వృద్ధాప్యం 

 ఈ అందం, ఈ బింకం, ఈ ఆరోగ్యం ఈ వయసు శాశ్వతమా!!ఊహు!! అందరం వృద్దాప్యం అనుభవించాల్సిందే.తప్పదు. కానీ!! వృద్ధులనేసరికి వాళ్లకి ఆసరాగా నిలిచేవాళ్ళెంతమంది వున్నారు!!మంచి మాటలాడి....మంచి మనసుతో ఆదరించి అక్కున చేర్చుకున్న నాడు పసిపిల్లలై ఎంత పొంగిపోతారో!! అబ్బే!! వాళ్ళు మాట్లాడితే విసుగు, వాళ్ళ చేతలు విసుగు, వాళ్ళు చేసే ప్రతీ పనికి విమర్శలు. ఎంత చిన్నబోతారో కదా!!వృద్ధులు చిన్నపిల్లలతో సమానమంటారు. వాళ్ళని అర్ధం చేసుకొని బాగా  చూసివుంటే ఈనాడు వృద్ధాశ్రమం అన్న పేరే వినిపించకపోనేమో!!ఎక్కడో పుట్టి పెరిగిన కోడలు,అభం శుభం తెలియని మనుమలు, విసుక్కున్నా అర్ధముందేమో కానీ కన్న కొడుకులే ..కఠిన పాషాణ హృదయులైనప్పుడు...ఎవరికి చెప్పుకోవాలి వారి ఆవేదన...ఆ బాధ వర్ణనాతీతం.మనసులో కుమిలిపోతూ,  కడుపు తీపి మమకారం,ఎవరికి అంతుపట్టని ఒక కావ్యం.ప్రేమావాత్సల్యపు సాగరం.ఎంత దుఃఖాన్నైనా భరించే శక్తి ఆ భగవంతుడు ఒక్క తల్లి తండ్రులకు మాత్రమే ఇచ్చాడనుటలో ఏ మాత్రం సందేహం లేదు!!

                       పిల్లలే లోకంగా జీవించి, ఆశల కలలు కంటూ,  వారి భవిత బంగారం కావాలని ఆసిస్తూ, కష్టనష్టాల ఎదురీతలో కొట్టుమిట్టాడుతూ, కంటికిరెప్పలా కాపాడుతూ, కనీ పెంచిన అమ్మానాన్నలకు ఇచ్చే కానుక!! నస, సుత్తి,ముసలివాసన మొదలగు పురస్కారాలు!!. పూర్వకాలంలో తల్లితండ్రికి కొడుకిచ్చే మర్యాద,తాత బామ్మలకు మనుమలిచ్చే గౌరవం, మాటల్లో చెప్పలేనంతగా ఉండేది.తాత ఆడించే ఆటలు, బామ్మ చెప్పే కధలు వింటూ ఆనందకర వాతావరణంలో పెరిగేవారు. పెద్దావిడ  చేతి వంట తిని ఎంత సంబరపడిపోయేవారో ఇంటిల్లిపాది.
                   
                   మరి ఈనాడు ....చదువులు, ఉద్యోగాలు, ఉరుకులు పరుగులు. యాంత్రిక జీవనం.  కాళ్లలో పడుతూ వీళ్ళేమిట్రా బాబు!! అన్న ఆలోచనా విధానం. ఎక్కడికి  వెళ్ళగలరు ఆ వయసులో!! ఎవరాదరిస్తారని!! వాళ్ళకీ ఎన్నో ఆలోచనలుంటాయి, బరువుగా ఉన్నామని,భాద్యత మోస్తున్నారని!!కానీ!! అభద్రతా, అశక్తి, అనారోగ్యం ....కదలలేని నిస్సహాయత. ఎంతైనా భరించి ఉండగలిగినా....అది కూడా భారమై ....బరువును దించుకొనె ప్రయత్నం పేరే వృద్ధాశ్రమం!!.
                       నవమాసాలు మోసి కనీ పెంచి పెద్దచేసిన తల్లి,గుండెలపై నిద్రపుచ్చి, వేలుపట్టి నడిపించిన నాన్న, కన్న కొడుకుకి భారమైనా....మనసున్న మారాజులెంతమందో.ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ముక్కు మొహం తెలియకపోయినా మేమున్నామంటూ ఆసరాగా నిలిచిన మహానుభావుల నిలయాలు ....వృద్ధాశ్రమాలు.ఆ మనసు భగవంతుడిచ్చిన వరం.లోకంలో ఇంకా మిగిలుంది మంచితనం.అలాంటి వారిని ప్రోత్సహిద్దాం.చేయూత నందిద్దాం. వృద్ధాప్యం మాత్రం కాకూడదు శాపం.వృద్ధులందరికి, వృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు.రాబోయే రోజుల్లో వృద్ధులందరికి ప్రతి రోజు పండగ కావాలని కోరుకుంటూ....జయప్రభాశర్మ. 


Comments

Popular posts from this blog

Articles