వలస కార్మికుల కష్టాలు
రచన:జయప్రభాశర్మ


                    ఉన్నవూరిలో బతుకు భారమై పొట్టకూటికోసం పరరాష్ట్రం పరుగులు. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు.కడుపుకింత తిండికోసం అష్టకష్టాలు.ఏదో మా బతుకు మేము  బతుకుతున్నాం అనుకుని తృప్తి పడుతున్నతరుణంలో ఎక్కడ్నుంచి ఊడిపడిందో, రాకాసి మహమ్మారి కరోనా అట. మా కడుపు కొట్టి,మా పిల్లాపాపల్ని ఎంత హింసకు గురి చేసిందో చెప్పలేం.మీరు ఇంక పనికి రావద్దు, అని యజమాని చెప్పిన పిడుగులాంటి వార్తతో, ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి.కాలు, చెయ్యాడక, నోటి మాటరాక దీనస్థితి.ఎంత కష్టమైనా, ఇష్టంగా భావిస్తూ, ఇంటివారికి మూడుపూటలా కడుపునిండా  అన్నం పెట్టగలుగుతున్నామన్న తృప్తితో జీవిస్తున్న మాకు ఇటువంటి పరీక్ష ఎదురవుతుందని కలలో కూడా వూహించలేకపోయాము.యజమాని ఇచ్చిన షెడ్డుల్లో కొంతమంది ఉంటే,ఇంకొంతమంది ఏ ఫుట్పాత్లమీదో,  బషెల్టర్లలోనో కాలక్షేపం చేస్తూ గడుపుకోవడం.అదికూడా ఇప్పుడు లేదు, ఉన్నపళంగా  మీ ఊళ్ళు వెళ్లిపోండి అని చెబితే ఎలా వెళ్ళేది. ఏరకమైన  వాహనాల జాడ లేదు.నిర్మానుష్యమైన రోడ్లు,మనుష సంచారం లేని నగరాలు.బాధ పంచుకునేందుకు నా అన్నవారు కానరాక, ఆఖరికి ఒకటే నిర్ణయం.ఎంత దూరమైన కాలినడకన మన వూరు చేరుకోవాలని ధృడనిశ్చయం. ఐన ఆశ చావక, ప్రభుత్వం ఏదైనా చేయకపోదాఅని ఎదురు చూసి, ఆశ అణగారిపోగా చివరికి తెగించి పిల్లాపాపలతో సొంతవూళ్లకు ప్రయాణం కొనసాగించాం.ఇహ అక్కడినుంచి మొదలయ్యాయి అసలైన పాట్లు. కాలికి చెప్పులైనా లేక, నెత్తిమీద బరువైన మూట, ఒక చేతిలో మరో బరువైన మూట, ఇంకొక చేతుల్తో పిల్లల్ని పట్టుకొని, భార్య భర్తలం మండువేసవిలో కాళ్ళు బొబ్బలెక్కినా లక్ష్యపెట్టకుండా వూరు  ఎలాగైనా చేరుకోవాలి అన్న తపన.అలుపన్నది మరచి,రాత్రనక,పగలనక,ఒంట్లో నలతగున్నా,పిల్లలు ఆకలని  అంటున్నా,పసిబిడ్డలు పాలకోసం ఏడుస్తున్నా మంచినీళ్ళతో మభ్యపెట్టి ఆకలితీర్చటం.దారిలో ఎవరైనా కుటుంబంలో అనారోగ్యంతో  వున్నా ఏం చెయ్యలేని అసమర్ధత.ఇంకా మించి మరణిస్తే అనాధశవమల్లె నా అన్నవారు లేక అంత్యక్రియలు చేసి మళ్ళీ పిల్లాపాపలతో పుట్టెడు దుఃఖంతో ప్రయాణం.ఒక మైలా, రెండు మైళ్ళా!! వందల మైళ్ళు నడవాలంటే ఎవ్వరి తరం కాదు.ఇదే కాలి నడక
