"Gurthukostunayi"


ప్రాధమిక విద్య అసలు లీలగా కూడా గుర్తు లేదు.మా నాన్నగారు నన్ను ఎత్తుకొని తీసుకెళ్లి ప్రవేశ పరీక్ష ఎలాగోలా రాసింది అనిపించేసి,స్వర్ణదుర్గ పేరుని జయప్రభగా మార్చిఆరవ తరగతిలోజాయిన్ చేశారు. హైస్కూలుకి వెళ్లాలంటే ఒక ఊరినుంచి యింకోవూరికి వెళ్లాల్సి వచ్చేది. రోడ్లుగాని,వాహనాల సౌకర్యం గాని ఉండేదికాదు.ప్రధానోపాధ్యాయుడుగా మా నాన్నగారు పనిచేసేవారు.వారి శిష్యులు నన్ను పాపా అంటూ పిలుస్తూ, ఎంతో అభిమానంగా, పొలంగట్ల మీద నడవలేక ఎక్కడ పడిపోతానో అని చూసుకుంట్టు, కాల్వలోస్తే రెక్కలు పట్టుకొని దాటిస్తూ, వర్షాకాలంలో ఐతే మరీ జాగ్రత్తగా చూసేవారు. ఆ బురద గట్ల మీద పడిపోకుండా!. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మా నాన్నగారికి అప్పజెప్పి ఇంటికి వెళ్లేవారు. మా అమ్మగారిచ్చిన  కేరేజీని తీసుకెళ్లకుండా పొలం పనులు చేస్తున్నవారికిచ్చేసి ఎంచక్కా వెళ్లిపోయేదాన్ని.వాళ్ళు పాప కేరేజి తీసుకెళ్లలేదమ్మా! యిదిగో! అని ఇచ్చేసరికి నివ్వెరపోయేదట. స్కూలు కెళ్తే చదువుకంటే ఆటపైనే ఎక్కువ దృష్టి పెట్టేదాన్ని. పాఠాలు విని అర్ధం చేసుకొని నాకు తోచిన రీతిలో సొంతంగా రాసుకొని ఎలాగోలా ఉత్తీర్ణత సాధించేదాన్ని.మా నాన్నగారైతే రోజు తిట్ల దండకాలే. పుస్తకం తీయడం లేదని. అందుకే మా నాన్నగారంటే చచ్చేంత హడల్.పాటలైతే చెవి కోసుకునేదాన్ని. మా అమ్మమ్మ మా ఇంటికొస్తే పండగే పండగ.పాటలు నేర్పుతుందని ఆశ. ఎందుకంటే కొన్ని వందల కీర్తనలు పాడేది శాస్త్రీయంగా.. అంతేకాకుండా పెళ్ళిపాటలు,గజేంద్ర మోక్షం,గంగ గౌరీ సంవాదం, సీతాదేవి వేవిళ్లు ఇలాంటివి మరెన్నో పాడి,నాకు దగ్గిరుండి నేర్పించేది.యిది ఆదితాళం, యిది రూపక తాళం,యిది మాధ్యమావతి రాగం, యిది నాట రాగం అని చెప్పి. యిప్పటికి అమ్మమ్మదగ్గర నేర్చుకున్న గంగ గౌరీ సంవాదం గుర్తు పెట్టుకొని పాడుతుంటాను. సుమారు గంటన్నర పడుతుంది పాడాలంటే. ఎక్కువ తెల్లవారుజాము లేపి పాడించేది.ఎప్పుడు స్కూల్ పాటల పోటీలైన వెళ్లి పాడి రావాల్సిందే. బహుమతి తెచ్చుకోవాల్సిందే.ఆటలైతే మరీను,ప్రాణం.రింగు టెన్నిస్,కబాడీ, షటిల్, కోకో,లెజిమ్స్, వాలీబాల్. డ్రిల్లు క్లాస్  యెంత వేగం వస్తుందా అని ఎదురు చూసేదాన్ని.అంత పిచ్చి. సిగ్గు,బిడియం తెలిసేదికాదు.ఒక్కోసారి నాకప్పజెప్పి డ్రిల్లు మాస్టారు చూసుకోమని కాసేపువెళ్లి వొచ్చేసరికి,యెంత గొప్పైపోయేదాన్నో. లెజిమ్స్ చ ప్పుళ్ళు వింటుంటే యెంత సంబర పడేదాన్నో.పోటీలో పాల్గొన్న ప్రతీ ఆటలో ప్రధమం వొచ్చేదాన్ని.జిల్లా స్థాయిలో ఒకసారి వాలీబాల్ ఆడి ప్రధమ బహుమతి గెలిచి విజేతగా నిలిచిన జ్ఞాపకం మరువలేనిది. స్కావుట్ అంటే పరుగో పరుగు. జ్వరమైన హాజరవ్వాల్సిందే.  అలాగే మన రేడియో పాటలే కాకుండా, సిలోన్, మలేషియా స్టేషన్లనుంచి వచ్చే సాంగ్స్ కూడా ఎంతో శ్రద్దగా  వినేదాన్ని.అనౌన్సర్ రచన, గానం,సంగీతం అనేసరికి చిత్రం చెప్పేసి,ఆమ్మో ఏం చెబుతారో అని టెన్షన్గా వినేసరికి, నేనన్నది చెప్పేసరికి ఆనందమే ఆనందం. ఇవికాకుండా బినాకా గీత్ మాల,వివిధభారతి....యిదే పని. ఐతే స్కూలు లేకపోతె పాటలు నా ప్రపంచం.ఒకసారి" మంచిగ ఉంటే నీకు మంచామేస్తా " అనీ ఎల్.ఆర్.యీశ్వరిగారి పాట రేడియోలో వస్తుంటే రాసుకున్నాను. అది ఇంకేదో అనుకోని మా నాన్నగారు తాట తీశారు.తర్వాత తెలిసి బాధపడ్డ జ్ఞాపకం తలపుకొస్తే నవ్వొస్తుంది.అలాంటి జ్ఞాపకాలు మరెన్నో....మీతో పంచుకోవాలనిపించింది.అందుకే సరదాగా నెమరువేసుకున్న....మరెన్నో జ్ఞాపకాలతో రేపు కలుస్తా......వుంటాను.....జయప్రభాశర్మ.


  

Comments

Popular posts from this blog

Articles