Nanamma Vantillu


మా నానమ్మ వంటిల్లు ఇప్పుడు తలపుకొస్తే ఎంత ముచ్చటేస్తుందో. భలేగా ఉండేది.గేసుపొయ్యి అంటే చచ్చేంత భయం. వాడేది కాదు.ఎంచక్కా బంకమట్టితో స్వయంగా ఒక మంచి రోజు చూసుకొని,పొయ్యి  వేసుకొని, కొట్టించి షెడ్డులో ఉంచిన కర్రలతో మంట పెట్టి, యిత్తడి గిన్నెల్లో మాత్రమే వంట చేసి,వంట పూర్తవగానే మళ్ళీ ఆవు పేడతో అలికి ముగ్గుపెట్టి ఉంచుకొనేది మర్నాటికి.వంట పూర్తికాగానే మా తాతగారికి ప్రత్యేకమైన పెద్ద పీట వేసి,దగ్గరుండి వడ్డించేది.తాతగారి భోజనమవగానే అదే కంచంలో మా నాన్నమ్మ భోజనం చేసేది.నాన్నమ్మ సంవత్సరానికి సరిపడా, ఆవకాయ, మాగాయ తయారు చేసి పెద్ద పెద్ద గూనల్లో పెట్టి, వాటికింద మట్టు పెట్టి, అటక మీద ఉంచేది.వడ్డనకు కావలసింది చిన్న రాచిప్పలో తీస్తూ ఉండేది. పండించిన పొట్టుమినపప్పు నానేసి, పెద్ద రుబ్బురోల్లో రుబ్బి,నానబెట్టిన బియ్యం పిండి దంచి,అట్లు ఇనప పెనంపై వేస్తె, తింటుంటే తినాలనిపించేలా ఉండేవి. బియ్యంనూకైతే తిరగలిలో మాత్రమే విసిరేది. అడ్డకచ్చా, కాళ్లకు అల్లిక కడియాలు,కుత్తిగంటు, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతోఉండేది.చచ్చేంత మడి. మునసబమ్మ అని పిలిచేవారు అందరు.నేను తాతగారింటికి వెళ్తే తెల్లారేసరికి,తాతగారి పూజకు మా నానమ్మతో వెళ్లి,నూరు వరహాలు,పసుపుగన్నేరు,గరుడనందివర్ధనం,ముద్దమందారం కోసి యిచ్చేదాన్ని. రాత్రి వేళ ఆరుబయట మంచాలు వేసి పడుక్కోమనేవారు. పున్నాగ చెట్ల నుంచి వచ్చిన సువాసనలు, పండు వెన్నెల మధ్య. ఎంత బాగుండేదో.ఆ స్వచ్ఛమైన గాలి. అలాగే బోను పెట్టెలో నగలు,తాతగారు శిస్తు వసూలు చేసిన  డబ్బులు తాళమేసి జాగ్రత్తగా భద్రపరచేవారు.నగలు చేయించుకోవాలంటే పక్క గ్రామం నుంచి ఆచారిగారిని పిలిచి చెప్పి చేయుంచుకొనేవారు. దర్జీ కూడా బట్టలు కుట్టించుకోవాలంటే ఇంటికి వచ్చే తీసుకెళ్లేవారు.తాతగారు మునసబు కావడం వలన, కాశీ కావిడి వారు, జంగాలు,శారద పాటగాళ్లు, కొమ్మ దాసరిలు ఇలా అనేక రకాలవాళ్ళు వస్తూ,ఎంతహడావిడి చేసేవారో.ఎవర్ని కాదనకుండా,తూలనాడకుండా, ఏదో ఒకటి ఇచ్చి పంపేవాళ్లు. ఏదిచ్చిన సంతోషపడుతూ తీసుకొనేవాళ్ళు వారంతా. దసరా వెళ్లిన తరువాత వచ్చే గౌరీపౌర్ణమిని, నందెన్న పండుగ అని ఎంత బాగా చేసేవారో,ఆ వూర్లో,రాత్రి పగలు అని లేకుండా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంత సందడిగా ఉండేదో.