిన్నతనంగా,యీసడింపుగా చూడకూడదు. ఏదో బతకడానికి నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకోక తప్పని పరిస్థితి. అంతటితో సరిపెట్టుకొని తెలుగు భాషపై మమకారం పెంచ్చుకోవాలి. "దేశభాషలందు తెలుగు లెస్స" అని ఊరికే అన్నారా?. ఏ దేశానున్నమన భాషని మరువకూడదు. మన కన్నతల్లిపై యెంత ప్రేమ కనబరుస్తున్నామో అలాగే నేను కూడా.
ఎంచక్కా పిల్లలతో యింట్లోనైనా నా భాషలో మాట్లాడుతుండాలి. పెద్దబాలశిక్ష కొని దగ్గరుండి చదివించాలి. ఆ పిల్లలు నీళ్లు తాగినట్లు లొడ లొడ వాగుతుంట్టే గొప్పయిపోకూడదు. నా వల్ల సంస్కారం,మర్యాద,గౌరవం తెలిపినవాళ్లవుతారు. ప్రతీ రాష్ట్రం వాళ్ళు ముందు వాళ్ళ భాషకే యిస్తారు ప్రాధాన్యం. వాళ్ళని చూసైనా మీరు నేర్చుకోవాలి. చక్కటి లలితగీతాలు,జానపదగీతాలు,బుర్రకథలు,హరికథలు,దేశభక్తిగీతాలు నేర్పండి. వాటిల్లో కూడా నేనే ఉంట్టాను. అందువల్ల భాష పై పట్టు పెరుగుతుంది. ఇంగ్లీషులో తెగ మాట్లాడేస్తున్నారని అనుకుంటుటారు పాపం. అక్కడ కూడా తప్పుల తడకలని గ్రహించుకోండి. వ్యాకరణం బాగా నేర్పించ్చండి. నా భాషని పాఠ్యఅంశంగా తీసుకోండి. మొదటి ప్రాముఖ్యత నాకివ్వండి. ఎందరో మహానుభావుల భాషా ప్రయత్నాన్ని వమ్ము చేయకండి. వారికి భాషపై వున్న అభిమానానికి మీరు వంత పదండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పడుతున్న తపనకి జై కొట్టండి.

తుదిగా ఒక మాట .....చాలామంది అక్షరదోషాలతో పలుకుతుంటే గుండెను రంపంతో కోసినట్టుంట్టుంది. భాషని బతికించండెం .....తెలుగక్షరాన్ని లక్షలుగా భావించ్చండి .....ఇంతసేపు నా ప్రాధాన్యత గురించ్చి చెప్పే అవకాశం యిచ్చిన మీకు ....నా నమస్సులు.ఉంట్టాను
జయప్రభాశర్మ

