Mondikotolu
అమ్మో!అమ్మో!వాళ్ళు వచ్చారంటే మాకు గుండెల్లో దడపుట్టుకొనేది!.వెళ్లిపోమ్మంటే వేళ్తేనా!. తాతలు దిగొచ్చేవారు! వాళ్ళని పంపించేసరికి.ఎవరని అడగరేం!. ఇంకెవరండీ బాబూ! మొండికొట్టువాళ్ళలావున్నారని అంటుంటారే ! వాళ్ళేనండీ !." మొండికొట్టువాళ్ళని" సంచారజాతికి చెందిన వారు. తెల్లారేసరికి మా వూరు వచ్చేసి, మాదుకాణం తియ్యడమే ఆలస్యం, ప్రత్యక్షమై నానా రగడ చేసేవారంటే నమ్మండి. ఒంటిమీద చిన్నపాటి గుడ్డకట్టుకొని, చేతికి ఇనపకడియం వేసుకొని, అదే చేత్తో కత్తి చేత పట్టుకొని నిలుచుంటే మాకైతే చెమటలు పట్టేవి చూసేసరికి. అమ్మా!షాహుకారమ్మా! సంవత్సరానికి ఒకమారొస్తాము! మాకు డబ్బులిచ్చేస్తే, ఎల్లిపోతాము! అనీ! ఒకటే గోల. బోణీ ఏనా అవకుండా ఎలాగ ఇస్తాము, తరువాత రమ్మన్నా వదిలేదిలేదు. వ్యాపారం బాగా సాగిన, సాగకపోయిన వాళ్ళకనవసరం. ఎలాగైనా డబ్బులు మానుంచి తీసుకెళ్లాల్సిందే. ఇవ్వకపోయామా! కంపు చేసిపారేసేవారు. కత్తి పట్టుకొని తన చేతి కడియానికి తగిలిస్తూ,టింగు టింగు శబ్దం చేస్తూ విసిగించడం, కక్కడం, ఉమ్మడం, ఇంకా ఇవ్వకపోతే కత్తితో గాట్లు పెట్టుకొని, ఆ రక్తంతో అక్కడున్న రాళ్లకు,గోడలకు బొట్లు పెట్టి, రోత పుట్టేట్టు చెయ్యటం వారి నైజం. కొన్ని సందర్భాల్లో పొడుచుకు చచ్చిపోతామని కూడా బెదిరించేవారు. అసలే మేము భయస్తులం. కలబడితే నిలబడతాం, నిలబడితే కలబడతాం.ఇలా చూసేసరికి మా పై ప్రాణాలు పైనే. ఇంకెవ్వరి దగ్గరికి వచ్చేవారుకాదు. ఒక్క మా వైస్యుల దగ్గరకి మాత్రమే వచ్చి యాచించేవారు. మేము కూడా సంవత్సరానికి ఒకసారి కదా! అని త్రుణమో ఫణమో ఇచ్చి సాగనంపేవారము. అల్ప సంతోషులు.ఎంత అని చూడకుండా,ఇంత కావాలని అడగకుండా, మేమిచ్చే పైసలు తీసుకొని కళ్ళకద్దుకొని వెళ్ళిపోయేవారు. మాకే ఎంతో జాలి కలిగేది వాళ్ళు వెళ్లిపోతుంటే. అయ్యో! విసుక్కున్నామే అని.వాళ్ళు వచ్చి అరుస్తూ, హంగామా చేస్తుంటే చూట్టానికి వీధిలో వున్నవారంతా మూగి విచిత్రంగా చూసి,నవ్వుకొనేవారు. అయినా వాళ్ళ ధోరణే వాళ్ళది. ఇప్పుడవన్నీ తలచుకుంటుంటే, కొంచెం బాధ కలుగుతుంది. ఎందుకంటే! ఇప్పుడలాంటివారెవరైనా కనిపిస్తున్నారా! పైసలు పుచ్చుకొనేవారున్నారా! పాపం మూర్ఖత్వంతో కూడిన అమాయకత్వం! ఎక్కడైనా కనిపిస్తే బావుండు అని ఎదురుచూస్తుంటాను.మరి వాళ్లేమైనట్టు!. మరుగున వున్న, ఈ సంచారజాతి" మొండిగొట్టొళ్లు" మళ్ళీ కనిపించి, అమ్మా! షాహుకారమ్మా! అని పిలవాలని, వాళ్లేనా వీళ్ళు అన్న తీరున మారాలని, మార్పురాని పక్షంలో మార్పుతీసుకొచ్చే ప్రయత్నం చెయ్యాలని కోరుకుంటూ! వుంటాను. ఇట్లు,ఆశతో ఎదురుచూసే షాహుకారమ్మ......జయప్రభాశర్మ.
Comments
Post a Comment