BELLAM DHIMMA
బెల్లం దిమ్మలా అలా చూస్తూ నిల్చున్నావేం! సమాధానం చెప్పు! నిన్నే!. ఏవండీ! ఇదేమైనా బాగుందా!. నేనంటే ఎంత పడి చస్తారో, అంతే గౌరవించాలికదా!. అబ్బే! తినడం వరకే!. గడ్డ దాటిన తరువాత బెడ్డ చూపించినట్టు!. ఏవిటో ఆ మాటలు. మళ్ళీ సంక్రాంతికి పల్లెటూర్లు వెళ్ళినప్పుడు, నన్ను చూసి, ఓ తెగ మురిసిపోయి, బెల్లం దిమ్మలంటే బెల్లందిమ్మలని ఏం ఎగపడతారో. ఊరికినే దొరికినట్టు. అంత మోజు వున్నవాళ్లు మూసుకొని ఉండాలిగా. ఉహు. ఉండ బుద్దికాదు. సరే! నేనేంటో చెబుతాను వినండి. బెల్లం అంటే అనకాపల్లి వెళ్లాల్సిందే, బెల్లం బజారు చూడాల్సిందే. అదేనండి విశాఖజిల్లా, విశాఖని ఆనుకొని ఉన్న వూరు. తింటే వదుల్తారా.అయినా నా రుచి ఆ పంచదారకెక్కడుంది.అరిసెలంటే మనమే,పాకుండలంటే మనమే,పాకం చలిమిడికి మనమే, ఆఖరికి జున్ను కూడా ఎంత బావుంటుందో. పంచదారతో చేసిన తీపి పదార్ధాలు తింటే,సుగరున్నవాళ్ళకి ,లాభం లేదంటారు. అదే నేనైతే కొంత పర్వాలేదంటారు. గుడ్డిలో మెల్ల మేలు అన్న మాదిరిగా. పచ్చి బాలింతరాలికైతే అన్ని మూలికలతో చేసిన కాయానికి నేను కచ్చితంగా ఉండాల్సిందే. పాలిచ్చే పశువులు దూడలకి జన్మనిచ్చినప్పుడు నన్ను పెడతారు తెలుసా!. మనింట్లో ఏ శుభకార్యమైన,ముందు వినాయక పూజ చెయ్యాల్సిందే.ఆ తర్వాతే ఏ పూజైన.అప్పుడు కూడా వినాయకుడికి బెల్లం నైవేద్యం పెట్టాల్సిందే. యిహ బెల్లం తయారీ చేసేదగ్గరకొస్తే, ఉడుకుతున్న బెల్లం ఉంటుంది!నా సామిరంగా! ఆ రుచి మరిగితే వదుల్తారా!. అంత గొప్పగా ఉంటుంది. ఆ ఖరీదు వింటే దిమ్మ తిరగడం ఖాయం. నన్ను తిడతారేమో అని భయపడుతున్నాను. అయినా చెబుతున్న, రెచ్చిపోయి, రాత్రనక,పగలనక, ఇల్లు నరకం చేసి తగలడతారే, దరిద్రగొట్టు సారాకి కూడా నన్ను మోసుకెళ్లి పడేస్తుంటే,
వస్తుంది మంటా, ఇలా అలా కాదు. లాగి ఒక్కటిద్దామా అనిపిస్తుంది.పవిత్రమైన నన్ను అపవిత్రం చేస్తారా? చ్చి! మీ సారా పాడుగాను!. ఏవిటండి! పెళ్లిళ్లలో సారె పెట్టి పంపించినప్పుడు అప్పుడు కూడా వాటి పక్కనే నేను.అలాంటి నన్ను పట్టుకొని బెల్లం కొట్టిన రాయిలా,దిమ్మలా అని ఆడిపోసుకుంటారా! ఇటుపైన అలా అనకుండా చక్కగా అన్ని చేసుకు తిని, నన్ను ప్రేమిచడం నేర్చుకోండి,ఎంచక్కా కొబ్బరి ఉండలు చేసుకు తినండి. బెల్లం కుండలు కూడా మీకై ఎదురుచూస్తుంటాయి....వుంటాను.....ఇట్లు,బ్రహ్మాండం బెల్లం దిమ్మ......జయప్రభాశర్మ.
Comments
Post a Comment