51. VEPAYYANAMAHA


ఏవండోయ్ .....నేను మీ వేపపువ్వుని ......ఉగాది పండక్కి నాకంటె నాకని పోటీ పడుతుంట్టారుకదా ...ఆ వేపపువ్వుని .....ఏవండీ యిది ఏమైనా బాగుందా ....నేను ఆ రోజు తప్ప మిగతా రోజుల్లో ఎందుకు కనిపించనండీ...అః తెలియక అడుగుతున్నాను ...అంత కానిదాన్నయిపోయాన ....నాకు పోటీ ఆ మావిడి లేదూ...దాని సిగ తరగా....అబ్బో ఏం ఫోజో ....దాని వేపు మాత్రం చూస్తారేం .....పిందెపెట్టిన దగర్నుంచ్చి అదేపని ....అవున్లేన్డి....మాదగ్గరేముందని ....అక్కడైతే ఆవముక్కలు,ఆవకాయలు,మాగాయలు,తొక్కుపచ్చళ్ళు,కొబ్బరి,మావిడికాయ పచ్చడి,మావిడికాయ పులిహోర మొదలుకొని...... ఒకటేవిటి అన్నీను .....పళ్లైతే యిహ చెప్పక్కర్లే.....మీరు యిలా ఎగపాకరబట్టే దానికి అంత తివురు .....నన్ను చూసి నవ్వడమును .....నాకు మరీ గీర....పోని పోని అని ఊరుకుంటున్నాననా....ఓయబ్బో నేనంతకంట్టే గొప్పదాన్ని ....... నా గురించి ఒక్కోటి చెప్పానంటే దిమ్మ తిరుగుద్ది .....దానికేంతెల్సు మన గొప్పతనం.....దేవతల అంశం నుంచి వచ్చినదాన్ని.
అమ్మవార్లందరికి నచ్చినదాన్ని .....ఎన్ని పళ్ళు పెట్టినా, ఎన్ని చీరలు ఇచ్చినా, ఎన్ని స్తోత్రాలు చదివినా లాభం లేదు ....నన్ను తీసుకెళ్లండి యెంత మురిసిపోతుందో ......యెగిరి గంతులేసి ....పరకాయ ప్రవేశం చేసి డప్పులు మోగుతుంట్టే...చూడాలి..ఆనందనాట్యం....
అంతకంటే ఇంకేంకావాలి ......చేనుకి పురుగు పడితే నేనే.....మీ ఒంటిపైన దురదలు, దద్దుర్లు, కురుపులు వస్తే నేనే.......నా పిక్కలు తీసుకెళ్లి తైలం ఆడించి మీ బుర్ర మీద దరిద్రగొట్టు పేలుకి ....చ్చి ...నేనే......నా కడుపులో దేవేసినట్లుంట్టుంది.....పచ్చి బాలింతరాలికి నా ఆకులు .. ఓ.. నూరేసి పట్టించేస్తారు .....అప్పుడు గుర్తుంట్టానేం ....మళ్ళీ మీ బాధలేమైనా తీరాలంట్టే నాదగ్గరకొచ్చేసి ప్రదక్షిణలు, దండాలు, పసుపు కుంకాలు, నైవేద్యాలు, హారతులు.....యిన్ని అని చెప్పలేం ....అన్ని ఉంట్టాయి.....అంత స్వార్ధపరులు.
ఇక మాతో పెద్ద పెద్ద సంస్థలైతే ఎన్ని వ్యాపారాలో ....టూత్పేస్టులు. సబ్బులు, 
క్రీములు తయారు చేసి ఏం వ్యాపారం చేస్తున్నారో ......అవేవి గుర్తుండవు ..............నన్ను చూస్తే మాత్రం....అదీ.......... అవసరం తీరిపోతే......హబ్బా..చేదు.....హబ్బా ...కంపు.....అంటారేం.....ఏం బుద్ధిది.....చక్కని మాట చెబుతాను వినండి.....ప్రతి యింట్లో నన్ను పెంచుకోండి .....నువ్వు చెప్తున్నావ్ గాని మేమెట్లా పెంచేది అనుకుంటున్నారా...........................అపార్టుమెంట్లు కదా అని. బుర్ర బద్దలు కొట్టుకోకండి......ఎంచక్కా మీ అపార్టుమెంట్ గేట్ దగ్గర ఒక పక్కాగా వేసుకోండి ....చక్కటి ఆరోగ్యకరమైన గాలిని యిస్తాను, మీ వాళ్ళ మీద, మీ యింటి మీద భూత ప్రేత పిశాచాలు వ్రాలకుండా చూస్తాను......పర్యావరణ పరిరక్షణకై పాటుపడండి ......మీ ప్రభుత్వం చెవిలో జోరీగల అరుస్తుంట్టే వినివించుకోరా....చాల్లే వేపగోల అన్నా.....వినిపించుకోనుగాక వినిపించుకొను.....నే చెప్పాల్స్న్ది చెబితేగాని వెళ్ళను...... మర్చిపోయాను ......................,యింకో మాట...... చిన్నపిల్లలికి కడుపులో తేడా వచ్చినా .....పెద్దవాళ్ళకి కడుపులో నులిపురుగులొచ్చినా .....నా రసం తాగితే పోతాయండోయ్.......వేపకాయంత వెర్రి అంటారు......వేల ప్రయోజనాలు అని తెలుసుకోండి...... ఓం వేపచెట్టాయా నమః .....అని నన్ను రోజు పూజించండి. వేపచెట్టుల్ యింట వేల కాంతుల్, చేదు విషము కాదిది చెంత లాభబ్బిది,జ్ఞానమంత మరచి జారిపోకు విడచి, నమ్మి నను పట్టు, నిజము యిది సుమ్మి. అంతేగాని ఎప్పుడో ఉగాది నాడు క్యూ కట్టడం కాదు.
ఆ వస్తున్నా .......అవతల అమ్మవార్లు పిలుస్తున్నారు.....మీ అందరికి .....ఆయురారోగ్యఐశ్వర్య ప్రాప్తిరస్తు ......శుభంభూయాత్.....ఓం శాంతిః .........శాంతిః .................
.శాంతిః .