 ఎవరైనా చేసుంటే,వారికి జెండాతో వీడ్కోలు, స్వాగతాలు, పూలదండలు, సన్మానాలు,పేపర్లో వేయటాలు,వాళ్ళ ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడాలు,పారితోషికాలు,జ్ఞాపికలు....ఒకటేమిటి! ఎన్నో.పేదోళ్ల బతుకులింతే మరి.పాపం,అప్పటికీ మానవత్వమున్న ఎందరో మహానుభావులు,మా కష్టాన్ని చూసి, కళ్లనీళ్లు పెట్టుకొని,బంధువుల్లా మా కడుపు నింపి, మాకు నిలువ నీడనిచ్చి అక్కున చేర్చుకోవటం మేము మరువలేని జ్ఞాపకాలు. అంతే కాదండోయ్ చెప్పులు కూడా కొత్తవి కొని ఇచ్చేవాళ్ళు కొందరైతే, వైద్యసేవలందించేవారు కొందరు.ఇలా అయ్యో పాపం అని కనికరించి, మాకోసం ఆలోచించి సేవలందించేవారెందరో.ఏదేమైనా, మా నడక మాకు తప్పనిది కదా.ఎండనక,వాననకా ఒకటే నడక.అసలు మాఊరంటూ కంటితో చూస్తామా అనిపిస్తోంది. కనిపించని ఆ దేవుణ్ణి తలచుకొని, భగవంతుడా!! మాకెందుకీ శిక్ష !!అని ఒకటికి పదిమార్లు అనుకోవలసివస్తోంది. ఒకపక్క రాకాసి కరోనా రక్కసి భయం.కోరుకున్నది ఒక్కటే!!కబళించే కరోనాకి బలికాకుండా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని. ఇంతకంటే ఇంకేమి కోరుకోవటం లేదు.అంతరాన చెప్పలేని బాధతో మాత్రం వెళుతున్నాం.విదేశాల్లో వుండేవాళ్ళని విమానాల్లో లక్షలు ఖర్చుపెట్టి,అతి భద్రంగా స్వదేశానికి తీసుకొచ్చిన వైనం.తీసుకురావటం మాకు కూడా ఎంతో ఆనందాన్నిచ్చింది. లోకంలో అందరు బాగుండాలనే కోరుకుంటాము.అలాంటిది,మనవాళ్ళని క్షేమంగా చేర్చటం చాలా సంతోషమేసింది.మాకు కూడా అందులో ఒక పావు శాతం ఖర్చుపెట్టి,వాహనాలు ఏర్పాటు చేసి పంపిస్తే  ఎంత బాగుండేదో కదా.ఏం చేస్తాం!!ఇంతే మరి!! ఇటుకలు,రాళ్లు,సిమెంటు మోసుకు బతికే వలస జీవులం.అందుకే అంటారు.తాజ్మహల్ చూసి మురిసి పోతాము గాని,కట్టిన కూలీలను గుర్తుపెట్టుకోమని. అలా గుర్తించిన మహానుభావులెందరో. ఏదేమైనా!! మా తలరాతని మార్చతరమా. ఎంత పెట్టి పుట్టామో అంతే మరి.మమ్మల్ని నిండు మనసుతో ఆదరిస్తూ,మాపై ప్రేమాభిమానాలు కురిపిస్తూ,మాకోసం ఎంతగానో పరితపిస్తు, మా కడుపు నింపుతున్న స్వచ్ఛందసేవాసంస్థలకి, సామాన్య ప్రజాసేవకులకు మా హృదయపూర్వక నమస్కారములయ్యా.ఏ బంధుత్వం లేకున్నా,బంధాలు లేకున్నా మీ పెద్ద మనసుకు దండాలయ్యా.చేతులెత్తి జోడించి అడుగుతున్నదొక్కటే.ఇప్పటికైనా ప్రభుత్వంవారు,  వాహనాలేర్పాటుచేసి మా గమ్యానికి చేర్చితే అదే పదివేలయ్యా.మా ఇబ్బందిని అర్ధం చేసుకుంటారని, వేయికళ్లతో వాహనాలకు ఎదురుచూస్తున్న, మళ్ళీ మీ పనులకు ఎప్పుడెప్పుడా అని ఆత్ర పడుతున్న....దీనావస్థలో ఉన్న,వలస కార్మికులు.తప్పులుంటే మన్నించండయ్యా.....దండాలు.


                      

Comments

Popular posts from this blog

Articles