KATHI MASTER
మా ఇంటికి కూతవేటు దూరంలో నాగావళి నది, ఇంటి పక్కనే గాయత్రీ కోవెల. రోడ్డుకి ఆనుకొని మా ఇల్లు. వూరికి కొంచెం దూరంగా ప్రశాంతవాతావరణంలో ఉంటుంది. మా యింటి వీధి మార్గంలో ఇరువైపులా,సుమారు పదిహేను కొబ్బరి చెట్లతో, పెరటిలో నిమ్మ, అరటి, బొప్పాయి, నారింజ, కమల,సంపంగి,మందార,గులాబీ మల్లి,ములగ, గోరింట,కరివేపాకు మొదలగు అనేక రకాల మొక్కలతో, అలాగే దాన్ని ఆనుకొని పొలం, కళ్ళాలు, నీళ్ల బోరింగులు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంట్టాయి. మా నాన్నగారంటే మా చుట్టుపక్క గ్రామాలవారందరికి ఎంతో అభిమానం, గౌరవం. రాజకీయం నుంచి వ్యవసాయం వారివరకు అందరికి మంచి సలహాలవి ఇస్తూ, నిజాయితీగా, నిస్వార్ధంగా వుండే వ్యక్తిత్వం అని.అప్పట్లో ఎందరో ప్రభుత్వ ఉద్యోగాలని పట్నాలకి వెళ్లి స్థిరపడినా, ఉన్న వూరిపై మమకారంతో,ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగి,అక్కడే ఉండి, ఉన్న ఊళ్ళోనే సంతోషమని నమ్ముకొని వున్నవారు. తన తమ్ముడు,చిన్నాన్నలు వెళ్ళిపోతూ, నువ్వు కూడా వచ్చేస్తే బాగుండు అన్నా కూడా ఆ విషయాన్నే విస్మరించి, ఉన్న ఊళ్ళోనే స్థిరపడుట జరిగింది. ఏ విషయమడిగిన చెప్పగల సమర్థులు,లోక జ్ఞానం వున్నవారు. అప్పట్లో హిందీ పరీక్షలు,మునసబు, కరణం పరీక్షలు, టైపు రైటింగ్ పరీక్షలలో ఉత్తీర్ణులు. హిందీ, ఇంగ్లీషులలో ప్రావీణ్యం వున్నవారు. కొంచెం,కొంచెం ఒరియా కూడా అర్ధం చేసుకోగలరు. ఎందుకంటే మాకానుకొని ఒరిస్సా గ్రామాలు ఉన్నందువల్ల. కష్టపడే నైజం తన గుణం. రక రకాల మొక్కలు తెచ్చి వేయడం, వాటిని పెంచడం, వాటిని చూసి మురిసిపోవడం, దాని ఫలం తనకందక పోయిన,ముందు తరాలవాళ్ళకి అందాలని, తన పేరు చెప్పుకోవాలని ఆశ పడుతుంటారు. పశువుల పాక నిండా ఖరీదైన కోస్తా గేదెలు, దూడలు. కోస్తా గేదెలు అంటే మావే. డైరీఫార్మకి కూడా కేన్లతో పాలు సరఫరా చేసేవారు.మా ఇంట్లో పాలు, పెరుగు కొరతనేది ఉండేదికాదు. మా అమ్మగారు ఇత్తడి గిన్నెలో పాలు మరిగించి పాలకోవా తయారు చేసేవారు.పొలంలో అనేక రకాల కూరగాయలతో పాటు,మావిడళ్లం, కంద, చేమ కూడా పండించి, కూరల మార్కెట్టుకి పంపించేవారు. ఇప్పటికీ గేదెలు, దూడలతో మా పశువుల పాక కళ కళ లాడుతుంటుంది. ఉపాధ్యాయ పురస్కారం వచ్చినా, సుతి మెత్తగా తిరస్కరించినవారు. నిరాడంబరులు. చాలా ధైర్యవంతులు.