Maidanam
నన్ను చూస్తే ఎక్కడ్లేని ఉత్సాహం!ఎంత వేగం నా దగ్గర కొచ్చేద్దామా అని ఆనందంతో గెంతులు!సాయంకాలం ఎప్పుడవుతుందా అని ఎదురుచూపులు!ఆదివారమైతే చాలుఒకటే పరుగులు!. అరె! ఎవరండీ! ఈ గోల గోవిందం! అనుకుంటున్నారు కదూ! నిజమే నా బాధ మీకేం తెలుసు!గోల లాగే ఉంటుంది మరి!.బోరు కొడుతూ నేను బోడిగుండులా మిగిలిపోయిన మైదానాన్నండి!. ఒకప్పుడు మీరు నాకోసమొస్తే,నేనిప్పుడు రివర్సులో మీకోసం తెగ చూస్తూ, ఆరాటపడుతున్న పిచ్చిదాన్ని.కొంతకాలానికి నేనన్నదాన్ని కరువైపోతానేమో అనిపిస్తోంది.యిప్పటికే పూర్వ వైభవం తగ్గి కళావిహీనంగా తయారయ్యాను. లేకపోతె ఏంటండీ! వీడియోగేమ్స్, మొబైల్ గేమ్స్, ప్లే స్టేషన్లు ......ఓయబ్బో...ఎన్ని విడ్డూరాలు! హాయిగా యింట్లో కూచొని,హ్యాపీగా ఆడుకోక....నేనవసరమా అన్నట్టుంది యవ్వారం. నిజమే కావచ్చు!కానీ!గతాన్ని ఎప్పుడు మరచిపోకూడదు కదా!. స్కూల్లో సాయంత్రమయ్యేసరికి....ఏం సందడి చేసేవారో!చీకటి పడిపోతున్నా పట్టించుకొనేవారుకాదు. ఒకటా, రెండా ఆటలు.పరుగు పందేలు,కో కో, కబాడీ, వాలీబాల్,త్రోబాల్,ఫుట్బాల్, క్రికెట్టు,షటిలు, బాల్బాడ్మింటన్, రింగు టెన్నిస్.....ఎన్ని ఆటలో....నన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పేదికాదు.నన్ను చూస్తే చాలు క్రీడాకారులు ఏం మెచ్చుకొనేవారో,ఎంత మురిసిపోయేవారో.నాక్కూడా ఎంత ఆనందమేసేదో మీ అందర్నీ చూస్తే. పాపం యిప్పటికీ ఆరితేరిన క్రీడాకారులు....వారి ఆటలకు నన్ను ఖచ్చితంగా వాడుతుండడం చూసి మహా సంబరపడిపోతాను.అలాగే చాలా గర్వన్గా ఉంటుందికూడా. మనం ప్రపంచవ్యాప్తంగా ఆడుతున్న క్రీడలకు ఉండాలి కదా!.పేరెన్నికగన్న ఒలింపిక్స్ ఆటలు సైతం.....నన్ను ముందు చూసుకోవలసిందే!. వాతావరణం సానుకూలంగా లేక, ఎక్కడైనా చిన్న తేడా వచ్చిన.....నన్ను చక్కగా తయారుచేసి సిద్ధం కావలసిందే. అంతేకాదు!రోజు నాదగ్గరకు ఉదయం,సాయంత్రం....క్రీడాకారులు ప్రాక్టీస్ కోసం రావడం....అలాగే చిన్న పెద్ద అని లేకుండా నడక కోసం వచ్చినవారితో ఎంత కోలాహలంగా కనిపిస్తానో! కాకపోతే ! ఎంచక్కా నా దగ్గరకు గతంలో ఎలా వచ్చేవారో అలా యింకా రావాలని ఆశ. అక్రమార్కుల చేతిలో పడకుండా వుండాలని,స్థలాల కరువు ఎంత వచ్చినా, నేను మాత్రం యిలాగే వుండాలని .....మీ కళ్ళల్లో సంతోషాన్ని చూసి పొంగిపోవాలని కోరుకుంటున్నా. అప్పటిలాగే
సైకిల్ మీద వచ్చి పుల్లైసుక్రీము అమ్ముతుంటే...కొనొక్కొని,చెమటలు పట్టేసి ,బట్టలు తడిసిపోయినా ఖాతరు చేయకుండా....ఆనందంగా ఆడాలని,ఆరోగ్యన్గా వుండాలని తపనపడుతున్నా. నా దగ్గరకు వస్తారని వేయికళ్లతో ఎదురు చూస్తూ వుంటాను....వస్తారు కదూ....వుంటాను.....ఇట్లు, జయప్రభాశర్మ.
Comments
Post a Comment