COLLEGE DAYS

హిందీ బడా బడా, నా గుండె దడా దడా అని చిన్నప్పుడు చాలా భయముండేది. కానీ రాను రాను దానిపై ఒకరకమైన ఇంటరెస్ట్ పెరిగి,హిందీ పరీక్షలు రాయాలనే తపనతో రాసి పరీక్షలు పాసవడం జరిగింది.అలాగే లెక్కలంటే పై ప్రాణాలు పైనే పోయేవి.ఎలా ఒడ్డెక్కుతానురా బాబు అని ఒకటే చింత.ఎలాగోలా ఒడ్డెక్కి,ఇంటర్లో  జాయిన్ అవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం అయింది.అక్కడ బై.పీ,సి, ఊహు లాభం లేదు,ఏం.పీ.సి,అమ్మో లెక్కలు, హెచ్.ఈ.సి, ఆ హిస్టరీలు అవి అబ్బే, ఇహ కామర్సు ఒక్కటే మనకు దిక్కు,  చూస్తే,ఓకే అనుకోని జాయిన్ ఐపోయాను.ఇంక చూస్కోండి, నా బాధ వర్ణనాతీతం.ఏంట్రా నాయనా, మళ్ళీ ఇక్కడ కూడా డెబిట్లు, క్రెడిట్లు, లెక్కల్లాగే ఉన్నాయని బెంబేలెత్తిపోయా. దానికి ఎనిమిది గంటలకు ట్యూషను.రోజు తెల్లవారకుండానే రెడీ అయిపోయి, మా ఊరినుంచి  మొదటి బస్సులో బయలుదేరి ప్రయాణం చేసి,ఉదయం ఎనిమిది గంటలకి  ప్రైవేట్ క్లాసులు, ఆ తరువాత టైపురైటింగ్ క్లాసులు,కాలేజీ క్లాసులు. ఆదివారం నాడు ఎన్.సి.సి క్లాసులు. అదిమాత్రం మనకిష్టమైనది.హుషారే హుషార్.భలేవుండేది.ఎంచక్కా క్లాసుకి వెళ్లేముందు ఏవైతే పెట్టారో, అవి లాగించేసి సంబరమే సంబరం. మా కాలేజీ కూడా చాల పెద్దది. ఎక్కువ సెక్షన్లతో అన్ని బ్రాన్చీలు కిల కిల లాడుతుండేవి.కో ఎడ్యుకేషన్ కావడం వల్ల చెప్పలేని హడావిడి.మామూలుగా కాదు. ఏరోజు సవ్యంగా క్లాసులు జరగనిచ్చేవారుకాదు.కాలేజీకి వెళ్లాలంటే గుండె గుబులు.దిన దిన గండం దీర్గాయుష్షు. క్లాసు రూంలో అడుగుపెడుతూ, ముందు గోడలు,బెంచీలు చూసుకొనేవారము.ఏమో ఏవుంటుందో అని బితుకు, బితుకులాడుతూ. లెక్చరర్లకు నిక్ నేములు పెడుతుండడం,ఆడపిల్లల్ని ఏడిపించడంలో నెంబర్ వన్ గ  ఉండేది మా కాలేజి. అమ్మో! ఆ కాలేజియా! మేము జాయిన్  అవము బాబు! అనే వారు. క్లాసులు అయిపోయి రోడ్డు ఎక్కేసరికి,అదొకరకమైన భయం.కాలేజీకి,బస్సు స్టాండుకి  చాలా దూరం నడవల్సివచ్చేది. ఈ మధ్యలో చుక్కలు చూపించేవారు, ఎలాగోలా మెల్లిగా దాటుకొని బస్సు ఎక్కేసరికి తాతలు దిగొచ్చేవారు. కానీ ఏనాడు  ఎవరిని పైశాచికంగా హింసించి ఆనంద పడటం అది చేసేవారుకాదు.ఏవో చిన్న, చిన్నగా ఏడిపించటం తప్ప. ఇరుకు రోడ్లు,దుకాణాలు,రిక్షావాలా హడావిడి,బస్సుల హారన్లు, రోడ్లపై వ్యాపారాలు భలేగా ఉండేది మా పార్వతీపురం.ఇప్పటికీ ఇంచుమించు అదే తీరులో ఉండటం చూసి ముచ్చటేస్తుంది.గతమంతా గుర్తుకొస్తుంది. మాతో చదువుకున్న వాళ్ళు కనిపిస్తారేమో అని ఆశగా కళ్ళు వెతుకుతుంటాయి. మా కాలేజీ కాఫౌండ్ కనిపించినా ఎంతో తృప్తిగా తనివార చూస్తూవుంటాను. మా టైపుమాస్టారు ఒకసారి కనిపించి,నన్ను పలకరిస్తే ఎంతో సంబరమనిపించింది.నన్ను జయప్రద! అని పిలిచేవారు.మాస్టారే కాదు అందరు అలాగే పిలిచేవారు. ఇప్పటికీ చాల మంది అలాగే పిలుస్తుంటారు.మా నాన్నగారిమీద ఎంత కోపమొచ్చేదో. ఆ పేరు పెట్టినందుకు.తిప్పలు పడుతుంటాను అప్పుడప్పుడు.చెక్కులు అవి తీసుకున్నప్పుడు.ద కాదండి బాబు,భా అంటూ,బీ ఫర్ బ్యాట్ అని. ఒక్కోసారి చూసుకోకుండా ఇంటికి వచ్చేస్తే, మళ్ళీ వెళ్లి చెక్కు తెచ్చుకోవడం చాల విసుగనిపించేది. ఇవి నా పేరు కొచ్చిన పాట్లు.ఇలాంటి జ్ఞాపకాలు మరెన్నో మదిలో....మళ్ళీ రేపు కలుద్దామండి......వుంటాను.....ఇట్లు,జయప్రభాశర్మ.


Comments

Popular posts from this blog

Articles