52. CIGARETTE HITHABODHA



హలో ...బాగున్నారా ....నేను సిగరెట్నండి ....తెల్లారి లేచినమొదలు గ్ఫ్ గ్ఫ్ మని రాత్రి నిద్రపోయేవరకు తిండి తిన్నా తినకపోయినా, నిద్ర పట్టినా పట్టకపోయిన..... నా మీద బోల్డు ప్రేమ కురిపిస్తారే .. యి జెల్సారాయుళ్లు .....గుర్తుకొచ్చానా ....అది .....గుర్తుకు రాక ఛస్తానా................యి మగమహారాజులకి ప్రీతిపాత్రురాలినే..... కానీ........... ఆడవాళ్ళకి మాత్రం ఛండాలపుదాన్నికదా ....నా పుట్టుక మరి అలాంటిది ....నేనేం చేస్తాను ......ఎక్కడికో పారిపోయి బతుకుదామన్న ఎలాగైనా గాలించి తెచ్చి చచ్చినట్టు కూర్చోబెడతారు ..........నా దౌర్భాగ్యం కాకపొతే ....నేను చేసిననేరం ఏంటో...... నాకు అర్ధం కావట్లేదు .........నన్ను డబ్బులిచ్చికొనొక్కుని ..నాకు మంటపెట్టి ఆనందిస్తారా .....యిది ఏమైనా బాగుందా ....కడుపుకి అన్నం తింటున్నారా గడ్డితింటున్నారా ............రోగం కొని తెచ్చుకుంటున్నార్రా బాబు అన్నావినరా ....మీ ఖర్మ ..... అదేంసరదా ...... మీ పెళ్ళాంచేత రోజు తిట్లు తింటేగాని మీకునిద్ర 
పట్టి చావదా .....నాకు చేతులే గాని ఉంటేనా ....ఐపోయేవారు 
నాతొ కోటానుకోట్ల వ్యాపారం.. నేనే ఉన్నానా.......ఈ వ్యాపారానికి .............దంపుడు బియ్యం వ్యాపారమో,రాగిపిండి వ్యాపారమో,గోధుమపిండి వ్యాపారమో చేసుకోవచ్చుకదా............హబ్బే అలాంటివి మనకు నచ్చవుగాకనచ్చవ్ .....ఏ యింటికి చిచ్చు పెడితే బావుంట్టుందో అదే మనకు నచ్చుతుంది .....పాపం ఆడకూతురు మొర్రోమని ఏడుస్తున్న పట్టించ్చుకోరా .....రేపు మీ ఒంటికి ఏదైనా వస్తే బాధపడేదెవరు .....సాగినంతకాలం సాగని అనే ఉద్దేశం మార్చుకోండి ....అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు .....పెద్ద పోటుగాళ్లమనుకుంటున్నారా ...క్యాన్సర్లు, టి.బి లు, గుండెసంబంధిత వ్యాధులు వస్తే ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోరు ..............నన్ను కాల్చినట్టే మీ డబ్బులు కాలిపోతాయి .....దగ్గులు దగ్గుకుంట్టు కూర్చుంటే ఎవ్వరు దగ్గరకి రారు...........ఉసూరుమని ఏడుస్తారు... మీవాళ్లు నామీద ....యిప్పటికే యిలాంటీ జన్మ ఎత్తాను.....చాలదా 
మీకు దండేసి దండమెడతా ....మంచిపురస్కారమిస్తా .....బతిమాలుతున్నా.......బాబ్బాబు .....మీ యింటి వెలుగు సిగరెట్ వెలుగుఅనుకోండి ....యింటి మాలక్ష్మినిఏడిపించకండి .....నన్నుతిట్టించకండి ...చొక్కా చిల్లులు పెట్టుకోకండి ......ఆరోగ్యమే మహా భాగ్యమనుకోండి ......అది ఉంటనే ఏదైనా.......మీరు కాల్చకండి ఎవర్ని కాల్చనివ్వకండి .....ఎంజాయ్ చేయకపోతే మజా ఏముంది అన్న స్నేహితుల మాట వినకండి ...........ప్రిస్టేజికి పోకండి ....కావాలంటే వాళ్ళని ఒక పూట ఏ హొటేలుకో పట్టుకుపోండి ....మీ ఆవిడకి తెలీకుండా.....ఓకేనా............అప్పుడే బాగుపడతారు ......మళ్లీ జన్మలో మీ యింటి వెలుగై వస్తా ....యి జన్మలో సిగరెట్టునై శీను ఎలాగూ కాలిపోయింది ...ఆపెహే సొల్లు అనకండి......మంచి మాట చెబుదామని వచ్చాను ....వింటే ...... ఓకే ....లేకపోతె అంతేసంగతులు .....చిత్తగించవలెను ...

