Aakali badha
అమ్మగారు! మేమేమో సంచారజాతికి చెందినవారమట. ఊరూరూ తిరుగుతూ,విద్దెలు చేస్తూ,పోగైన డబ్బులతో బతుకు గడిపేవారమట. మా అమ్మ చెప్పింది.నాకు మాట్లొచ్చినప్పటినుంచి తాడు మీద కర్ర పట్టుకొని నడిచే శిక్షణ, మా అయ్య, మా అమ్మ ఇచ్చారమ్మ. చెప్పిన మాట వినకపోతే, బుజ్జగించి, లాలించి, ఇంకా వినకపోతే, తిట్టి, కొట్టి చేయించేవారమ్మా. కాస్త జ్ఞానం రాగానే, నన్ను పెట్టి ఆటలాడించి,సొమ్ము చేసుకుంటారమ్మా. నాకెంత కోపం వస్తుందో! మళ్ళీ అంతలో సముదాయించుకుంటాను. వాళ్ళు మాత్రం ఏం చెయ్యగలరు! పైసాతోనే కదా! పొట్ట నిండేది!. అమ్మ, అయ్య కూడా వారి చిన్నతనంలో ఇలా విద్దెలు చేసి పెరిగినవాళ్ళే కదా! అని అనిపిస్తుంది. నాలాగే వాళ్ళ బాల్యం గడిచివుంటుందని, ఒకటికి పదిసార్లు ఆలోచిస్తానమ్మా. పేదరికం ఎంత గొప్పదో కదా!. అందరి పిల్లల్లా బడికెళ్లాలని ఉంటుంది. పలకా, బలపం చేత పట్టుకొని, నవ్వుతూ, తుళ్ళుతూ, గెంతులేస్తూ, అన్నింటినీ మించి బాగా చదువుకోవాలనుంటుంది. కానీ!ఎలా! సాధ్యపడదే! స్థిరంగా ఒకే వూరిలో ఉంటేగా!. ఒక ఊరినుంచి ఒక వూరికిమారుతుండడమే మా పని...గుడారాలు వేసుకుంటూ. పెద్ద కర్ర చేతపట్టుకొని "హాయ్ విడికి లెస్స, విడికి లెస్స" అనీ మా అయ్య,మా అమ్మ అదే పనిగా అంటుంటే, నేను తాడు మీద నడవాలమ్మగారూ!. భయమేస్తున్నా ఏమాత్రం జడవకుండా,జనాలు ఈలవేసి గోల చేస్తున్నా, నా పని నేను చేసుకుపోవాలి!. అనారోగ్యం పాలైన, జనాలకి ఆనందం పంచి, మా పొట్ట పోషించుకోగలగాలి. ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. కాళ్ళు, చేతులు, వెన్నెముకలు విరిగి ఎన్నో అవస్థలు పడుతుంటాము. తాడు పైన నడుస్తుంటే అర చేతిలో ప్రాణాలు ఉంటాయి. తేడా వస్తే మా ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే. బతుకు పోరాటం అలాంటిది మరి. ఆ! యింకో విషయం అమ్మగారు! మమ్మల్ని దొమ్మరులు అని కూడా పిలుస్తుంటారు. దొమ్మరి పిల్లా, దొమ్మరి పిల్లా అంటే ఎంత బాధేస్తుందో. కొన్ని ఊళ్ళల్లో నన్నెంతో అభిమానించి డబ్బులు ప్రత్యేకంగా యివ్వటం చూసి అమ్మ,అయ్య నన్ను ముద్దు పెట్టుకొని, ఎంత మురిసిపోతారో. చిన్నపాటి గవును తొడుక్కొని, మెళ్ళో పూసలదండతో, ఈ విద్దెలు చేస్తూనే నా బాల్యం గడిచిపోతుంది. నేనొక్కదాన్నే కాదు!. మాకుటుంబ సభ్యులందరు యిదే వృత్తిని నమ్ముకొని, జీవనం కొనసాగిస్తుంటారు. మాఅన్న,మాతమ్ముడు, మాఅక్క, మా చెల్లి అందరూ నాలానే. మళ్ళీ నాలాగే ముందు తరం బాలలు వుండకూడదు!.మా అమ్మకి నేనెలాగో, అలా అన్నమాట అమ్మగారూ!.మా జీవితాల్లో మార్పు రావాలి!మా కన్నుల వెలుగు నింపాలి.మీ అందరు మమ్మల్ని ముందుకు నడిపించాలి! కాలంతో పాటు మేమూ మారాలి! ప్రభుత్వం వారు సంచారజాతులవారిని ప్రోత్సహించాలి! తగు సదుపాయాలేర్పరచాలి! చెప్పండి అమ్మగారు! మీ వంతు కృషి చెయ్యండమ్మగారు!మట్టిలో కూడా మాణిక్యాలుంటాయని తెలియబరచండి!. ఉంటానమ్మగారు.నన్ను మర్చిపోకండేం! ఎప్పటికి గుర్తుండాలని కోరుకుంటూ! సెలవమ్మగారు!.....ఇట్లు, సంచారజాతి అమ్మాయి.....జయప్రభాశర్మ.
Comments
Post a Comment