"Varalakshmi Vratham"
ప్రతి ఇంట కిల కిలలు. నవ్వుల పువ్వులు. పట్టుచీరల గరగరలు. ఆభరణాల మెరుపులు. పేరంటాళ్ళ పిలుపులు. అదే శ్రావణ శుక్రవారపు తళుకులు. సిరులు కురిపించే తల్లి, శ్రీ మహాలక్ష్మి అరుదించిన మాసం,శ్రావణమాసం. కొత్తగా పెళ్ళైన కోడళ్ళు సారెతో అత్తవారింటికి తిరిగొచ్చిన మాసం. వియ్యాల వారి విందులతో, వికసించిన వదనాలతో చేసే హడావిడి అంతా, ఇంతా కాదు. కొత్తకోడళ్ళరాకతో, శుక్రవారపు మహాలక్ష్మివ్రతం చేయించే అత్తల సంబరం చూస్తుంటే యెంత ముచ్చటేస్తుందో. చిన్నా,పెద్దా, పేద, ధనికా భేదాల్లేకుండా అందరు ఎంతో భక్తితో, పూజకు కావాల్సిన సామాగ్రి కోసమై బజార్లో కొనుగోళ్లు చేస్తుంటే, ఆ జన సందోహం ఇసక వేస్తె రాలనంతగాఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎవరి శక్తి కొలది వారు అమ్మవారిని పూజించి, ఆశీస్సులందుకుంటుంటారు. ఆ తల్లిని యెంత పూజిస్తే అంత సిరిసంపదలతో ఉంటామని నమ్మకం. వస్త్రాలు,ఆభరణాలు, పూలు, పళ్ళు, ఒకటేమిటి ఎన్నో రకాలుగా అమ్మవారిని కొలిచేపనిలో నిమగ్నమై వుంటారు. మావిడాకు తోరణాలు, గడపకు పసుపుకుంకుమలు, ముంగిటముగ్గుల్లు. రకరకాల పూలు, రకరకాల పళ్ళు, ఎన్ని తెచ్చినా, ఇంకా ఏదో చెయ్యాలనే భక్తుల తాపత్రయం.వర్జ్యం లేకుండా చూసుకుని ఈ పూజ ఆంధ్రదేశమంతా చేసుకొనుట ఆచారం. ఉదయాన్నే లేచి శుచిగా తలారాస్నానమాచరించి, కలిశా స్థాపన చేసి, అమ్మవారిని అందంగా అలంకరించి, మల్లె, సంపంగి మొదలగు సువాసనల పూలతో స్తోత్రం చేసి, పరిమళ ద్రవ్యాలతో ఆ తల్లిని గుబాళింపజేస్తూ, వస్త్రాభరణాలు సమర్పించి, నవకాయ పిండివంటలు నైవేద్యం పెట్టి, తాంబూలమర్పించి,నియమనిష్టలతో, అమ్మవారిని అర్చించి, హారతిచ్చి, ఆ అమ్మవారి ఆశీస్సులందుకొనుటకై వేయి కన్నులతో ఎదురు చూస్తుంటారు. ఎవరి స్తోమతను బట్టి వారు చేసుకుంటారు. ఆభరణాలు కొనుకొనేవారు కొందరైతే, లక్ష్మి రూపుతోవున్న చిన్న కాసైనా కొని పెట్టాలని అనుకునేవారు మరికొందరు. అలాగే పిండివంటలు, తొమ్మిది పిండివంటలు,ఎడురకాలపిండివంటలు, ఐదురకాలపిండివంటలు,ఆఖరికి మూడు రకాల పిండివంటలైనా అమ్మవారికి పెట్టేవారుఉన్నారు. అతి ముఖ్యమైన ఘట్టం. అమ్మవారికి యిస్తినమ్మ వాయినం అంటే! పుచ్చుకుంటి వాయినం!అనీ! కొమ్ముశెనగలుగాని, గులాబీశెనగలుగాని, బఠాణీలుగానీ తొలిరోజు రాత్రి నీళ్లలో నానబెట్టి, అమ్మవారికి వాయినం యివ్వాలన్నమాట. పూర్వం ఐతే పెసలు కూడా నానబెట్టి అమ్మవారికి వాయినం యిచ్చేవారట. ఆ తల్లికి యిచ్చిన పిమ్మట ముత్తైదువలకి పిలిచి బొట్టుపెట్టి తాంబూలం,సెనగలు వాయినం యిస్తే ఎంతో మంచిది. యిది అనాదిగా వచ్చే ఆచారం. సాయంకాలం ఒకరింటి ఒకరు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళుతుంటారు. యిది మన రాష్ట్రంలో ఎక్కువగా జరుపుకుంటుంటారు. మరి అటువంటి మన శ్రావణ శుక్రవారం మహాలక్ష్మికి స్వాగతం పలుకుతూ, అతి భక్తిశ్రద్ధలతో సేవించి తరించి, ఆశీస్సులందుకుందాం......ఓం శ్రీ మహాలక్ష్మాయనమః....వరలక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు.....జయప్రభాశర్మ.
Comments
Post a Comment