.టాటా..బై బై....సీ యూ

53. Panasamora 


నమస్తే ...నేనండీ ....పనసని.....పుట్టి పెరిగింది కూరగాయలవారింట్లో,మా అమ్మ పేరు ధరిత్రి నాన్నపేరు ప్రక్రుతి మా పెద్దక్క పేరు బురదపనస నా పేరేమో కజ్జాపనస .....నాగోడు వెళ్ళగ్రక్కాలని వచ్చానండి .....యెంత క్షోభ పెడుతున్నారో యి మానవులు ....కఠిన పాషాణ హృదయులు .....నా మనసు 
యెంత గాయపడుతోందో వినండి మరి 
విత్తు నాటిన నుండి చూస్తూనేఉంట్టారు ...యెంత వేగం పెరుగుతానా అని. ఇక పెరుగుతానా చూస్కోండి ....చీల్చి చెండాడుతారు దుర్మార్గులు .....ఆకులు త్రుంచి అవేవో బుట్టలట ....నా మెడలు వంచ్చి పుల్లలతో పొడిచి పొడిచి హింస పెట్టి కుట్టేసుకొని తినేసి చెప్పలేని ఆనందం చెందుతారు .....తెలీక అడుగుతాను రోజు ఇడ్లి తింటారు చాలదా......ఎందుకింత పైశాచికానందం ......ఇక నా పిల్లలు చిన్న కసురు పిందెలు.....అరె .వాళ్ళనికూడా వదలరె.....ఆవ పెట్టుకొని వండితే అద్భుతఃట....కస కస కొట్టేసి కూర .....తద్దినానికి నా పిల్లలే కావాలా ....నా పిల్లలకి తద్దినం పెడుతుంటే నేనెంత బాధపడాలి ....మరి కొంచెం పెరిగేసరికి పాఠోళీలు, మాసాలకూరలు ఇవేవి చాలవు అన్నట్లు 'పనసకాయ బిరియానీలట' .....వీళ్ళ అసాధ్యం కూల .....తిండికే పుట్టారా......ఏ మూలో దాక్కొని బాగా పెరిగి పెద్దవారయ్యేసరికి హమ్మయ్య అనిపించి ఊపిరి పీల్చుకొనేసరికి మళ్ళీ రెడీ ...... పీక తెగ నరికి యింట్లో దాచేసుకొని ఎప్పుడు పండుతుందా అని ఎదురు చూపులు ......ఇక పండేసరికి అందులో సందేహాలు కజ్జాపన్సా బురదపనసా అని .....ఏదైనా వదిలేది లేదే ....తృప్తిగా తిని మళ్ళీ పిక్కల్ని కూర చేస్తే బావుంట్టుందని ఆలోచన ....ప్రణాళిక సిద్ధం ....మాసాలకూర లేకపోతె కాల్చుకొని తిందామా ....యిదే వీళ్లపని ....నాకు నోరేగాని భగవంతుడు యిచ్చి ఉంట్టేనా .....ఏంచేస్తాం మా ఖర్మ
ఆ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి మా మీద కరుణ కలగలేదు .....ఆ పువ్వులు మీద జాలి చూపించారు కానీ నన్ను చూసారు కాదు .....పెట్టి పుట్టాలంట్టారు దేనికైనా .....ఒక్క
తృప్తి మాత్రం మిగిలిందండోయ్.....చెప్పమంట్టారా......అదేనండి మన చదువులతల్లి సరస్వతమ్మ చేతిలో ఎప్పుడు వుండే వీణ ....ఆ వీణకు కావాల్సిన మూలం నేనేనండీ.....నా జన్మ ధన్యం కదా....మీకు యివన్నీ చెప్పి బోరు కొట్టించానేమో .....మీరు మానవులు ....ఏదైనా చేయగల సమర్థులు .....తిట్టుకోకండి .....నీరసం వచ్చేసింది .....ఏం చెప్పిన వృధా ....చెవిటోడి చెవిలో సెంఖం వూదినట్లే ...సెలవ్



