Jai Ganesha


గణాలకు అధిపతి,అల్పసంతోషి, అడగగానే వరాలిచ్చేవాడు,ఆదిదేవుడు,ఏ శుభకార్యం చేసిన ముందు స్వామివారిని,విఘ్నేశ్వరుడా,వినాయకా, చల్లనివాఁడా, గణాధిపా అని స్మరియించి కొలిచే భక్తుల ఆరాధ్య దైవం,గౌరీపుత్రుని లోకమంతా పూజించే రోజు. అదే వినాయచవితి రోజు. పేదా, ధనికా, ప్రాంతీయం అని లేకుండా అత్యంత వైభవంగా పూజలు చేసి, ఆ లంబోదరుని  సేవలో తరించి మురిసిపోయే రోజు రానే వచ్చిందని చెప్పలేని ఆనందం.మాటలు చాలని మహోత్సవం.కన్నుల వైభవం.పార్వతీదేవి అతి ప్రియంగా, స్వయంగా  తయారుచేసుకుని, ప్రాణ ప్రతిష్ట చేసుకున్నగారాల బిడ్డ పండగ. మహేశ్వరుని ఆగ్రహానికి గురి ఐన తదుపరి, తన ప్రియసఖి పార్వతీదేవి శోకాన్ని చూసి తట్టుకోలేక, జరిగిన వృత్తాన్తమ్ తెలుసుకొని, మరల మహేశ్వరుని ప్రేమను పొంది,ప్రాణప్రతిష్టుడైన గజముఖవదనుని ఘనమైన కడు రమ్యమైన సుదినం. వజ్రవైదూర్య, మరకత మాణిక్యాలనేవి ఆశించనివాడు. అతి తెలివైన వాడు.అందుకే సోదరుడు సుబ్రహ్మణ్య స్వామితో,ప్రపంచం మొత్తం చుట్టి ఎవరు ముందొస్తారో చూద్దాం రమ్మని పందెం కట్టి గెలిచినవాడు. పాపం అమాయకంగా సుబ్రహ్మణ్యుడు ప్రపంచం అంతా చుట్టి వచ్చేసరికి, అక్కడే కొలువుతీరున్న స్వామిని చూసి, సుబ్రహ్మణ్యుడు  హతాశుడై అడిగేసరికి, ఫక్కున నవ్వి,ఓరి వెర్రివాడా! తల్లితండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ప్రపంచ ప్రదక్షిణ చేసినట్టే అన్నారట.  గరిక బిల్వపత్రాల ప్రీతిపాత్రుడు. బ్రహ్మచారివారికి కడుపునిండా, తనకిష్టమైన కుడుములు,ఉండ్రాళ్ళు పెడితే చాలు, ఉబ్బితబ్బిబ్బైపోతాడు. అలా తిని వెళుతుంటేనే చంద్రుడు నవ్వాడని ఆగ్రహం వచ్చి,శపించిన కారణంగా ఈరోజుకి,ఆ ఒక్కరోజు ఆకాశంవైపు చూడాలంటేనే భక్తులకు భయం. ఎక్కడ నీలాపునిందలొస్తాయో అని.ఆరోజున చంద్రుని చూస్తే నీలాపనిందలు వస్తాయని, నా పూజ నియమ నిష్టలతో చేసుకొని,కధ చదువుకొని, అక్షతలు వేసుకుంటే నా ఆశీస్సులు మెండుగా వుంటాయని స్వామివారు సెలవిచ్చినందువల్ల పవిత్రమైన ఈ పండుగ ఆనాటినుంచి జరుపుకోవడం భక్తుల ఆచారం. భక్తులు వారి వారి వీలును బట్టి మూడు రోజులు,ఐదురోజులు, తొమ్మిదిరోజులు స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తూవుంటారు. పురోహితుల వేదమంత్రాలతో,వాద్యనాదాలతో,సంగీతాలతో,నృత్యాలతో,వివిధసాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవాలు నిర్వహించిన అనంతరం, చివరిరోజు స్వామిని  అత్యుత్సాహంగా ఊరేగించి నిమజ్జనం చేయటం భక్తులు వరంగా భావిస్తారు. ఈ వైభవం చూడాలంటే కాణిపాకం వెళ్లాల్సిందే. మరి ఇటువంటి మహిమ కలిగిన వినాయకచవితిని అందరు జరుపుకోవాలని ఆ విఘ్నరాజు ఆశీస్సులు మెండుగా అందుకోవాలని కోరుకుంటూ.....జై గణేశా.....జై జై గణేశా.....నమో నమః....జయప్రభాశర్మ.

Comments

Popular posts from this blog

Articles