MAA THATHAGARI OORU
మా ముత్తాతగారు మునసబు. మా తాతగారు మూడూళ్ళకు మునసబుగా ఉండేవారు. తరతరాలనుంచి మా తాతగార్లది మునసబు గిరి.మా ముత్తాతగారు తవ్వించిన చెరువులు,తోటలు అని యిప్పటికి చెప్పుకుంటుంటారు. అంత మంచి పనులు చేసేవారని పేరు.మా తాతగారికి వ్యవసాయం అంటే వల్లమాలిన ప్రేమ. మా పొలం నాగావళికి ఆనుకొని ఉండేది.తెల్లారి లేస్తూనే పొలానికి వెళ్లి, అక్కడ మొక్కలు పాతడం,గొప్పులు తవ్వడం చేస్తూ వుండేవారు మా తాతగారు. మా ఊరిపక్కనే మా తాతగారి గ్రామం.నేను ఆ వూరికి వెళ్తే,పొలానికి వెళ్లి తాతగారికి బుల్లి ఒంటి కప్పు క్యానుతో( రెండు గ్లాసులు పెద్ద సైజువి) పట్టేవి పాలు తీసుకెళ్లి యిచ్చేదాన్ని.కాఫి, టీలు అస్సలు తాగేవారు కాదు.ఆరడుగుల ఎత్తు ఉండేవారు.ఓ సారి పొలానికి వెళ్ళినప్పుడు పాముని తొక్కేస్తే నా కాలుకి చుట్టేసి కాటు వేస్తె, ఒక్క కేక వేసి భయంతో పాముని లాగి విసిరేసాను. ఆర్మీలో పని చేస్తూ సెలవు మీద వచ్చిన మా చిన్నాన్నగారు చూసి, విషం పాకకుండా వుండాలని అక్కడున్న జనపనార తీసి బిగించి కట్టువేయడం, వైద్యుని దగ్గరకు తీసుకెళ్లడం ఎప్పటికి మరువలేనిది.పొలంలో కూడా తాతగారు రెండు చెరువులు తవ్వించి చుట్టూ గట్లు మీద కొబ్బరి, ఆకు సంపంగి, మల్లె మొక్కలు వేస్తె, అంతులేని మల్లెపూలు ఏరే ఓపిక ఉండేది కాదు. అలాగే పొలం మధ్యలో ఓ గుట్టలాంటి దానిపై రెల్లుగడ్డితో పాక వేసి అందులో చాలా పెద్ద బల్ల ఉయ్యాల ఏర్పాటు చేసుకొని పొలం పని అయిపోయిన తరువాత, కాసేపు అలసట తీర్చుకొని యింటికి వచ్చేవారు. పెరటిలో కూడా ముద్దమందారం,గులాబీ,నారింజ, జామ, సీతాఫలం, విపరీతమైన చింతచెట్లు ఉండేవి.కేబేజి,ఆగాకారకాయలు, టమేటా,ఉల్లి , బెండ, బీర, దొండ విరివిగా పండించేవారు. ధాన్యం, పెసలు, మినుములు కూడా పండేవి.మామిడి తోట ఐతే అన్ని బంగినపల్లె. మునసబుగారంటే వ్యవసాయం చేయడంలో మంచి పేరు.తాతగారికి ముగ్గురు మనుషులు ఎప్పుడు ఉండేవారు అంటిపెట్టుకొని. వారి పేర్లు పర్సి, పెంట, అప్పలస్వామి అని. పాపం తెల్లారి వచ్చి పొద్దుపోతుంటే వెళ్లేవారు. ఒకరు దండోరా వేయడం, యింకో యిద్దరు, ఫైల్స్ పట్టుకోవడం, శిస్తు కట్టకపోతే,ఆస్తులు జప్తు చేయడం చేసేవారు. ఆఖరికి వారిదగ్గర వున్న మేకపిల్లైనా తెచ్చి కట్టాల్సిందే. భలే ఉండేది.అలాగే గేదెలు, ఆవుల్ని పెంచి పాలు పితికి వాడుకొనేవారు. పిడకల తంపిలో పాలు మా నానమ్మ కాచి, ఆ తరవాత ఉట్టిమీద ఉంచిన జ్ఞాపకం, తలచుకుంటే యెంత ఆనందమేస్తుందో. పెరటిలో నీళ్లు కాచే డేక్సాలో వేరుశెనక్కాయలు వేయించడం, ఎర్రదుంపలు కాల్చుకొని తినడం భలే తమాషాగా ఉండేది. తాతగారింటికి రెవిన్యూ అధికారులు వచ్చివెళ్తుండడం,కుల ధ్రువీకరణ పత్రాలు, జనన,మరణ నమోదులకోసం వచ్చిపోయేవారితో యెంత హడావిడిగా ఉండేదో. మా తాతగారు లలితాదేవి ఉపాసకులు.ఎంతో నియమ నిష్టలతో అమ్మవారిని కొలిచేవారు.శుక్రవారం వస్తే రోజంతా మౌన వ్రతంలో ఉండేవారు.అట్ల తదియ వస్తే గాదెలో సీతాఫలాలు పండించి తీయించేవారు.చింత చెట్లకి ఉయ్యాల వేసేవారు. మా అత్త జడగంటలు వేసుకొని యెంత మురిసిపోయేదాన్నో. సంక్రాతి వస్తే ధాన్య రాసులు, వాటికి పూజలు, ఎడ్లబండిలో గరిసతో ధాన్యం వస్తే,ఎడ్లకి మా అత్తలు కాళ్ళు కడిగి గాదెలోని, పోయించడం యెంత బాగుండేదో.అలాగే భోగి పండక్కి పిడకలు తయారుచేసి దండ కూర్చడం. ఎప్పటికి యివన్నీ మరువలేని జ్ఞాపకాలు.మళ్ళీ ఆరోజులొస్తే బాగుండు అన్పిస్తుంది. నా జ్ఞాపకాలు మీతో పంచుకుంటుంటే యెంత సంబరంగా ఉందొ తెలుసా?.అనిర్వచనీయం.....మరి యీరోజుకి సెలవు తీసుకుంటున్నాను.....మళ్ళీ రేపు కలుద్దాం......ఇట్లు,జయప్రభాశర్మ.
Comments
Post a Comment