పిరికితనం అంటూ తెలియనివారు.ఎందరికో ఉపకారం చేసినవారు. ధనం కంటే జనబలం గొప్పది అని నమ్మేవారు. గురువు, గిరిజనోద్యమనేత,కామ్రేడ్,శ్రీ ఆదిభట్ల కైలాసం. వారిని యిప్పటికీ స్మరించుకుంటుంటారు. అంతటి గొప్పవాడు తన గురువని. పరదూషణ, పరనిందలు,అప్రస్తుత ప్రసంగాలు ఇష్టపడనివారు. ఎంతటి సమస్యలెదురైనా ఎదుర్కోగల సమర్థులు.బయటికెళ్లి, పనిమీద ఆలస్యమై, చీకటిపడితే,ఎందుకైనా మంచిదని క్షేమం కోసం కత్తి వెంట తీసుకెళ్లేవారని, మా నాన్నగారిని కత్తి మాస్టారు అని పిలిచేవారు. ధన వ్యామోహం, అత్యాశ యెరుగనివారు. తనకున్న దానితో సంతృప్తి చెందినవారు.మా నాన్నగారి దగ్గరకు ఇప్పటికీ సలహాలు, సూచనలకు ఎందరో రావటం చూసి చాలా ఆశ్చర్యపడుతుంటాము.అప్పటికప్పుడు ఆశు కవిత్వం చెప్పి నవ్వుల పువ్వులు పూయిస్తుంటారు.ఎన్నో పద్యాలు,పదాలు పాడి వినోదాన్నందిస్తూ వుంటారు.హంగులు,ఆర్భాటాలు,గొప్పతనాలు అంటే అస్సలు గిట్టనివాళ్ళు.ఎందరో మహానుభావులున్న యి గడ్డమీద మనమేమాత్రం అని అంటూవుంటారు. వారి శిష్యులు ఎందరో వున్నత పదవుల్లో వున్నా, ఈ రోజుకీ నాన్నగారంటే అత్యంత గౌరవం. ఎవర్నీ ఏ విషయంలో వినియోగించుకోకుండా ఉండడం నాన్నగారి అభిమతం. నోరులేని మూగప్రాణులు,అని గేదెలు,ఆవుల్ని పలకరిస్తూ,అవి ఆప్యాయంగా తడువుతుంటే ఎంతో మురిసిపోతుంటారు. మా నాన్నగారిని చూస్తే వాటికి కూడా యెంత ప్రేమో. అందుకేనేమో! రెండు సంవత్సరాల క్రితం, పొలంలో నాగుపాము కాటేసి,ప్రాణాపాయస్థితిలో ఉన్న నాన్నగారు క్షేమంగా యింటికి రాగలిగారు అంటే. ఈ మూగ ప్రాణులు,ప్రక్రుతి ఆశీస్సులేమో. అదే అంటారు నాన్నగారు కూడా. ఏదో అదృశ్యశక్తి నన్ను నడిపిస్తోంది అని.అలాగే మమ్మల్ని కూడా,చాలా క్రమ శిక్షణగా పెంచారు.ఎక్కువ నవ్వకూడదు,చుట్టరికాలు చెయ్యకూడదు,చుట్టాలొస్తే మాటలు వినకూడదు,ఎవరినైనా వేలు పెట్టి చూపించకూడదు,తలుపులు విరచకట్టివుంచకూడదు,సినిమాల ప్రసక్తి వుండకూడదు. ఇలాంటి శిక్షణలో మమ్మల్ని పెంచి,ఎన్నో ఆటుపోట్లను అధిగమించిన మా నాన్నగారిని చూస్తే, ఇలాంటి తండ్రి ఏంటి, అందరు ఎంచక్కా వున్నారో అనిపించిన ఆ క్షణాలు ఇప్పుడు అనిపిస్తోంది అవి మా పాలిట వరాలని. మనసారా మా నాన్నగారినే కాకుండా మా నాన్నగారిలాంటివారందరికి శతకోటి నమస్కారాలు చేస్తూ.....వుంటాను....మళ్ళీ రేపు కలుద్దాం....ఇట్లు, జయప్రభాశర్మ.
Comments
Post a Comment