"VipraVinodhulu"

మా జాతి పేరు ఎంతమంది వినీవుంటారో కాస్త తెలియజేస్తారా?. చెప్పలేరుకదూ!. అవునండి!ఇది మీ తప్పుకాదు!. మేము పూర్వకాలంలో కనబడినట్టుగా, ఇప్పుడు కబడటం  లేదు కదా!. అందువల్ల మీకెలా తెలుస్తుంది!. సరే! మేమే చెబుతాము వినండి!. మమ్మల్ని విప్రవినోదులు అని పిలుస్తారు. మా జాతి కూడా విప్రవినోద జాతి. మమ్మల్ని చూస్తే చాలు పాలు బువ్వే. అంత సంబరమన్నమాట మేమొచ్చామంటే. ఎందుకంటే! అంత వినోదం పంచుతామని.  మా వస్త్రధారణ చూస్తే సాంప్రదాయ దేశీయ వస్త్రధారణే. మేము సంవత్సరానికి ఒకమారు వచ్చిపోతుండేవారము. ఒక్క వర్షాకాలంలో తప్పా, మిగతా కాలాల్లో ఊరూరూ తిరుగుతూ, మా కనికట్టు విద్యతో ఆనందింపచేస్తూ, పొట్ట పోషించుకుంటూవుండేవారము.మేము కేవలం బ్రాహ్మణుల ఇళ్ళకు మాత్రమే వెళుతుండేవారము.మేమొచ్చేసరికి ఇళ్ళలో వుండే కుటుంబసభ్యులందరు ఎంతో సంతోషపడి, అభిమానంతో ఆహ్వానం పలికి అతిథిమర్యాదలు చేస్తూవుండేవారు.మేముకూడా వారికి వినోదం  పంచాలని ఎంతో ఆతృతగా చూసేవారము. ఎంత వేగం ప్రదర్శిస్తామా అని ఒకటే సందడి చేసేవారు. మా ప్రత్యేకత, కనికట్టు,(మాయాజాలం). ఈ కనికట్టులో భాగంగా, ఒక డజను కప్పులు మా వెంట తెచ్చుకొని, వాటిలో చిలకపిట్టని పెట్టి, ఎక్కడుందో చెప్పమని అడిగేవారము, ఎంతో ఉత్సాహం కనబరుస్తూ వచ్చి, మేము ఎక్కడపెట్టామో కనిపెట్టి చెప్పేసరికి, అందులో ఉండకుండా వేరే చోట ఉండడం చూసి పిల్లలు గెంతులేసేవారు.  మార్చి మార్చి ఒకకప్పునుండి వేరొక కప్పుకి చిలకపిట్టని, అంటే పెట్టేది ఒక కప్పులో, కనిపించేది మరొక కప్పులోనన్నమాట.చిలకపిట్టతో చక్కటి మాటల్ని ఆడించేసరికి, అదిచూసిన పెద్దలు కూడా  తమ వయసు మరచి ఆనందంతో చప్పట్లు కొట్టేవారు. అంతే కాకుండా తేళ్లు, జెర్రిలు, చిన్న చిన్న పాము పిల్లలు సృష్టించి కనికట్టుతో మళ్ళీ మాయం చేయుట మా ప్రదర్శనలో ప్రత్యేకం. దాన్ని చూసిన జనాలు భయబ్రాన్తులైన, తరువాత పరవశంతో పొంగిపోయేవారు.ఇవేకాకుండా అనేక రకాలు ప్రదర్శించి ఆకర్షించేవారము.ఈ ప్రదర్శనకి చిన్న, పెద్దా, అని తేడా లేకుండా వచ్చి తిలకించి, మమ్మల్ని తెగ మెచ్చుకొని, కడుపునిండా భోజనాలు పెట్టి, తాంబూలమిచ్చి,  ఆతరువాత తగిన బహుమానాలిచ్చి ఎంతో గౌరవించేవారు. దానికి మేము పరమానందభరితులయ్యేవారము. మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడిగేవారు. ఎప్పుడొస్తామా అని వేయికళ్లతో ఎదురుచూసేవారు. మేము ఎక్కడికెళ్లినా, విప్రవినోదులొచ్చారంటే, విప్రవినోదులొచ్చారని ఎంత ప్రేమాభిమానాలు కనబరచేవారో!. ఆ రోజులు తలచుకుంటుంటే తెలియని ఆనందం, మా సొంతం. విప్రవినోదులకిచ్చే మర్యాద అలా ఉండేది. మరి! అలాంటి మేము, మా తరతరాల సాంప్రదాయం తెర మరుగై మేమెక్కడున్నామో, చాలా మందికి తెలియలేని పరిస్థితి. ఇప్పటివారికి, రాబోయే తరాలవారికి తెలియాలంటే, మమ్మల్ని ప్రసారమాధ్యమాలవారు గుర్తించి తెరముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని,  ఉత్సాహంతో వచ్చి,  ప్రోత్సహించి మా జాతిని పరిచయం అందరికి చేయాలని కోరుకుంటూ.......ఇట్లు, కొందరికి మాత్రమే తెలిసిన విప్రవినోదులు......జయప్రభాశర్మ.


Comments

Popular posts from this blog

Articles