Eetha Chettu
ఎవరు నాటారు!ఎవరు పెంచారు!. చారెడు నీళ్లు అయ్యో పొద్దామని, ఎప్పుడైనా పోశారా?. అః! ఆ ఒక్కటీ అడక్కూడదు. గాలికి పుట్టి గాలికి పెరిగినదాన్ని. కానీ నా సేవ మాత్రం కావాలి. ఏవిటో సేవలు?. ఓయబ్బో! తెలియనట్టు ఏవిటడగడం!. ఇంతకీ నా పేరు ఏవిటని అడిగారా! ఏ ఒక్కరైనా!.మీరెక్కడ దేవాంతకులు!నా అవివేకం గానీ! పేరు తెలియకపోవడమేమిటీ!. అయినా నా డబ్బా నే కొట్టి ఏడ్వాలి కదా!. నా పేరు" ఈత చెట్టు". ఎక్కడో పుట్టి ,ఎక్కడో పెరిగి,
అందుకొచ్చినాక కలుస్తాము. అవునట్టు యీమాట ఎక్కడో విన్నట్టుందే!ఆ!గుర్తొచ్చింది,గుర్తొచ్చింది! స్టూడెంటు నెంబర్ వన్ సినిమాలో పాట కదా! డైరెక్టర్ రాజామౌళిగారు కదూ!మహానుభావుడు ఎంచక్కా తీసాడండి బాహుబలి! అది చిన్నా, చితకా సినిమానా!వామ్మో! తెలుగు చలన చిత్రరంగాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాడండి బాబూ!ప్రపంచమంతా జే జేలు పలికిన సినిమా!. యిహ నా సంగతికొద్దాం!పెరిగిన తర్వాత వస్తారా? అంతవరకూ నావంక చూస్తే ఒట్టు. నా వల్ల ఎన్ని ఉపయోగాలు. చాపలు,బుట్టలు, ఈతకాయలు,ఈతపళ్ళు, ఈతకల్లు, ఈతకంజి. కొబ్బరి కంజి ఎలా ఉంటుందో అంత కంటే
రుచిగా ఉంటుంది కంజి తెలుసా! ఎక్కువ ఇష్టంగాతింటే చిన్న మత్తునిస్తాను కూడా!. చాలా మందికి మీలో ఆ విష్యం తెలీనే తెలీదు. తాటి కల్లు ఎలాగో ఈత కల్లుని అలాగే ప్రశంసిస్తూ,తెగ ఎగబడతారు. నన్ను నమ్ముకొని బుట్టలు, చాపలు అల్లుకొని, జీవనం సాగించేవారు ఎంతమందో!. నా పళ్ళు తీసుకొచ్చి పట్నాల్లో అమ్ముతున్నారంటే, ఇంత కంటే ఆనందం ఇంకేం కావాలి!. ఈత మట్టలతో పందిళ్లు వేసుకుంటుంటారు. చల్లదనం కోసం. మరి! ఇంత సేవ చెస్తున్న నన్ను!కాస్తైనా పట్టించుకుంటున్నారా!అబ్బే!ఖాతరే లేదు! అందుకే కోపం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు! కసక్కుమని కాలిలో గుచ్చానంటే!తాతలు దిగి రావాలి! అంత కసి నాకు!. మహా ఆనందమేస్తుంది సుమండీ! ఆమాత్రం కర్చుకివ్వాలని! ముల్లునై మురుస్తుంటాను!.ఈత ముల్లా!మజాకా!చూపిస్తా నా తడాకా!. సరే! గతం గతః!యిటుపైనైనా నన్ను కొంచెపట్టించుకోండి!. అంతరించిపోకుండా చూసుకోండి!అంత కంటే ఇంకేం కోరుకోవట్లేదు. యిలాగే ఎప్పటికి మీ సేవ చేయాలనీ ఆకాంక్షిస్తూ!...వుంటాను....ఇట్లు, మీ ఈత చెట్టు......జయప్రభాశర్మ.
Comments
Post a Comment