Nanamma Vantillu మా నానమ్మ వంటిల్లు ఇప్పుడు తలపుకొస్తే ఎంత ముచ్చటేస్తుందో. భలేగా ఉండేది.గేసుపొయ్యి అంటే చచ్చేంత భయం. వాడేది కాదు.ఎంచక్కా బంకమట్టితో స్వయంగా ఒక మంచి రోజు చూసుకొని,పొయ్యి వేసుకొని, కొట్టించి షెడ్డులో ఉంచిన కర్రలతో మంట పెట్టి, యిత్తడి గిన్నెల్లో మాత్రమే వంట చేసి,వంట పూర్తవగానే మళ్ళీ ఆవు పేడతో అలికి ముగ్గుపెట్టి ఉంచుకొనేది మర్నాటికి.వంట పూర్తికాగానే మా తాతగారికి ప్రత్యేకమైన పెద్ద పీట వేసి,దగ్గరుండి వడ్డించేది.తాతగారి భోజనమవగానే అదే కంచంలో మా నాన్నమ్మ భోజనం చేసేది.నాన్నమ్మ సంవత్సరానికి సరిపడా, ఆవకాయ, మాగాయ తయారు చేసి పెద్ద పెద్ద గూనల్లో పెట్టి, వాటికింద మట్టు పెట్టి, అటక మీద ఉంచేది.వడ్డనకు కావలసింది చిన్న రాచిప్పలో తీస్తూ ఉండేది. పండించిన పొట్టుమినపప్పు నానేసి, పెద్ద రుబ్బురోల్లో రుబ్బి,నానబెట్టిన బియ్యం పిండి దంచి,అట్లు ఇనప పెనంపై వేస్తె, తింటుంటే తినాలనిపించేలా ఉండేవి. బియ్యంనూకైతే తిరగలిలో మాత్రమే విసిరేది. అడ్డకచ్చా, కాళ్లకు అల్లిక కడియాలు,కుత్తిగంటు, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతోఉండేది.చచ్చేంత మడి. మునసబమ్మ అని పిలిచేవారు అందరు.నేను తాతగారింటికి వెళ్తే తెల్లారేసర...