"Bore Baavi"
గొయ్యి తీసి వదిలేస్తారు.మూతలైన వెయ్యరు. నాకేం తెలుస్తుంది!. అక్కడకి వెళ్లకూడదని.వెళ్తే ప్రాణం పోతుందని. అసలు ప్రాణం అంటే ఏంటో తెలిస్తేగా. వచ్చి రాని మాటలు, అప్పుడే చిట్టి చిట్టి పాదాలతో నడక. అమ్మేమో పనిలో ఉంటుంది.అక్కలకి, అన్నలకి అప్పజెప్పాననుకుంటుంది.నేనేమో వాళ్ళందర్నీ చూస్తూ, తెగ పొంగిపోతూ, చప్పట్లు కొడుతూ వెళ్లి గోతిలో పడిపోతే,ఎవరు చూస్తారు. ఎలా తెలిసేది. తెలిసేసరికి ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోతాను.పాపం నవ మాసాలు మోసి, నన్ను కనీ పెంచుతున్న అమ్మ ఎలా తట్టుకుంటుందో అనీ భయమేస్తుంది. వెతికి, వెతికి ఆఖరికి ఎలాగోలా తెలుసుకొని,గొగ్గోలు పెట్టి, అందర్నీ పిలిచేసరికి అంతా అయిపోతుంది. అప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా తరలివస్తుంది. వచ్చినా ఫలితముంటేగా!. రాత్రి, పగలు,నిద్రా హారాలు మానుకొని, ఎంతో ఖర్చు పెట్టి నాకోసం ఎంతో యాతనపడతారు. నాకోసం తెగ ఆత్రంతో అందరు ఎదురుచూస్తుంటారు. ఏ సంబంధం లేకపోయినా, ఆరోజు నాకు అందరు ఆప్త బంధువులే. అక్కడున్న వారే కాదు ప్రపంచవ్యాప్తంగా, ప్రతీ ఒక్కరు నే బ్రతికి బట్ట కట్టాలని, కనిపించిన దేవుళ్ళకు మొక్కుతూనే వుంటారు. అంతటి ప్రేమను పొందిన నేను ఉంటే యెంత బాగుండేదో!. అందరికి ప్రసార మాధ్యమాల్లో కృతఙ్ఞతలు చెప్పేదాన్నేమో.కానీ!అంత అదృష్టానికి నోచుకోలేదు. పాపం ప్రసారమాధ్యమాల్లో అదే పనిగా నన్ను వెలికి తీసే కార్యక్రమం, ప్రత్యక్ష ప్రసారం చేస్తూ, వాళ్ళు కూడా బాధపడటం, నేను వస్తే బాగుండు అనీ ఆశించడం, ఆపుకోలేనంత ఏడుపొస్తుంది. వీళ్ళందరికీ నేనేం అవుతానని!. మానవత్వం!అంతే. నాకింకా భూమ్మీద నూకలు చెల్లకుండా ఉండి, ఆవగింజంత అదృష్టం తోడై, ప్రాణాలతో గానీ వచ్చానా! ఈ ప్రపంచమే ఆనందమయం. అదే నాకోసం లొపలికి ప్రాణవాయువునందించినా, ఎన్నో అడుగుల లోతుకి కూరుకుపోయిన సందర్భాల్లో, అనేక ఉపాయలతో, తీసే ప్రయత్నం చేసినా, పడ్డ శ్రమంతా వృధా ఐ, చివికిన వొళ్లుతో, చిరిగిన గౌను ముక్కలతో నన్ను చూసేవారి ప్రతి గుండె కరగక మానదు. భోరుమని విలపించక ఉండదు. ఇక మా అమ్మ, నాన్న,అక్క, అక్క ఐతే సరే సరి. వారిని ఓదార్చడం ఎవరి తరం కాదు. వారి కడుపు శోకం జీవితాంతం తీర్చేది కాదు. ప్రభుత్వం వారు వచ్చి, ఓదార్చి,మూల్యం చెల్లించినా, నేనంటూ ఉండను కదా!. ఒక మంచి పనికోసం, సదుద్దేశంతో , చేస్తున్న ఈ బోరుబావులు తవ్వే కార్యక్రమంలో భాగంగా,ప్రభుత్వంవారు,దయ చేసి గోతులకు సరిపడా మూతలు ఏర్పాటు చేయవలసిందిగా నా మనవి. చేస్తారు కదూ!. ప్రతీ అంకుల్ ముందుకు రావాలి! ఇలా చెయ్యండి అనీ చెప్పగలగాలి!. అప్పుడే నాలాంటి చిట్టితల్లులు, నవ్వుతూ, తుళ్ళుతూ నిండు నూరేళ్లు జీవించగలుగుతారు!. సరేనా! టాటా! బై బై ! సి యు!.....ఇట్లు,జయప్రభాశర్మ.
Comments
Post a Comment