54. River Naagavali 


ఒరిస్సా లో రాయగడ దగ్గర కొండల లో పుట్టిన నేను వొయ్యారాలు ఒలకబోస్తూ, హొయలుగా నడుస్తూ, ఎందరికో ఆనందాన్నిస్తూ, ఉత్సాహంగా ఉరకలు వేస్తూ సాగిన సౌందర్యరాశిని, అంతులేని సంపదని,ఉత్తరాంధ్ర మానస పుత్రికని మీ నదీమ తల్లిని. అదేనండి మీ నాగావళిని. గల గల పారుతూ ఎప్పుడు సందడి చేస్తూ ఉంటానే గాని ఎన్నడూ ఎవరికి హాని అంటు చెయ్యని దాన్ని. రైతన్నల చిరునవ్వులు చూసి యెంత పొంగిపోతానో తెలుసా......వారి ఆనందమే నా ఆనందమని అనుకున్నదాన్ని.శ్రీమజ్జిగౌరమ్మతల్లితో మొదలైన నా ప్రయాణం మధ్యలో పంచారామాల్లో ఒకటైన శైవక్షేత్రం గుప మీదుగా సాగి, అటుపైన ఉంత్తరాంధ్ర తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి శ్రీవేంకటేశ్వరస్వామివారినిగాంచి, కొంతదూరం సాగి సంగమేశ్వరం అనే మరియొక శైవక్షేత్రాన్నివీక్షించి, మూడునదుల సంగమం, నేను యెంత అదృష్టవంతురాలనో కదా; అందులో నేకూడా వున్నందుకు, చివరిగా శ్రీకాకుళంలోవున్న కోటీశ్వరస్వామివారిని దర్శించుకొని భాగ్యం నాదే .
తోటపల్లిదగ్గర బ్రిటిష్ కాలంనాటి వంతెన మూతబడుతుంటే యెంత వేదన చెందానో .....అలాగే రైతన్నలు గ్రామాలు ఖాళి చేసి వెళుతుంటే యెంత బాధపడ్డానో .....నేనేమి చెయ్యలేని అసమర్ధత .....బరువెక్కిన హృదయంతో ఒక్క దగ్గరే ఉండిపోయా అలా చూస్తూ
మళ్ళీ యిప్పుడు యెంత సంతోషంగా ఉందొ తెలుసా......మాటల్లో చెప్పాలని, భావాల్ని పంచుకోవాలని ఆశగా వుంది ......ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారు నా జలసిరిని చూసి ముగ్ధులై నన్ను పర్యాటక కేంద్రంగా ఎంచుకున్నారు ....వచ్చినవాళ్లంతా నా అందాన్ని చూసి పొగుడుతోంట్టే యెంత గరవంగా వుందో.... పడవ ఎక్కి నన్ను చిన్న పెద్ద ముద్దాడుతుంట్టే.....ఆ సంబరాన్ని నే కూడా పంచుకుంటున్న ......యింకా సందడి చేస్తూ, సవ్వడి చేస్తూ అనేక వనమూలికలతో సుగంధాలు వెదజల్లుతూ, నిత్యం నిండుగా ప్రవహిస్తూ, ప్రత్యేకంగా వానాకాలంలో ఒండ్రుమట్టి చీరకట్టి చిందులేయాలని వుంది. ఈ జలరాణిని చూడాలంట్టే రాయగడ రావాల్సిందే ......వస్తారు కదూ.....ధన్యవాదాలు


Comments

Popular posts from this blog