Arati Mokka
కొద్దిపాటి స్థలమున్నా చాలు. నన్ను పెంచుదామని ఎంత తాపత్రయపడతారో!. అవును మరి! నా గొప్పతనం అటువంటిది.నావల్ల ఎన్ని ప్రయోజనాలో. పూజలైనా,పెళ్ళిళ్ళైనా,ఆఖరికి ఏ శుభకార్యమైన నేనుండాల్సిందే. ఏయ్! ఎవరు నువ్వు?.....ఎవరు నువ్వా?. అంతేలెండి నా పేరు నేను చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం. అదేనండి! అరటి మొక్కని. చిన్న పిలకతెచ్చి నాటితే చాలు!ఉబ్బితబ్బిబ్బై తెగ రెచ్చిపోతాను. ఎన్ని ఇవ్వాలో అన్ని యిస్తూ వుంటాను.ఓ! నా ఆకులేంటి,నా కాయలేంటి, నా పళ్ళు ఏంటి, ఆఖరికి నన్ను కూడా తెగ నరికి తినేస్తారు. నన్ను ఎకరాలకొద్దీ పెంచి ఏం వ్యాపారం చేస్తారో.శుభమంటే మనమే. శుభకార్యాలకు సంబంధించి, ముస్తాబులకు మనమే. గెలలు ముదరకుండానే కోసి నన్నువేలాడగడతారు! అదేం సరదావో!. ఈమధ్య హోటళ్లలో కూడా నా ఆకు వేసి పెట్టేసరికి ఎంత మురిసిపోయి ప్రశంసలు కురిపిస్తున్నారో. పెళ్లి విందులో తినే పదార్ధాల కన్నా మనమే హైలెట్. నిచ్చితార్ధమంటే, అన్నిటికంటే మించు మన శోభే అంటే నమ్ముతారా. పెళ్లి అంటే అసలు చెప్పనవసరం లేదు.మిల మిల మెరిసిపోతూ పసుపు వర్ణంతో తళుక్కున మెరిసిపోతాను.నా అందం చూడతరమా!. ఇహ కాయలతో కూరలు రకరకాలు చేసుకుంటూ,పళ్ళు సంబరపడిపోతూ తింటూ,చిప్సు ఐతే ఎంత బాగుంటాయో అని మెచ్చుకుంటూ,దవ్వ, దానితో కూడా ఎన్నో రకాల కూరలు చేసుకుంటూ ఎంత మురిసిపోతారో!. మరి అలాంటి నన్ను చూసి కొంత మంది, అయ్యో!మాకు అచ్చిరాదే! అని అంటుంటే ఏం బాధపడిపోతానో, వారి పెరటి మొక్కనవలేనందుకు. మీకు యింకో సంగతి తెలుసా? నా దవ్వని బాగా గ్రైండ్ చేసి ఆ రసం గాని సేవిస్తే కిడ్నీలో రాళ్లున్నవారికి, రాళ్లు కరిగి ఎంతో ఉపశమనం యిస్తాను !. ఇహ కార్తీక మాసం వస్తే నా గిరాకీ మాటల్లో చెప్పలేం. ఆకు కనిపిస్తే చాలు ఆనందమే ఆనందం.అయ్యప్ప స్వాములు,కార్తీకమాసం భక్తులు ఎంత ఎగబడతారో నాకోసం. ఎంత ధర ఐన గాని వెనుకాడరు. ఐతే ఒక్కటే గుండెకు గుచ్చుకుంటుంది. ఏంటో తెలుసా! తెల్లారి లేచి నా మొహం చూడకూడదట! ఒక్క గెలకే నన్ను నరికేస్తారని, నేను గొడ్దురాలితో సమానమని.ఎంత అమానుషమైన నింద !. అలాగే అరిటాకుతో ఆడదాన్ని పోలుస్తుంటారు.ముల్లొచ్చి అరిటాకు మీద పడిన, అరిటాకొచ్చి ముళ్ళు మీద పడిన నాకే నష్టమని. ఇన్ని సేవలందిస్తున్న నాకిచ్చే కితాబు ఇదా!. నేను దైవాంశసంభూతురాలిని. నేను లేని శుభకార్యమంటూ ఉండదు గాక ఉండదు.నన్ను ప్రతి యింట పెంచండి.మిమ్మల్ని ఏమాత్రం యిబ్బంది పెట్టను. అరటిమొక్కని ఆరాధించండి. ఎప్పటికి మిమ్మల్ని విడిచి వెళ్ళను.ఎల్లప్పుడూ మీ వెంటే వుంటాను.....ఇట్లు,మీ అవసరాల అరటిమొక్క......జయప్రభాశర్మ.
Comments
Post a Comment