"Malle Puvvu"
బొండుమల్లి,దొంతిమల్లి, సిరిమల్లి,మరుమల్లి, కొండమల్లి, అడివిమల్లి, పందిరిమల్లి,జాజిమల్లి కాడమల్లి. మధుమాస వేళ!మరుమల్లి రాక!........ఆహ! ఓహో!. వసంతం వహ్వా! వాసనల హేల!......ఆబ్బబ్బబ్బా! ఆపవమ్మా గోల!. ఏవిటీ! గోలా! నా పేర్లు ఎన్నున్నాయో చెబుతుంటేను!విసుగా!. ఫిబ్రవరి వచ్చిన దగ్గరనుంచి నాకోసం యెంత పరితపించిపోయి, ఎదురుచూస్తుంటారో! పల్లీసుపెట్టుకొని! మరెందుకమ్మా!. పోదురూ, మీరు మీ బడాయీను!. అంత పరిమళం వెదజల్లే కుసుమాన్ని నేనే గనక!. వేసవి చెమటకి తడిసి ముద్దయిపోతున్నా నన్ను మాత్రం వదిలితే ఒట్టు. సాయంకాలం ఎప్పుడవుతుందా, పూలు అమ్మకానికి వస్తాయా, ఎంచక్కా అలా షికారు చేసి వద్దామా, అనీ ఇవే ఆలోచనలు. యిహ! పరిమళ ద్రవ్యాల వాళ్ళైతే మరి చెప్పటానికి లేదు.విపరీతంగా తీసుకెళ్లి వాడుతుంటారు.అగరుబత్తి తయారీదారులు అసలు వదిలేది లేదు. అంత మోజన్నమాట. సబ్బులు,క్రీములు,పౌడర్లు యిలా ఎన్ని వ్యాపారాలు నావల్ల జరిగి లబ్ది పొందుతున్నారో. అసలు నేనంటే ఇష్టపడని వారు ఎవరు చెప్పండి! మన లెక్కే వేరు.పెళ్లిళ్ల సీజను వస్తే, మనదే హడావిడి, ఎక్కడ చూసినా.
పెళ్ళికొడుకు,పెళ్లికూతురు మెడలో దండలు, పెళ్లి పూలజడ, వియ్యాలవారి,విడిదింటికి మల్లెపూల మాలలు, ఒకటేమిటి, పెళ్లిపందిరి ఘుమ ఘుమలాడుతూ, యెంత చక్కటి ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందో నే వున్నదగ్గర. వదలి రాబుద్ధవుతుందా?.యెంత సేపైనా ఆస్వాదిస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. శోభనం పెళ్లికూతురనగానే, మనమే కచ్చితంగా ఉండి తీరాలి. శ్రీరామనవమి, శ్రీసీతారాముల కళ్యాణంనాడైతే సరేసరి. కన్నుల వైభవం, తిలకించాలి అంటే మనముండాల్సిందే,భద్రాచలం దగ్గరనుంచి బయ్యవరంవరకు. అలాంటి గొప్పతనం నాది. ఇంతకంటే ఇంకేం కావాలి. యెంత అదృష్టవంతురాలనో కదా!. ఆనాటి కవులునుంచి ఈనాటి సినిమా పాటలవరకు మనముండి అలరించిన సన్నివేశాలెన్నో. నన్నే నమ్ముకొని బతుకుతున్నవాళ్ళెందరో. కావాలంటే ఒక్కసారి ఆనందపురం, సాలూరు వచ్చి చూస్తే తెలుస్తుంది. సాలూరు అనగానే టక్కున నేనే గుర్తొస్తాను తెలుసా!. అంత పేరన్నమాట. నా తోటలు చూశారంటే మైమరచిపోతారంటే నమ్ముతారా!. నిజం. ఆ! అవునట్టు మరచిపోయా! నాతొ కవులు భలే పోలుస్తుంటారు.మల్లేవంటి మనసని. ఇంక ఆపేస్తున్నా!. ఇచ్చేరు కదా చాన్సు అనీ రెచ్చిపోకూడదు! విలువపోగొట్టుకోకూడదు! నా గుభాళింపుతో ఎప్పటికి మిమ్మల్ని పరవశింపచేస్తూనే వుంటాను ఇలానే. మీరు కూడా ఇలానే అభిమానిస్తూవుండండి. ఎవడికోసం! చెప్పవసరం లేదులెండి......మనని మిచ్చిన సువాసనల పువ్వులుంటేగా!. ఓకే.వుంటాను.బాయ్....ఇట్లు, సువాసన మల్లి......జయప్రభాశర్మ.
Comments
Post a Comment