NAANANDI BABU
"నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా".....ఏవిటీ! నువ్వు పాడితే లోకం పాడుతుందా నువ్వు
ఆడితే లోకం ఆడుతుందా!....బాగుంది నాయనా బాగుంది!. " నా పాట పంచామృతం"....ఇదొకటా!........ అవును! డౌటా? శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుణ్ణి కాకపోవచ్చు! స్వరాలతో సయ్యాటలాడకపోవచ్చు! కానీ! సామాజిక గీతాలతో ఆకట్టుకున్నవాణ్ణి. ఓహో! తమరి నామధేయము?.....దేవిశ్రీ!. అయ్యా! మీ జన్మస్థలం?.......విజయనగరం జిల్లా, పార్వతీపురం తాలూకా, పెద్దింపేట అను గ్రామము......మీయొక్క విద్యాభ్యాసము ఎచట కొనసాగినది?. పార్వతీపురం పట్టణంలో కొనసాగినది. అటులనా! ప్రస్తుతము మీ నివాస స్థలము?.......విశాల హృదయులున్న విశాఖపట్టణము. ఓహో! విశాఖయా!. మీరు ఏరకమైన పాటలు ఆలపించుచుంటిరి?.......సమాజహితం కోరి రచనలు చేస్తూ, ప్రజాగాయకుడినై,అన్ని ప్రదేశములు చుట్టి, పాటే ప్రాణంగా బతుకుచుంటిని. ఆనందము! మీవంటి గాయకుల పరిచయము మా మనసునకెంతో సంతసము. అంతటితో ఆగవలదు! భవదీయుడు "దేవిశ్రీ" మిక్కిలి పేరు గాంచిన ఒక జానపదగీతాల కార్యక్రమానికి "న్యాయనిర్ణేతగా" వ్యవహరించిన తీరు బహు ప్రశంసనీయము. వహ్వా! వహ్వా! మేముకూడా మెచ్చితిమి. మీ రచనాశైలిలో మీకు నచ్చిన, జనము మెచ్చిన పాట ఏదని చెప్పగలరు?......తెలుగు సీరియల్స్, సెల్ ఫోను ఇలా,రకరకాలుగా వినిపించి రంజింప చేయుటయే నాకు పరమానందభరితము. స్వామి!కచేరీలు ఏమైనా చేస్తూవుంటారా?.....ఎవరైనా పిలిచినచో మహాప్రసాదముగా భావించి గానము చేసి వచ్చెదను!. సంతసము! మీ కచేరికై ఏమి వెచ్చించవలెను?......ఆశించుట నా అభిమతము కానే కాదు! ఆత్మీయముగా అక్కున చేర్చుకొని, నా గానము వినినచో అదియే పరమాన్నము. సన్మాన, సత్కారాలు ఏమైనా జరిగినవా?.......అదిగో! మరల మా సహనమునకు అడ్డు వచ్చిరి?......ఏమి! స్వామి! ......మనకు అలాంటివి రుచింపవు....... జరిగినవి..... చెప్పుటకు డబ్బా అగునని అయిష్టముగానున్నది. కోపించవలదు!. మీ స్నేహితుల ప్రోత్సాహం యెటులుండును?. అత్యత్భుతం! వారి ఋణము తీర్చుకోలేనిది. ఆశ్చర్యము! మీ వెంట నిత్యమూ ఎవరు వచ్చెదరు?. నా వెంట నా ప్రాణ స్నేహితురాలు వచ్చుచుండును. ఆమె నా భార్య కంటే ఎక్కువ, నా యిష్ట సఖి. యిష్ట సఖియా?మీ భార్య వింటే గొడవ చేతురేమో!. అయినను లక్ష్య పెట్టము కదా!. ఏమి మీఅరాచకం?. హ్హాహ్హా ఆమె నా కంజీర, నా సంచిలో వుంటూ నా పాటకి వాద్య సహకారమందిస్తున్న త్యాగి. సమయాభావమువలన విరమించవలసి వస్తున్నందుకు మన్నించవలెను! ఇంక మేము పోయి వచ్చెదము! సెలవివ్వుడు!. మీవంటివారి పరిచయం, నాకు వెయ్యి ఏనుగుల బలము! ధన్యవాదములు. ఒలమ్మ....నానేనా...ఇంత బాగా మాటాడినాను.....ఎలిపోనాడా, వున్నాడా.......తాతలు దిగొచ్చినారా మారేటా.....మొత్తానికి అయిందనిపించేసినాను....ఉంతను.......ఇట్లు,జయప్రభాశర్మ.
Comments
Post a Comment