శివరాత్రి నాడైతే  పక్క గ్రామంలో పురాతన శివాలయంలో శివరాత్రి ఎంత వైభవంగా నిర్వహించేవారో.మా తాతగారిలాగే ఆ ఊరి మునసబుగారి  ఆధ్వర్యంలోశివరాత్రి సంబరాలు జరిగేవి.సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా,డి,వై.సంపత్కుమారుగారి జాలరి నృత్యం,కుమ్మరి మాస్టారి బృందం బుర్ర కథ, పౌరాణిక నాటకాలు ఏర్పాటు చేసేవారు. మా నాన్నగారి అనుమతితో,పెద్దవాళ్ళ వెంట వెళ్లి అవన్నీ చూసి,ఖర్జూరం,బఠాణీలు కొనుక్కొని స్వామిని దర్శించుకొని తెల్లవారు ఝామయ్యేది యింటికి చేరుకునేసరికి. ఆ మునసబుగారు ఇప్పుడున్న పోలీసుఉన్నతాధికారి, శ్రీ భార్గవనాయుడుగారి తండ్రిగారు.నా చిన్నతనంలో ఎక్కువ వాళ్ళ ఇంటికి మాత్రమే నాన్నగారు పంపించేవారు. వారు కుటుంబ స్నేహితులవటం వలన. పంట పొలాల మధ్య నడుస్తూ,పిల్ల కాల్వలు దాటుకుంటు భలేగా ఉండేది, ఒక ఊరినుంచి యింకో వూరు వెళ్లాలంటే.ఒక్కోసారి మా తాతగారి వూర్లో మా చిన్నాన్నగారు కూడా నాటకాలు వేస్తుండేవారు అందులో ముఖ్యన్గా "మంచం మీద మనిషి".నన్ను కూడా సుప్రభాతం అలాంటివి ఉంటే టేపురికార్డర్ తీసుకొచ్చి నా చేత పాడించి రికార్డు చేసుకు వెళ్లేవారు.మా యింట్లో రోజు సరదాగా కేరమ్స్ ఆడుకోవటం అలవాటుగా ఉండేది. మా నాన్నగారు ఎక్కడ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ అయినా వెళ్లి ఆడి రావాల్సిందే. ఈత కూడా బాగా చేసేవారు. మాకు అతి దగ్గర బంధువు,మా నాన్నగారి ప్రియాతి ప్రియమైన బావ,నేమాని నారాయణరావు మావయ్య.ఇప్పుడుండే ఢిల్లీ తెలుగు అకాడమీ కార్యదర్శి శ్రీ.నేమాని వెంకట లక్ష్మి నాగ రాజు గారి అన్నగారన్న మాట.మానాన్నగారు,మావయ్య కలిస్తే సందడే సందడి.షోలే సినిమాలో,అమితాబచ్చన్,ధర్మేంద్రన్నమాట.కనుమ రోజు నాగావళి నదిలో నడుములోతువరకు నీళ్లు వున్నా మెల్లిగా దాటి, అవతలి ఒడ్డుకి చేరి, అమ్మవారిని కొలవటం చెప్పలేని అనుభూతి.నాగావళి వర్షాకాలంలోఉప్పొంగి ప్రవహిస్తుంట్టే,ఏరొచ్చిందంటే,ఏరొచ్చిందని,పరుగుపెట్టి చూసి,ఆనందంతో పొంగిపోయి గెంతులేసేవారం.పెద్దవాళ్ళైతే పసుపు కుంకుమ యిచ్చి,శాంతించమని పూజలు చేసేవారు.కార్తీక సోమవారమైతే ఉపవాసముండి,సాయంకాలం కాల్వకెళ్లి స్నానం చేసి రావడం, ఇప్పటికీ మరువలేని జ్ఞాపకం.ఇవ్వన్నీ మీతో పంచుకుంటుంటే, ఎంతో సంతోషంగా వుంది....మరి ఉంటానేం.....ఇట్లు,జయప్రభాశర్మ.



Comments

Popular posts from this blog

Articles